ఇంతలో సింహాల గర్జనలు చెవులకు చిల్లులు పడేట్టు వినిపించసాగాయి. "ఇదేమిటి? ఈ రహదారిలో సింహపు గర్జనలా! అవి అనేకం ఉన్నట్లు తోచుచున్నది. ఈ మైదానంలో ఎలా? వాటినుంచి నాకు రక్షణ ఎంత? అదృశ్య రూపం అయితే మాత్రం!" అని ఒకింత భయభ్రాంతిలో ఉండగానే, ఏనుగుల గుంపు ఇటు వైపే వస్తున్నట్లున్నది. "ఓరి నాయనో! ఇదేమి వింత? ఆ గండాబేరుండుడు ఏమయ్యాడు? నేనసలు ఆ వక్రమల్లు స్థావరం చేరగలనా? నా ఈ సాహసం బూడిదలో పోసిన పన్నీరులా మిగిలేనా?" అని పరిపరి విధాలుగా మనసు కలవరమైంది.
ఇంతలో పెద్ద గాలి తనవైపే వీచడంతో ఆ దిశవైపు దృష్టి మళ్ళించాడు జయసేనుడు. అతని కళ్ళలో ఆనందం విరిసింది. తన ప్రియ నేస్తం గండాబేరుండం తన ముందుకు వచ్చి వాలింది.
"జయసేనా! త్వరగా నా రెక్కలపైకి వచ్చి ఆసీనుడివి కమ్ము" అని ఆదేశించింది.
మారు మాట్లాడకుండా దానిపైకి ఎగబ్రాకి కూర్చున్నాడు. అది గగన వీధిలోకి రివ్వున ఎగిరింది.
"జయసేనా! నీవు అనుకున్నది సాధించినట్టువున్నావు. ఆ విషయం ఆ మాయావి గ్రహించినట్టున్నాడు. అందుకే ఈ దారిని భ్రమలో ముంచెత్తాడు. నీకోసం మూడు రోజులు చూసి వెళతాను అన్నాను కదా! ఈరోజు కూడా ఇందాకటి దాకా ఎదురు చూశాను. నిరాశతో ముందుకు వెళ్ళాను. కానీ, నాకు ఎక్కడో నీవు వచ్చి నాకోసం ఎదురుచూస్తావని తలిచాను. మరల వెనుతిరిగి నీకై ఈరోజు కూడా నిరీక్షిద్దామని వెనుతిరిగాను. కానీ ఏదో మాయ నన్ను తాకినట్టయింది. ఆ మాయను దాటి ఇంకాస్త పైకి వెళ్ళి నిన్ను గమనించాను. భయపడకు, ఇదంతా మాయతో ఉంది" అని వివరించింది.
"అవును మిత్రమా! కనిపించని జంతువుల అరుపుల వింత శబ్దాలు నన్ను భయకంపితుడిని చేశాయి. నీ మంచితనం మరల నాకోసం నీవు వెనుతిరిగి రావటం అంతా దైవేశ్చ" అని క్లుప్తంగా తను అడవిలో ఎదుర్కొన్న సంఘటనలను, వక్రమల్లు పంచప్రాణాల నిర్వీర్యం అంతా వివరించాడు జయసేనుడు.
"జయసేనా! ఇక నుంచీ నీవు మరింత జాగరూకతతో ఉండాలి సుమా! వాడు మాయలు అధికం చేస్తాడు. నీవు నాకు కనిపించాలని అదృశ్య రూపం వీడావు. అది నీకు అంత క్షేమం కాదు. వెంటనే అదృశ్య రూపంలోకి మారు" అని హెచ్చరించింది.
"అలాగే" అని జయసేనుడు మరలా అదృశ్య రూపంలోకి మారిపోయాడు.
ఇంకాస్త దూరం వెళ్ళగానే దారి తారుమారైంది. ఎటువెళ్ళాలో తెలియక దారి తప్పిన వారి మీదకు రాకాసి డేగలు గుంపులుగా దండెత్తాయి. అది గమనించిన జయసేనుడు తన కరవాలంతో వాటిని హతమార్చాడు.
"జయసేనా! ఇదంతా ఆ మాయావి పన్నాగమే" అని మరలా వెనుకకు తిరిగి, ఆ మాయకు అందనంత దూరంలో ఎగిరి, దారి కనుగొని, వాయువేగ మనోవేగంతో ఆ మాయను దాటింది ఆ పక్షి.
"చూసావా జయసేనా! వాడి మాయ" అంటూ ఒక ప్రదేశంలో కిందికి దిగింది.
నిజరూపంలోకి మారాడు జయసేనుడు, "ఏమైనది మిత్రమా! ఇక్కడ ఆగవలసిన పని ఏమి?" అని అన్నాడు.
"నీవు ఆ మాయావిని పూర్తిగా అంతమొందించాలంటే నీకు తగిన శక్తి కావాలి. నీవు తీసుకెళ్ళిన ఆహారం, పానీయం ఆకలిని తీర్చేంతది కాదు; నిప్పులపై నీళ్ళు చల్లినంత మాత్రమే. అదిగో ఆ ఫలవృక్షం... దాని ఫలాలతో పూర్తి ఆకలి తీర్చుకో. కడుపారా ఆ నీటిని సేవించు. నీలో అధిక శక్తి లభిస్తుంది" అని అన్నది.
"అలాగే" అని ఫలాలను సేవించి, నీటిని గ్రోలి, ఆ పక్షిరాజుకు అనేక ధన్యవాదాలు తెలిపి తిరిగి వారి ప్రయాణం సాగించారు.
: సశేషం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి