ఒక్కేసి పువ్వేసి....: -డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.


 పూలు పులకించిన వేళలో
పుడమి రంగుల మయమైంది.
తంగేడు,గునుగులు కుమ్మకై
బంతి,చేమంతులతో జతకట్టాయి.
పట్టుకుచ్చులు,పోక,పట్నాలు
గుమ్మడాకులపై పునాదులై నిలిచాయి.
గులాబులు,మందారాలు గుర్తులుగా,
మిగిలిన పూలన్నీ సోపతి కట్టాయి.
పూల దర్బారులో పేర్చిన ఎత్తుల
పైఎత్తుల పైన ఠీవిగా కొలువుదీరాయి.
ప్రకృతి పచ్చకోకలు కట్టి,
పచ్చనాకులన్నీ పేరంటానికి కూడబలుక్కొని వచ్చినట్లున్నాయి.
చెరువులు పుట్టినిళ్ళై స్వాగతాలు పలుకుతున్నాయి.
ఆట,పాటలు చేతుల్లో చేతులేసుకొని పలకరించుకుంటున్నాయి.
ఫలహారాలు పంచుకుంటున్న దృశ్యాలు పరవశించిపోతున్నాయి.
సద్దులు పొద్దుగూకే సమయాల్లో
రసనల రుచులనద్దుతున్నాయి.
లయ,తాళాలతో పదాలు పందెం కట్టాయా అన్నట్లు పోటీ పడుతున్నాయి.
ఆడపడుచుల ఆనందాలు ఆకాశాన్ని తాకుతుండగా,
అవని పులకించి శోభాయమానంగా అవతరించింది.
కామెంట్‌లు