కొత్తూరు లైబ్రరీ వారోత్సవాలకు ఘనంగా సన్నాహాలు
 

కొత్తూరు శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈనెల 14నుంచి, 20వరకూ ఘనంగా నిర్వహించుటకు సన్నాహాలు చేస్తున్నామని గ్రంథాలయ పాలకురాలు టి.ఇందిర తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి.వి.జి.ఎస్.శంకరరావు నిర్దేశాలతో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. 14న నెహ్రూ చిత్రపటానికి పూలమాలాలంకరణ, ప్రారంభకుల ప్రసంగాలు, బాలలకు మిఠాయి పంపకాలు జరుగుతాయని ఆమె తెలిపారు. 15న కొత్తూరు రచయితల వేదిక సభ్యులచే పుస్తక ప్రదర్శన ప్రారంభం, అనంతరం కొత్తూరు రచయితల వేదిక సభ్యులతో కవిసమ్మేళనం నిర్వహించనున్నామని ఇందిర తెలిపారు. 16న గ్రంథాలయ ఉద్యమయోధులైన ఎస్.ఆర్.రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్యల జీవిత గాథలను వారి త్యాగనిరతిని స్మరించనున్నామని తెలిపారు. 17న హైస్కూల్ పిల్లలకు చిత్రలేఖనం, 18న నేర్చుటకై చదవండి నాయకత్వానికై నేర్చండి అను అంశంపై వ్యాసరచన, 19న ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, అనంతరం మహిళలకు రంగవల్లుల పోటీలను నిర్వహించనున్నామని ఇందిర తెలిపారు. 20న చదవడం మాకిష్టం అను కార్యక్రమంలో భాగంగా సామూహిక స్వీయ పఠనం నిర్వహిస్తామని తెలిపారు. నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులను అందజేసి గ్రంథాలయ వారోత్సవాలను ముగిస్తామని ఇందిర తెలిపారు. కావున పాఠకులు విద్యార్థులు విద్యావంతులు ఉపాధ్యాయులు ఉద్యోగులు మహిళలు సాహిత్యవేత్తలు తెలుగు భాషాభిమానులు యువత పాల్గొని జయప్రదం గావించాలని ఆమె విజ్ఞప్తి చేసారు. ఆంధ్రనాట గ్రంథాలయ ఉద్యమం, గ్రంథాలయాలకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చిందని ఈ సందర్భంగా ఇందిర గుర్తుచేసారు. పెక్కుమంది పాఠకులు గ్రంథాలయ సభ్యులుగా చేరి, పుస్తకాలు ఫర్నిచర్ లను అందజేసి గ్రంథాలయాలను మరింత బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
కామెంట్‌లు