లే.. కదలి రా సోదరా...: - కలమట శ్రీనివాస్ రావు -విశాఖపట్నం

 

నవసమాజ నిర్మాణానికి కదలిరా సోదరా...!

యువశక్తే దేశశక్తి...
దేశప్రగతికి మూలశక్తి!
ప్రశ్నించని నీజ్ఞానం,
ఎదిరించని నీ యవ్వనం వ్యర్థం.

సూర్యునివలె అవినీతి చీకట్లను చీల్చి,
అన్యాయంపై పిడికిలి బిగించి ఎదిరించు.
మౌనం వీడి, భయాన్ని వదిలి నీ శక్తిని చాటి,
రేపటి నవసమాజ నిర్మాణానికి శిల్పివై నిలబడు.
ఓ యువతా మేలుకో!
ఇకనైనా కళ్ళు తెరువు,
కపట నిద్ర మానుకో!

నీకు నువ్వే తడబడుతూ...
నడక నేర్చిన నీకు, దవుడు తీసే నీకు దారి చూపాలా ఇంకా నిదుర లేపాలా?
నిశ్శబ్దమే విడిచి, గలగల మాట్లాడే నీకు,గర్జించిన సింహాన్ని చూపి గళం విప్పి నిజం నిగ్గు తేల్చమని అడగాలా
వడివడిగా నడిచే సమయమిదే!
నీ చుట్టూ అన్యాయం అనాగరిక కాలాన్ని గుర్తుచేస్తుంటే,
ఆడపిల్ల అబల కాదు సబలని నిలుస్తున్న నాడు కూడా...
చిదిమేస్తున్నాయి రాక్షస హస్తాలు!
సమాజపు కంటికి కనిపించని,
తోటి మనుషుల రూపంలో తిరిగే ఆ దానవుల వలన...
ఆమె ఆర్తనాదాలు నీకు వినిపించవా?
రాలుతున్న పువ్వులా సమాజంలో ఆడపిల్ల ఘోషలే నీ చెవిని చేరుతున్నా,
నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నావా...?
న్యాయం ఎక్కడ? ధర్మం ఎక్కడ?
ఆడపిల్లకు రక్షణ ఎక్కడ?
అని అడగాల్సిన నీవెక్కడ?
లే... కదలిరా సోదరా...
ఇకనైనా కళ్ళు తెరువు, కపట నిద్ర మానుకో!


నోటుకు ఓటును అమ్ముకుంటే,
స్వార్థపు నీడన ప్రజాస్వామ్యం నలిగిపోదా?
కోట్లు కుమ్మరించి గెలిచినోడు,
ఐదేళ్లలో నీ, నా, మన భవిష్యత్తును దోచేయడా?
దేశ ప్రగతికి పునాదులైన అభివృద్ధి, నీతి, న్యాయం, ధర్మాలు.. వంటి ఆశలు 
అడియాసలైపోవా?
దానవులై డబ్బు పంచినోళ్ళే,
పాలకులై పీఠం ఎక్కితే...
సేవ చేసే గుణమున్నోల్లే,
నిజమైన నాయకులుగా రాగలరా?
మార్పు కోరుకునే ఓటరుగా,
నీ ఓటు విలువను బాధ్యతతో తెలుసుకో!
నోటుకు లొంగనని నైతికతతో,
నిజమైన నాయకుల్ని గెలిపించుకో!

సామాన్యుని చిదిమేసే రాబందులు రాజ్యమేలుతుంటే,
అవినీతి కోరలు చాచి నవ్వుతుంటే...
ఇంకా ఎంతకాలం భరిస్తావు ఈ నిశ్శబ్ద నరకాన్ని?
తాత్కాలిక ప్రలోభాలకు లొంగి,
ప్రశ్నించే హక్కును వదులుకొని...
పాలకులను నిలదీయగలవా?
దేశప్రగతి అవినీతి కోరల్లో బంధీ అయితే,
ఎన్నాళ్లీ నిర్లక్ష్యం? 
ఓ సైనికుడివై కదలిరా!
రా... కదలిరా సోదరా...
ఓటే నీ ఆయుధం... మార్పే నీ లక్ష్యం!
దేశ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది,
అవినీతి రహిత భారతం నీతోనే సాధ్యం!
సరికొత్త భవిష్యత్తుకు నువ్వే దిక్సూచివై...
రా... కదలిరా... సోదరా!
చైతన్యపు తొలి శంఖారావమై అడుగు ముందుకేయి,
అవినీతి నిర్మూలనలో భాగస్వామివై...
అవినీతిని అంతం చేద్దాం... నవభారతాన్ని నిర్మిద్దాం!
నవీన భారతావనే...
మనం రేపటి తరానికి ఇచ్చే నిజమైన బహుమతి!

కామెంట్‌లు