విద్యాపురి ఉన్నత పాఠశాలలో లలిత, పావని ఒకే తరగతి చదువుతున్నారు. చాలా తెలివైన విద్యార్థులు. కానీ ఒకరి పట్ల మరొకరికి ఈర్ష్యాభావం. ఎంతమంది ప్రయత్నం చేసినా వారిని కలపలేకపోయారు. తెలుగు ఉపాధ్యాయులు తరచూ మనం కలసి ఉంటే ఎన్ని లాభాలో, విడిపోతే ఎన్ని రకాల నష్టాలో తెలిపే కథలు చాలా చెప్పారు. కానీ ఈ ఇద్దరినీ కలపలేకపోయారు.
ఆ పాఠశాలకు తిరుమలేశం అనే ఉపాద్యాయులు కొత్తగా ప్రవేశించారు. పరిస్థితి గమనించారు. లలిత అనే అమ్మాయిని పిలిచాడు. "నీకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టమట కదా!" అన్నాడు. "అవునండీ!" అన్నది లలిత. నీకు మంచి పాట నేర్పిస్తాను. వచ్చే బాలల దినోత్సవం రోజున పాడాలి." అన్నాడు. ఒప్పుకుంది లలిత. ఆ తర్వాత పావనిని పిలిచాడు. "నీకు పాటలు పాడటం వచ్చా?" అని అడిగాడు ఉపాధ్యాయులు. "రాదండీ!" అని జవాబు ఇచ్చింది. "నీకు, లలితకు ఇద్దరికీ ఒక పాట నేర్పిస్తాను. నిరంతరం సాధన చేస్తే నువ్వు బెస్ట్ సింగర్ అవుతావు. లలిత కంటే బాగా పాడితే నీకు పదివేల రూపాయల బహుమతి ఇస్తాను." అన్నాడు తిరుమలేశం మాస్టారు. ఎగిరి గంతేసింది పావని. ఉపాధ్యాయులు ఇద్దరికీ పాట నేర్పినాడు.
పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చారు. తిరుమలేశం గారు ఇద్దరినీ పిలిచాడు. ఇద్దరూ కలసి పాడాలి. ఇద్దరిలో ఎవరి గొంతు శ్రావ్యంగా ఉంటే వారికి బహుమతి అని చెప్పాడు. ఇష్టం లేకపోయినా ఇద్దరూ ఒప్పుకున్నారు. ఉపాధ్యాయులు ఇద్దరినీ కలిపి పాడిస్తూ సాధన చేయించాడు.
కార్యక్రమం మొదలైంది. లలిత, పావని ఇద్దరూ కలిసి "పిల్లలూ దేవుడూ అందరివాడే. కల్ల కపటమెరుగనీ కరుణామయుడే" అనే పాటను చాలా అద్భుతంగా పాడినారు. వచ్చినవారు మంత్ర ముగ్ధులై విన్నారు. ఇద్దరూ రూపంలో పొట్టిగా ఉన్నా చాలా బాగా పాడినారు. ఇద్దరూ కలిసి ఎంత అద్భుతంగా పాడారని ప్రశంసల వర్షం కురిసింది. ఆ అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిలు ఇద్దరినీ దగ్గరకు తీసుకొని, ఇద్దరితో కలిసి ఫోటోలు దిగారు. ఇద్దరి ఐకమత్యం ఎంత గొప్పగా ఉంది అని ప్రశంసల వర్షం కురిపించారు. నిశ్చేష్టులైనారు లలిత, పావనిలు.
మాలిని అనే అమ్మాయి పావని వద్దకు వచ్చి, "బాధపడకు పావనీ! లలిత నీకు ఎప్పుడూ శత్రువే! ఇద్దరూ కలవాల్సిన అవసరం లేదు." అన్నది. పావని మాలిని చెంప మీద దెబ్బ కొట్టింది. అక్కడే ఉన్న లలిత "మేము మా తల్లిదండ్రులను మోసం చేయము. మేము ఇద్దరం ఇక నుంచి ప్రాణ స్నేహితులం." అని అన్నది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి