ఇక్కడ జయసేనుడు ఆ రాక్షసుడు తనను కొండబిలం దరిదాపుల్లో దించి వెళ్ళగానే, ఆ వైపు దృష్టి సారించాడు. "వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు దైవానుగ్రహంతో ఈ రాక్షసుని వలన ఇక్కడి దాకా రాగలిగాను. అటుపై పైవాడి దయ," అనుకుంటూ తనతో తెచ్చుకున్న మిగిలిన ఆహారాన్ని భుజించాడు. కాసిని నీటిని సేవించాడు.ముందుకు వెళ్ళే కొలది దట్టమైన చెట్ల సమూహాంతో, లతల అల్లికలతో,అక్కడ
భయానక వాతావరణం అతని వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆ ఎత్తైన చెట్లకు అనేక తేనె తుట్టెలు పెద్ద ఆకారాలతో ఉండగా, తేనెటీగలు ఒకటే రణగొణ ధ్వనులు చేస్తున్నాయి. వాటిని తప్పించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇంతలో కొన్ని అడవి రాక్షస దున్నపోతులు వేగంగా రావటం గమనించాడు. "ఇంతటితో నా పని సరి," అనుకుని గబాలున ఒక చెట్టు వెనుకకు పరుగెత్తాడు. తను నడిచిన ప్రదేశం నుంచి అవి వేగంగా ముందుకు పరుగెత్తాయి. వాటి వేగానికి, బరువుకి అక్కడి వాతావరణం బీతావహంగా మారింది. పాములు సైతం గిట్టల కింద నలిగి చచ్చిపోయాయి.
"ఓరి భగవంతుడా! తృటిలో తప్పింది అపాయం," అనుకుంటూనే మరలా ముందుకు నడవసాగాడు జయసేనుడు. ఇంతలో ఆ కొండబిలం రానే వచ్చింది. విచిత్రం... అది ఒక మనిషి పట్టేంత సునాయాసంగా ఉన్నా, దానికి పెద్ద సాలెగూడు అడ్డంగా ఉంది. అది మామూలు సాలెగూడు కాదు; ఒక్కో పొర మోకులంత సైజులో, జిగురుతో ఉంది. అనేక సాలెపురుగుల అల్లిక అది!
అంతే, జయసేనుడు తన చేతిలోని ఖడ్గాన్ని నుదుటికి ఆనించి యక్షుడిని తలుచుకుని, ఆ రాక్షస సాలె దారాల బంధనాలను తెగనరకడం మొదలుపెట్టాడు. ఆ అపూర్వమైన ఖడ్గ ధాటికి ఆ సాలెగూడు కుప్పకూలింది. సాలెపురుగులలో కలకలం మొదలయింది. అటుఇటు పరికిస్తూ, "ఆ పరిసరాలలో తన సాలెదారపు బంధనాలను తెంచేంత శక్తి ఎవరిది?" అని వెతకటం మొదలెట్టాయి.
ఈ గలాటాకు లోపలి నుంచి ఒక మరుగుజ్జు వాడు బయటికి వచ్చి, వాటితో ఏదో మాట్లాడి మరలా లోనికి వెళుతున్నాడు. జయసేనుడు వాటిని తప్పించుకుంటూ ఆ మరుగుజ్జు మనిషిని అనుసరించాడు. కొంచెం దూరం వెళ్ళగానే అత్యద్భుతంగా ఒక బ్రహ్మాండమైన పెద్ద మెహల్ ఎదురయ్యింది.
"ఆహా! ఇంత భీకరమైన, జుగుప్సాకరమైన అడవిలో, ఒక పాడుపడిన కొండబిలంలో ఇంతటి రాజప్రసాదాలను తలదన్నే అందమైన మెహలా? ఎవరూ ఊహించలేనిది! ఇది ఒక మాయా మెహలే కానీ నిజమై ఉండజాలదు," అని అనుకుంటూ ఉండగానే... ఆ మరుగుజ్జు వాడు ఏదో మంత్రం చదువుతుండగా తలుపులు తెరుచుకోవడం, అతనిని అనుసరించే జయసేనుడు కూడా లోనికి ప్రవేశించడం, తలుపులు మూయబడటం క్షణంలో జరిగిపోయింది.
: సశేషం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి