పుస్తక పఠనంతోనే బంగరు భవిత సాధ్యం


 పుస్తక పఠనమనేది విజ్ఞానం విజ్ఞత అందిస్తాయని, తద్వారా లోకంలో గల మానవాళి జీవన విధానాలు ప్రాంతాల చరిత్ర సంస్కృతి సంప్రదాయాల పట్ల పూర్తి అవగాహన పొంది బంగరు భవితను సాధించవచ్చునని ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత గ్రంథాచార్యులు, ప్రయివేట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కనపాక చౌదరి నాయుడు అన్నారు. 
స్థానిక శాఖా గ్రంథాలయం ఆవరణలో నిర్వహించిన
కొత్తూరు రచయితల వేదిక 20వ నెల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి  మాట్లాడారు. కొత్తూరు రచయితల వేదిక గౌరవాధ్యక్షులు ముదిల శంకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యమ యోధుల మార్గదర్శనం ఆవశ్యకత అను అంశంపై చౌదరి నాయుడు ముఖ్య వక్త ప్రసంగం చేశారు. గ్రంథాలయ ఉద్యమకారులైన ఎస్.ఆర్.రంగనాథన్, పాతూరి నాగభూషణం అయ్యంకి వెంకటరమణయ్యల జీవిత గాథలను వారి త్యాగనిరతిని వివరించారు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ను, దేశభక్తుల జీవితగాథలను, సంస్కృతి సంప్రదాయాల సంఘటనలను, భాషాసంపత్తి వంటీ అన్ని రకాల పుస్తకాలతో విజ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చునని అన్నారు. గ్రంథపాలకురాలు టి.ఇందిర సమన్వయంతో నిర్వహించిన కవి సమ్మేళనంలో ముఖ్య అతిథి కనపాక చౌదరి నాయుడు, వేదిక మహిళా కార్యదర్శి అమ్మల కామేశ్వరి, ఉపాధ్యక్షులు గడసాపు ఉషారాణి, గౌరవాధ్యక్షులు ముదిల శంకరరావు, ఆహ్వాన కమిటీ అధ్యక్షులు అల్లిన దిలీప్ పట్నాయక్, కార్యవర్గ సభ్యులు అంపిలి ప్రశాంత్ కుమార్, ఉర్జాన ప్రసాదరావు, పెరిశెట్టి రామచంద్రరావు, గేదెల కవిరాజు అప్పలరాజు, గజివిల్లి మోహనరావులు తమ తమ కవితలను వినిపించారు. అనంతరం ముఖ్య అతిథి కనపాక చౌదరి నాయుడును వేదిక సభ్యులు శాలువా జ్ఞాపిక గ్రంథాలతో ఘనంగా సన్మానించారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కొత్తూరు రచయితల వేదిక సభ్యులను స్థానిక గ్రంథ పాలకులు టి.ఇందిర చేతులమీదుగా చిరు సత్కారాలు గావించారు.
కామెంట్‌లు