అంతే ఆ పక్షి రివ్వున వీరి వద్దకు వచ్చింది.తనకు కనిపించిన ఆ అపరిచితుడు ఎటు వెళ్ళాడా అని వెతిక సాగింది.దాని చూపు రాక్షసుడిపై పడింది.అతనితో కలిసి వున్న వాడిని నీవే దాచేసావు అనే విధంగా ఆ రాక్షసుడిని హింసించే ప్రయత్నం చేసింది.అంతే జయసేనుడు తన కరవాలంతో ఆ వింత పక్షిని ముక్కలు ముక్కలు చేసాడు. అంతటితో దాని ప్రాణాలు విడిచింది.జయసేనునికి ధన్యవాదాలు తెలిపి, ఇక్కడి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది.వీరుడా నా భుజములు అధిరోహించు.ఆ శివకేశవుల గుడి వున్న కొండ ప్రాంతం చేరుస్తాను అని తొందర చేసాడా రాక్షసుడు.అలాగే మిత్రమా ఏమాత్రం ఆలస్యం చేయను అనుకుంటూనే అతని భుజముల పైకి చేరాడు జయసేనుడు. అంతే వేగంగా వడి వడి అడుగులతో దారిలో ఎదురయ్యే చిన్న చిన్న అవాంతరాలను ఎదుర్కొంటూ దైవం కొలువుదీరిన ఆ కొండ దిగువన ఆగాడు ఆ రాక్షసుడు.జయసేనుడు కిందికి దిగి నిజరూపం లోకి మారిన అతనికి కృతజ్ఞతలు తెలిపాడు ఆ రాక్షసుడు.వీరుడా ఆ గుడిలోకి రావటానికి నా శక్తి సహకరించదు కావున నీవు పైకి వెళ్ళి ఈ బృహత్తర కార్యాన్ని నిర్విఘ్నంగా జరిగేలా చూడు.నీకోసం నేను ఇక్కడే నిరీక్షిస్తాను.నీకు శుభమగుగాక అని పలికాడు ఆ రాక్షసుడు.అలాగే అని అదృశ్య రూపంలో కొండపైకి వున్న మెట్లు సహాయంతో దాన్ని అధిరోహించాడు జయసేనుడు.చీకటి పడే వేళయినది.పైకి వెళ్ళేకొలది ఆకాశంలో చుక్కలు దర్శనం ఇస్తున్నాయి.చంద్రుని వెన్నెల వెలుగులు తనువుకు తాకగా ఆనందం వెల్లివిరిసింది జయసేనుని వధనంలో.గుడిని సమీపించాడు.లోనికి వెళ్ళాడు. అక్కడ ఒక వేదికపై పూజా పునస్కారం లేక వెలవెల బోతున్న చిన్న శివలింగం దానిపై ఒక ఇత్తడి లోహ పాత్ర నీటి బొట్టు పడే రీతిగా అమర్చి వుంది.పక్కనే తాటిపండు పరిణామంలో విష్ణువు సాలగ్రామం రూపంలో దర్శనమిచ్చింది.ఆ వేదికకు ఎదురుగా ఒక చిన్న నంది వున్నది.ఆ దైవాలకు మనస్పూర్తిగా నమస్కరించి గుడి వెలుపలకు వచ్చాడు.తను భద్రంగా దాచిన హారాన్ని బయటికి తీసాడు.అంతే ఆ హారముపై వెన్నెల వెలుగులు పడగానే జిగేల్ మని ఆ మణులు మెరవటం మెదలైంది.ఇదే అదునుగా జయసేనుడు చేతిలోనుండి కరవాలాన్ని తీసి ఆ పతకంపై మోదాడు మరలా మరలా ప్రయత్నించాడు. ఇసుమంతైనా చెక్కు చెదరలేదు.ఈ పథకానికి ఈ ఖడ్గం శక్తి చాలడంలేదు.ఇంకేమైనా చేయాలి అని గుడిలోకి వెళ్ళాడు.అతని కంటికి సాలగ్రామం ఓ మెరుపులాంటి ఆలోచనకు తెరతీసింది.అంతే దానికి నమస్కరించాడు.స్వామీ ఈ మాంత్రీకుని పంచ ప్రాణాలు నిర్వీర్యం చేయాలంటే సామాన్యమైన శక్తి చాలదు.దుష్టశిక్షణ చేసే నీవే అందుకు సమర్థుడవు.నన్ను మన్నించి ఆ దుష్టశక్తిని హతమార్చే నిమిత్తం నిన్నే ఆయుధంగా చేసుకోమని నా మనసు చెబుతోంది.అని ఆ సాలగ్రామాన్ని చేతిలోకి తీసుకున్నాడు జయసేనుడు.గుడి ఆరుబయట వెన్నెల వెలుగుల్లో హారాన్ని వుంచి నిశ్చలమైన భక్తి శ్రద్ధలతో ఆ సాలగ్రాన శిలతో ఆ పతాకంపై గట్టిగా మోదాడు.అత్యాశ్చర్యం ఆ సాలగ్రామ శిల పతకాన్ని తాకగానే ముక్కలు ముక్కలైంది.అందులోంచి పంచ ప్రాణాలు పిచ్చుకల రూపంలో బయటికి వచ్చి గాలిలో అంతర్థానం అయిపోయాయి.ఆ నిర్వీర్యమైన ఆ పంచ ప్రాణాలు దాచిన హారం ఇప్పుడు సాధారణ పూసలదండ మాత్రమే.దాన్ని తన వద్దనే భద్రపరచి సాలగ్రామ శిలను యథాతథంగా పెట్టి నమస్కరించి వేగంగా కొండ మెట్లు దిగ నారంభించాడు జయసేనుడు.
:సశేషం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి