"సరస్వతి పుత్రికలుగా నలుగురు కూతుళ్లు... తండ్రి కలలకు విజయ రూపం"
ఒకరు ప్రభుత్వ ఉద్యోగి... ఒకరు జర్మనీలో... ఒకరు యూపీఎస్సీ లక్ష్యంగా... మరొకరు ఎంబీబీఎస్‌లో
సరస్వతి పుత్రికలుగా తీర్చిదిద్దిన నర్సింహులు కుటుంబం
వికారాబాద్ జిల్లా: మద్గుల్ చిట్టెంపల్లికి చెందిన సి.హెచ్. నర్సింహులు స్వరూప కుటుంబం నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. కుమార్తెలను భారంగా కాకుండా భవిష్యత్ ఆస్తిగా భావించిన ఆయన, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా చదువులో రాజీ పడకుండా నలుగురు కూతుళ్లను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. నేడు ఆ నలుగురు కుమార్తెలు తమ ప్రతిభతో కుటుంబానికే కాకుండా గ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
అక్షయ ఎంబీబీఎస్ సీటుతో మరో ఘనత
కుటుంబంలోని చిన్న కుమార్తె సి.హెచ్. అక్షయ విద్యలో ప్రతిభ కనబరిచింది. తాండూరులోని తెలంగాణ గురుకుల పాఠశాల బాలికల (TGRJC)లో 10వ తరగతిలో 10/10 GPA సాధించింది. అనంతరం వికారాబాద్‌లోని సంగం లక్ష్మి బాయి గురుకుల బాలికల పాఠశాల (SLB TGRJC)లో ఇంటర్మీడియట్ చదివి 977 మార్కులు పొందింది.
నీట్ (NEET) పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 3,05,746 సాధించి, నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ఎంబీబీఎస్ సీటుసాధించి
రెండో సంవత్సరం చదువుతుంది .
గురుకుల పాఠశాలలో చదువుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి చేతుల మీదగా ల్యాప్ టాప్ బహుమతిగా అందుకున్నారు.
పెద్ద కుమార్తె ప్రసన్న ప్రభుత్వ ఉద్యోగంలో
కుటుంబంలోని పెద్ద కుమార్తె బి.సి. వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, మొదట ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అనంతరం ప్రభుత్వ రంగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించి విధులు నిర్వర్తిస్తున్నారు.
రెండవ కుమార్తె జర్మనీలో ఉన్నత విద్య
రెండవ కుమార్తె అర్చన బి.సి. వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, పూర్తి ఫీజు మినహాయింపుతో వి.జె.ఐ.టి (VJIT)లో బీటెక్ పూర్తిచేశారు. ప్రస్తుతం జర్మనీలో ఎలక్ట్రికల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చదువుతూ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతున్నారు.
మూడవ కుమార్తె కీర్తన యూపీఎస్సీ లక్ష్యంగా
మూడవ కుమార్తె కూడా 5వ తరగతి నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోనే చదువుకొని, ఆర్థిక సహకారంతో బీటెక్ MGIT పూర్తిచేశారు. ప్రస్తుతం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కోచింగ్ తీసుకుంటూ ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నారు.
తల్లిదండ్రులే విజయానికి పునాది
కుమార్తెల చదువుపై విశ్వాసం ఉంచిన నర్సింహులు దంపతులు, ఎన్ని కష్టాలు ఎదురైనా విద్య విషయంలో వెనుకడుగు వేయలేదు. వారి ప్రోత్సాహం, క్రమశిక్షణ, విలువలే నలుగురు కుమార్తెల విజయాలకు బలమైన పునాది అయ్యాయి.
"కుమార్తెలు భారమని కాదు... భవిష్యత్తు వెలుగులని నిరూపించిన కుటుంబం"
నేడు ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు విదేశాల్లో ఉన్నత విద్యార్థిని, ఇంకొకరు సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా సాగుతుండగా, అక్షయ వైద్య విద్యలో అడుగుపెట్టడం ఈ కుటుంబ విజయగాథకు మరో మైలురాయిగా నిలిచింది. తండ్రికి తగ్గ కూతుళ్లుగా, సరస్వతి పుత్రికలుగా ఎదిగిన ఈ నలుగురు సోదరీమణులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి