సుబ్బారావుకు ఎక్కడి నుంచి వచ్చిందో ఓ దిక్కుమాలిన అలవాటు, అదేనండీ! ప్రతిసారి కడుక్కున్న చేతులకు ఉన్న నీటిని తువ్వాలుతో తుడుచుకోకుండా విదిలిస్తాడు, దాంతో ఆ నీళ్ళ తుంపర్లు అన్నీ ఇంట్లోని వస్తువులమీద పడతాయి . అంతేకాదు భోజనo చేసేముందు కంచం తనే నీళ్ళతో కడుక్కుని అందులోని నీళ్ళు చుక్క కూడా లేకుండా ఉండేలా బాగా దులుపుతాడు. ఆ నీళ్ళు కూడా తుంపర్లుగా అన్నింటి మీద పడతాయి .ఈ దిక్కుమాలిన అలవాటు తనవరకు ఉంటే భేషుగ్గానే ఉండేది, అసలు ఈ కథ కూడా పుట్టేది కాదు! కానీ ఆ నీళ్ళ తుంపర్లతో వాళ్ళ ఆవిడ సుబ్బలక్ష్మి పడుతున్న తిప్పలు చూస్తే... ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయా? అయ్యబాబోయ్! పగవాడికి కూడా ఈ కష్టం వద్దురా బాబు! అనిపిస్తుంది.
"అన్నం వడ్డించవోయ్!" అని ఎప్పటిలాగే కంచం కడుక్కుని బాగా దులిపాడు సుబ్బారావు. అంతే ఆ కంచంలోని నీళ్ళు తుంపర్లుగా అక్కడే ఉన్న చల్లపెట్టె (ఫ్రిడ్జ్ )మీద పడ్డాయి, అంతటితో ఆగాయా... భోజనాల బల్ల దగ్గర ఉన్న ఖాళీ కుర్చీల మీద కూడా పడ్డాయి. సుబ్బలక్ష్మి పాపం! పూర్వకాలం ఇల్లాలు, భర్త అడగ్గానే హడావిడి పడుతూ అన్నం తెచ్చి వడ్డించింది. సుష్టుగా భోజనం చేశాక సుబ్బారావు చెయ్యి కడుక్కుని అక్కడ ఉన్న తువ్వాలుతో తుడుచుకోకుండా ఎప్పటిలాగానే తడిచేతులు విదిల్చి వెళ్ళిపోయాడు. ఆ చేతి నీళ్ళ తుంపర్లు సుబ్బలక్ష్మి ముఖం మీద కొన్ని, అక్కడే ఉన్న అద్దాల తలుపుల మీద కొన్ని పడ్డాయి.
ఇప్పుడు చూడండి ఇహ సుబ్బలక్ష్మి అగచాట్లు, భర్త తన అలవాటుతో తడి చేతులు దులిపితే, ఆ నీళ్ళు తుంపర్లుగా అన్నిటి మీద పడి, ఎండిపోయి మరకలుపడి అసహ్యంగా కనిపిస్తుంటే అసలే శుభ్రం ఎక్కువైన సుబ్బలక్ష్మి చూడలేక ఒక తడి బట్ట తీసుకుని, లేని ఓపిక కూడగట్టుకుని తుడుస్తూ... "ఈయనకి ఈ దిక్కుమాలిన అలవాటు ఎలా వచ్చిందో ఏమో! నా చావుకి వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా ఆ అలవాటు మార్చుకోరు, రామ రామా! తుడిచి తుడిచి నా నడ్డి పడిపోయింది రా దేవుడా! " అని సణుగుతూ ఆ నీటి మరకలు అన్నీ శుభ్రం చేసుకొని వచ్చేటప్పటికి, హాల్లో టీవీ చూస్తూ కూర్చున్న సుబ్బారావు కనిపించాడు. ఒళ్ళoతా హూనమయ్యేలా ఆ నీళ్ళ మరకలు అన్నీ తుడుచుకుని వచ్చిన సుబ్బలక్ష్మికి భర్త ఉల్లాసంగా టీవీ చూస్తూ ఉండడం చూసి సర్రున కోపం నషాళానికంటింది. "ప్రతిరోజు ప్రొద్దున్నే సామాను అంతా తడి బట్టతో తుడిచి శుభ్రం చేశాను. మీరు చేతులు కడిగిన ప్రతిసారి ఆ తడిచేతులు దులిపి, ఆ నీటి తుంపర్లు అన్నిటిమీదా వేసి హాయిగా టీవీ చూస్తూ కూర్చున్నారా? ఆ మరకలు మీరు తుడిస్తే అప్పుడు నా కష్టం మీకు తెలుస్తుంది, ఇంట్లో ఏ పనీ ముట్టుకోరు" భర్తను అరుస్తూ కోపంగా అంది సుబ్బలక్ష్మి. "ఇప్పుడు తుడవకపోతే ఏం పోయిందోయ్? టీవీలో మంచి సినిమా వస్తోంది హాయిగా చూడరాదూ!" భార్య కోపం పట్టించుకోకుండా వక్కపొడి నములుతూ అన్నాడు సుబ్బారావు. " మీరు తడి చేతులు దులిపితే పడిన ఆ నీళ్ళ తుంపర్ల మరకలు అన్నింటిమీద పడి ఎండిపోయి అసహ్యంగా కనిపిస్తూ ఉంటే తుడవకుండా ఎలావుంటాను? మిమల్ని కట్టుకున్నాక నా ముఖానికి సినిమా కూడానా? పనిమనిషిని తుడవమంటే నావల్ల కాదని చెప్పేసింది. రోజు మీతో ఈ బాధలు పడలేకపోతున్నాను, అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాను, చేతులు కడుక్కున్నాక శుభ్రంగా బట్టతో తుడుచుకోమని?" చెప్పి, చెప్పి ఆ అలవాటు మార్చుకోని భర్తతో విసిగిపోయి కోపంగా అరిచింది సుబ్బలక్ష్మి. భార్యతో రోజూ ఉండే గొడవే కనక "సరేలేవోయ్! రేపటి నుంచి కడుక్కున్న చేతులు తువ్వాలుకు తుడుచుకుంటా! నీళ్ళ తుంపర్లు పడేలా తడి చేతులు దులపను అని నీకు హామీ ఇస్తున్నాను" సినిమా చూడడంలో మళ్ళీ లీనమైపోయి అన్నాడు సుబ్బారావు. ఆ మాటలకి మరింత మండిపడుతూ..."ఎన్నిసార్లు ఇవ్వలేదు ఈ బోడి హామీ? మిమ్మల్ని మార్చడం నావల్ల కాదు, ఎక్కడ ఉన్నారో మా అత్తగారు, మహాతల్లి! మిమ్మల్ని కని నా ప్రాణానికి కట్ట పెట్టారు" అత్తగారిని కూడా కోపంలో కడిగిపారేసి నీరసంగా కుర్చీలో కూలబడింది సుబ్బలక్ష్మి.
ఇంత గొడవ జరిగింది కదా! మరి మరుసటి రోజు నుంచి భార్యకు ఇచ్చిన హామీ ప్రకారం సుబ్బారావు మారాడు అని అనుకుంటున్నారా? అబ్బే! అది పుట్టుకతో వచ్చిన అలవాటండి బాబు! మళ్ళీ రోజూ అదే తంతు! సుబ్బారావు ప్రతిసారి చేతులు కడుక్కుని, తడి చేతులు తువ్వాలతో తుడుచుకోకుండా ఆ చేతులకు ఉన్న నీళ్ళు విదిల్చి ఆ తుంపర్లు అన్నింటిమీద వెయ్యడం, సుబ్బలక్ష్మి అవి తుడుస్తూ భర్తపై రోజూ చిందులు తొక్కడం ఆ ఇంట్లో మాములే .
#################################

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి