ఎ ప్పుడూ ఉపాధ్యాయులు చెబుతుంటే పిల్లలు పాఠాలు వింటారు. కానీ ఇక్కడ పాఠశాల
పిల్లలు ఉపాధ్యాయులుగా అవతారమెత్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ పాఠ్యాంశాలను బోధిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. రోజు తమ సహచరులతో కలిసి ఉండే వీరు పాఠాలు బోధిస్తూ మిక్కిలి సంతోషపడ్డారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తాము ఉపాధ్యాయులుగా వ్యవరించడంతో గొప్ప అనుభూతికి లోనయ్యారు. ఆనందంతో గంతులు వేశారు. వివరాలకు వెళితే...
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో ముందస్తుగా శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు ఉదయాన్నే అందంగా ముస్తాబై పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయుల వేషధారణలో వచ్చిన చిన్నారులు తమకు కేటాయించిన వివిధ సబ్జెక్టులను చక్కగా బోధించారు. ఒకరికి మించి ఒకరు పోటీపడి తమ సహచరులకు పలు విషయాలపట్ల అవగాహన కల్పించారు. వీరు బోధిస్తున్న పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు నిషితంగా గమనించారు. తెలుగు ఇంగ్లీషు, గణితం, ఇతర సబ్జెక్టుల్లో ఉత్తమ బోధనా నైపుణ్యాలను ప్రదర్శించిన వారిని ఎంపిక చేసి, బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయులైన విద్యార్థులను పాఠశాల టీచర్లు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, సరిత, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి