సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము- 445 వ రోజు
అశ్వత్థామ కృష్ణుని చక్రాయుధము అడుగుట
కృష్ణుడు ధర్మరాజుతో అశ్వత్థామ గురించి ఇంకా చెప్తూ " మీరు వనవాసంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ఒక సారి నా వద్దకు వచ్చి " కృష్ణా ! పూర్వం అగస్త్యుడు తాను బ్రహ్మ వద్ద నుండి పొందిన బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని నా తండ్రి ద్రోణుడికి ఇచ్చాడు. నా తండ్రి దానిని నాకు ఇచ్చాడు. కృష్ణా ! నేను దానిని నీకు ఇస్తాను నీ చక్రా యుధమును నాకు ఇస్తావా !" అని అడిగాడు. నాకు అతడి అహంకారం అర్ధమైనా " నేను నా వద్ద ఉన్న ఆయుధములు గద, ఖడ్గం, ధనస్సు, చక్రము చూపి వీటిలో నీకు ఏది కావాలో నీకు దేనిని ధరించి ప్రయోగించడానికి శక్తి ఉన్నదో దానిని తీసుకో అన్నాను. నీవు నాకు మిత్రుడవు నీవద్ద నుండి నేను ఏదీ తీసుకొనుట ధర్మం కాదు " అన్నాను. సమాధానంగా అశ్వత్థామ " నాకు చక్రాయుధం కావాలి అన్నాడు. నేను " సరే తీసుకో " అన్నాను. అశ్వథ్థామ అమితమైన గర్వంతో ముందు ఏడమచేత్తో సుదర్శనచక్రాన్ని ఎత్తాడు అది కదల లేదు. తరువాత కుడి చేత్తో ఎత్తాడు అది ఇసుమంతైనా లేవ లేదు. చివరకు రెండు చేతులతో ఎత్తి ప్రయత్నించి లేపలేక అలసి పోయి విఫలమై నిలబడ్డాడు.
చక్రాయుధ మహిమ
నేను అశ్వత్థామను చూసి " అశ్వత్థామా ! నేను హిమవత్పర్వతాల మీద రిక్మిణీసమేతంగా ఉండి కూడా కఠోరబ్రహ్మచర్యం అవలంబించి, పన్నెండు సంవత్సరాలు ఉగ్ర తపమాచరించి అత్యంత మహిమాన్వితమైన ఈ చక్రాయుధమును పొందాను. దీని ప్రభావం ముందు దేవ, దానవ, గంధర్వాది సమస్త భూతములు సాటి రావు. నా వద్ద ఉన్న చక్రాయుధమును నా అన్న బలబద్రుడు కాని, నా కుమారుడు ప్రద్యుమ్న సాంబులు కాని మిగిలిన యాదవ శ్రేష్టులు కాని అడుగ లేదు. తన తపోదీక్షతో అర్జునుడు గాండీవము, శ్వేతాశ్వములు, కపిధ్వజం పొందాడు. తరువాత పరమశివుని మెప్పించి పాశుపతం పొందాడు. అటువంటి అర్జునుడు నాకు ప్రాణ సమానుడు అడిగిన నేను ఇవ్వనిది ఏమీ లేదు. అర్జునుడు కూడా ఈ చక్రాయుధమును తనకు ఇమ్మని అడగ లేదు. భరతవంశసంజాతులకు గురువైన ద్రోణుడి కుమారుడవైన నీవు దీనిని అడుగ వచ్చా ! అయినా ఈ చక్రాయుధముతో నీవు ఎవరితో యుద్ధం చేయనెంచి నన్ను అడిగావు " అని అడిగాను.
అశ్వత్థామ మనోగతం
అశ్వత్థామ " కృష్ణా ! నీవు ఈ చక్రాయుధమును నాకు ఇచ్చిన ఏడల నేను ఎలాగైనా నీకాళ్ళు పట్టి అయినా నిన్ను పోరుకు పిలిచి దీనిని నీ మీద ప్రయోగించాలని అనుకున్నాను. కాని ఈ చక్రాయుధమును నీవు నాకు ఇచ్చుట లేదు కదా ! నాకు ఎటువంటి హాని లేదులే. దీనిని నీ దగ్గరే ఉంచుకో. ఎలాగూ మహాభారతయుద్ధంలో నువ్వు నాతో యుద్ధం చేస్తావు కదా ! " అన్నాడు. నాకు నవ్వు వచ్చింది కాని బ్రాహ్మణుడు అడిగాడు కదా అని నేను అతడికి నాకు తోచిన బహుమానములు ఇచ్చి పంపాను. అతడి అహంకారముకు కారణం అతడి వద్ద ఉన్న బ్రహ్మశిరోనామాస్త్రం. క్రూరుడైన అశ్వత్థామ చేతిలో మన భీముడు బాధపడకూడదన్నదే నా కోరిక " అన్నాడు కృష్ణుడు.
కృష్ణాదులు అశ్వత్థామ వద్దకు వెళ్ళుట
కృష్ణుడు సహదేవుడిని, సాత్యకిని ద్రౌపదికి తోడుగా ఉంచి తానూ ధర్మరాజూ, అర్జునుడూ కలిసి భీముడు వెళ్ళిన వైపు వెళ్ళాడు. దారిలో వారు భీముని కలుసుకున్నారు. భీముని అడిగి అశ్వత్థామ ఉన్న చోటు తెలుసుకున్నారు. అందరూ వ్యాసాశ్రమం వెళ్ళి అక్కడ ఒంటినిండా విభూది పూసుకుని నిశ్చలంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్న అశ్వత్థామను చూసి భీముడు మిన్నంటిన కోపంతో " ఓరీ అశ్వత్థామా ! కపటసన్యాసీ ! బ్రాహ్మణాధమా ! క్రూరాత్ముడా ! నిన్న రాత్రి అంతటి దారుణమారణకాండ జరిపి ఏమీ ఎరుగని విధమున ఇంత త్వరగా తాపసవృత్తిని ఎలా అవలంభించావు. తాపసివైనంత మాత్రాన చావుతప్పదు. చేసిన తపస్సు చాలు లేచి నాతో యుద్ధానికి రా ! " అని సింహం వలె భీముడు గద్దించాడు. అశ్వత్థామ భీముని అతడి పక్కన ఉన్న అర్జునుడిని చేసాడు. అర్జునుడి శస్త్రసంపద ఎరిగిన వాడు కావున పక్కన ఉన్న రెల్లుగడ్డిని తీసుకుని అభిమంత్రించి బ్రహ్మశిరోనామును దాని మీద ఆవహింప చేసి " అపాండవ మగుకాక " అని సంకల్పించి భీమార్జునుల మీదకు ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. పెద్ద విస్పోటం జరిగింది.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి