స్మృతుల సవ్వడులు! : - పాలగుమ్మి జ్యోతి.


నలుగు పెట్టి స్నానం చేయిస్తూ...
గోరుముద్దలు ఆప్యాయంగా తినిపిస్తూ...
వీరీ వీరీ గుమ్మడి పండు ఆడిస్తూ... 
లయబద్ధంగా జోల పాట వినిపిస్తూ...
మ్రోగుతున్నాయి అమ్మ చేతి గాజులు!!

పప్పు రుబ్బుతూ పొత్రంతో పడ్డ అగచాట్లకు 
కట్టెల పొయ్యి రాజేయడానికి పడ్డ పాట్లకు 
వంట ఇంట్లో ఇంగువ పోపు ఘాట్లకు
అతిధులను ఆదరించే అలవాట్లకు 
మ్రోగుతున్నాయి అమ్మ చేతి గాజులు!!

బావిలో నీళ్ళు తోడి చెమటకు తడుస్తూ...
పాదులు తీసి చెట్లకు నీళ్ళు పోస్తూ...
పూలు కోసి  మాలలు దేవునికి వేస్తూ...
సహస్రనామాలను భక్తితో పఠిస్తూ ...
మ్రోగుతున్నాయి అమ్మ చేతి గాజులు!! 

ఆశలు నెరవేర్చిన అమృతగని 
వెంట నిలిచిన విజయ ధ్వని 
ఇప్పుడూ మ్రోగుతూనే ఉన్నాయి 
జ్ఞాపకాలలో అమ్మ చేతి గాజులు!!
కామెంట్‌లు