వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
192. సుఖప్రదా (చతురక్క్షరీ)
193. దుష్టదూరా (చతురక్క్షరీ)
నూట తొంభై మూడవ నామ మంత్రము:
ఓం దుష్టదూరాయై నమః
దుష్టదూరా = దుష్టులకు అందనిది / దూరముగా ఉండేది.
సందర్భ రహితంగా, ఆలోచన లేకుండా కుతర్కము / వితర్కము చేసేవారు, తన దరికి చేరలేరు అని తెలుపుతూ ప్రకటితమైన చాముండేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు, "దుష్టదూరా" అని అమ్మను కీర్తించారు. దుష్టులకు దూరంగా ఉంటాను అని చెప్తూనే, వారిని మంచి మార్గములోకి మరలించి, మేలు చెకూర్చే జగన్మాత కు నమస్కారము.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు అనే అరిషడ్వర్గాలకు బానిసలై, దైవదూషణ చేస్తూ, జ్ఞానులను, తల్లిదండ్రులను, తోటివారిని, గురువులను, సమాజంలో తనకు మంచి చెప్పబోయే వారిని కూడా దుర్భాషలు ఆడేవారి మనసు, ఎల్లప్పుడూ చెడు ఆలోచనలతో నిండి ఉంటుంది. అటువంటి వారు, ఏ విషయం గురించి కూడా నిలకడగా ఉండలేరు. మాట్లాడలేరు. అటువంటి వారిని, తాత్కాలికంగా, మన మానవ ప్రపంచంలో తల్లి కూడా దూరం ఉంచుతుంది. ఎందుకంటే, ఆ తల్లి నుండి దూరాన్ని భరించలేక, బిడ్డడు, ప్రవర్తన మార్చుకుంటాడు, అని. మరి, ముజ్జగాలకూ తల్లి కదా! కాత్యాయని. ఈమె కూడా, మన ఉన్నతి కోసం కొంతకాలం దూరం పెడుతుంది. అందువలన, కమాలాలయ, "దుష్టదూరా" అని పిలువబడుతుంది.
ఎప్పుడూ ఎదుటివారిలో తప్పులనే వెదకడం, వారి మంచిని తెలుసుకోక పోవడం, ఇవి పూర్వ జన్మలో చేసిన చెడు కర్మల ఫలితాలు అవవచ్చు. లేదా, ఈ జన్మలో చెడ్డ గుణములు ఉన్నవారితో స్నేహం చేయడం వలన కలిగే ఫలితాలు, ఇవి. పాలలో నీళ్ళు కలిపితే, నీటికి నీటి గుణమే ఉంటుంది కానీ, పాల గుణం రాదు. అందువలన, మనం ఎదుటి వారిలో ఉన్న చెడులక్షణాలకు దూరంగా ఉండాలి, అని "దుష్టదూరా" అనే అమ్మ నామం మనకు తెలియ జేస్తుంది.
అయితే, ఎటువంటి చెడు లక్షణాలు లేక మంచి లక్షణాలతో ఉన్న జీవులైనా, ఆ త్రిజగన్మాత యొక్క బిడ్డలే కదా. మన చుట్టుపక్కల ఉన్న వారు మంచివారుగా మారితే, సమాజం మంచిగా మారిపోతుంది. తద్వారా, రాష్ట్రం, దేశం కూడా మంచిగా మారతాయి. అందువలన ప్రతీ రోజూ మన ప్రార్ధన లో "సర్వేజనా సుఖినోభవంతు" అని కాకుండా...... "సర్వే జనా సుజనో భవంతు ! సర్వే సుజనా సుఖినోభవంతు !! భవంతు కృతపుణ్యానామ్ !!!" అని ప్రార్థించుదాము. అంటే, "అమ్మా! నీ సంతానం మొత్తాన్ని ముందు మంచివారిగా చేయి. అలా మంచివారిగా మారిన అందరినీ సుఖంగా ఉంచు. అలా సుఖంగా ఉన్నవారు అందరూ చేసే పనులు, సమాజానికి మంచి చేసేవిగా ఉండేవిధంగా చూడు, తల్లీ!!!" అని."
ఎవరో పెద్దవారు చెప్పినట్టుగా, "అందరూ బావుండాలి. అందులో నేనుండాలి " అని శ్రీమాత ను, క్రోధశమనినీ ప్రార్ధన చేద్దాము.
దుష్టులకు దూరంగా ఉండడం, సమాజ శ్రేయస్సుకు కీలకం అని తాను ఆచరిస్తూ, శ్రీకాంత, మనకు ఉపదేశిస్తోంది అని తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం దుష్టదూరాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి