బాలా త్రిపుర సుందరి. (కందములు ): - టి. వి. యెల్. గాయత్రి.-\పూణే. మహారాష్ట్ర.


బాలా త్రిపురాంబికవై 
శూలిని వరియించి తీవు శోభన మూర్తీ!
శ్రీలను కురిపించి ధరను 
పాలన జేసెడి జననివి వందనమమ్మా!//

నిండగు రూపముతో చని 
భండుని పుత్రుల దునిమిన పర్వత పుత్రీ!
అండగ నుందువు జనులకు 
దండము చేయుచు భజింతు దయగల తల్లీ!//

శంకరుని కై వెడలి యా 
వంకన తపమును సలిపిన పావన చరితా!
జంకును తొలగించు శుభద!
కింకరినై కొల్తు నిన్ను కృపగొనవమ్మా!

వేదన కల్గగ వేగమె 
నీదరి చేరితి పలుకుచు నీనామములన్ 
గాదనకమ్మా!బాలా!
పాదములే దిక్కు నాకు ప్రణతులు గొనుమా!//

కామెంట్‌లు