కూత్తనూర్ సరస్వతి ఆలయం: - - యామిజాల జగదీశ్
 


తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో నన్నిలం తాలూకాలో ఉన్నది కూత్తనూర్ సరస్వతీ దేవి ఆలయం. ఈ దేవాలయం మైలాడుదురై - తిరువారూర్ రైల్వే లైన్‌పై పూంతోట్టం గ్రామానికి సమీపంలో ఉంది. ఇది విద్యా దేవత అయిన సరస్వతికి కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక దేవాలయం. 2018 జూలై 1న సరస్వతీ దేవిని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం సరస్వతి పూజ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
దేవాలయం ముందు భాగంలో మూడు అంచెల రాజగోపురం ఉంది. ముందు హాలు చెక్కడాలతో అలంకరించారు. ముందరి హాలులో అమ్మవారి గది ఉంది. ఈ గుడికి సంబంధించి రెండు శాసనాలు మాత్రమే ఉన్నాయి. 
సరస్వతి దేవి తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని తామరపువ్వుపై ఆసీనురాలై, తన కుడి క్రింది చేతిలో చిన్ముద్ర, ఎడమ చేతిలో ఒక పుస్తకం, కుడి పై చేతిలో అక్షరాల దండ, ఎడమ పై చేతిలో అమృత కలశాన్ని పట్టుకొని ఉంటుంది.
తమిళ కవి ఒట్టకూత్తర్ సరస్వతీ దేవి అనుగ్రహం పొంది ఆమెను పూజించారు. అందుకే ఆలయం ఉన్న ప్రదేశానికి కూత్తనూర్ అనే పేరు వచ్చింది. ఒట్టకూత్తర్ గాన సామర్థ్యాన్ని పొందడానికి కళా దేవతను పూజించాలని కోరుకున్నారు. అతను కూత్తనూరులో ఒక పూల తోటను ఏర్పాటు చేసి దక్షిణంగా ప్రవహించే అరిసోల్ నది నీటితో అభిషేకం చేసి, ప్రతిరోజూ దేవతను పూజించేవారు. ఒట్టకూత్తర్ సేవకు సంతోషించిన దేవత తన పవిత్రమైన తంబూరాను అతనికి ఇచ్చి, అతన్ని కవిగా చేసిందన్ధది ఓ కథనం. తనపై గొప్ప అనుగ్రహం చూపిన కూత్తనూర్ సరస్వతి నదీ తీరంలో నివసించేదని ఒట్టకూత్తర్ ఒక పాట కూడా పాడారు. 
ప్రజలకు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించే ముందు ఇక్కడి చదువుల తల్లి దీవెనలు పొందడానికి ఇక్కడికి తీసుకువస్తుంటారు. పాఠశాల విద్యార్థులు కూడా తమ విజయం కోసం ప్రార్థించి, తమ పరీక్ష మార్కులను ఇక్కడి ఆలయంలో అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకుంటారు. సరస్వతీ దేవి తమకు విద్యా విజయాన్ని ప్రసాదిస్తుందని ఇక్కడి భక్తులు నమ్ముతారు.
కామెంట్‌లు