విద్యార్థులకు పుస్తకాల పంపిణీ.. మధులతా శ్రీనివాస్‌కు ఘన సన్మానం
తాండూరు: భారత మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను వికారాబాద్ జిల్లా తాండూరులోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. శ్రీ రామకృష్ణ సేవాసమితి, బాలల మాసపత్రిక ‘మొలక’, శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు బాలకృష్ణ, గౌరవ అధ్యక్షుడు గాజుల బసవరాజ్, కవయిత్రి మొల్ల కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ కేవీఎం వెంకట్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ మధులతా శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి విశేష సేవలందించిన మహనీయుడని కొనియాడారు. సాధారణ కుటుంబంలో జన్మించి, పేపర్ బాయ్‌గా జీవితాన్ని ప్రారంభించి, తన కృషి, పట్టుదలతో శాస్త్రవేత్తగా, దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన ప్రజల రాష్ట్రపతిగా ఎదిగారని గుర్తుచేశారు.
‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అనే సందేశంతో కోట్లాది మంది విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారని పేర్కొన్నారు. విద్యార్థులు కలలు కనడమే కాకుండా, వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. అబ్దుల్ కలాం జీవితం ప్రతి విద్యార్థికి ఆదర్శమని తెలిపారు.
మధులతా శ్రీనివాస్‌కు ఘన సన్మానం
అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోట్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ మధులతా శ్రీనివాస్‌ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా వక్తలు ఆకాంక్షించారు.
ప్రతిభావంతులైన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారి ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవాసమితి గౌరవ అధ్యక్షుడు బసవరాజ్, అధ్యక్షుడు బాలకృష్ణ, ప్రోగ్రాం కన్వీనర్ కేవీఎం వెంకట్, శ్రీనివాస్ రెడ్డి, అనంతరెడ్డి, కూటం చంద్రశేఖర్, కవి యూసుఫ్, వెంకట్ వంశరాజు, ప్రభు శంకర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు వైశాలి, కార్తీక్, సాయి తేజ, కార్తికేయ, రేవన సిద్ధేశ్వర్, అర్జున్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి