తుప్ప తెచ్చిన తిప్పలు!; - పాలగుమ్మి జ్యోతి
  


కృష్ణాపురం, రామాపురం, గోపాలపురం ఈ మూడు ఊళ్ళకి జనం వెళ్ళాలంటే ఒకటే మార్గం, అది అడవి గుండా
వెళ్ళాలి. ఆ మార్గంలో ఒంటరిగా వెళ్ళాలంటే జనాలు భయపడుతూ ఉంటారు. అక్కడ రంగడు అనే దొంగ దారికాచి ఒంటరిగా వెళ్ళే వాళ్ళపై దాడిచేసి వాళ్ళ దగ్గర సొమ్మును దోచుకోవడం పరిపాటి. ఆ రోజు కూడా రంగడు దోచుకున్న సొమ్ముతో తృప్తిపడక ఇంకా ఎవరైనా వస్తే
దోచుకుందామని తుప్పల చాటున నక్కి ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నాడు.
               అప్పుడే ఆ దారి గుండా పయనిస్తూ   నలుగురు మనుషులు బాగా బలంగా, దృఢంగా ఉన్న వాళ్ళు చేతుల్లో కఱ్ఱలతో రంగడికి తెలియని ఏదో
భాషలో మాట్లాడుకుంటూ భోజనం చేద్దామని రంగడు దాక్కున్న తుప్పలకి కొంచెం దూరంలో కూర్చున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును కూడా 
దోచుకుందామనుకున్న రంగడు,'వాళ్ళు చూడబోతే నలుగురు ఉన్నారు, పైగా బాగా బలిష్టంగా ఉన్నా రు, నాపై దాడి చేస్తే  నేనేమో 
ఒక్కడినే ఉన్నాను ఎదుర్కోవడం కష్టం. అందుకే వాళ్ళ దగ్గర సొమ్మును దోచుకోవడం కన్నా వాళ్ళు వెళ్ళేవరకు వేచివుందాం' అని అనుకుంటూ వాళ్ళు వెళ్ళే దాకా అక్కడే తుప్పలు  చాటునే
నక్కి, దోచుకున్న సొమ్ముతో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపోవడం మంచిదని నిర్ణయించుకుని కూర్చున్నాడు.
                వాళ్ళు నలుగురూ తమ వెంట తెచ్చుకున్న భోజనం ఉన్న మూటలను విప్పి తినడానికి కూర్చున్నారు. ఒక
అతను"తుప్ప!" అని అన్నాడు. వెంటనే తుప్పలలో దాక్కున్న రంగడు ఉలిక్కిపడ్డాడు. 'అమ్మో ! వాళ్ళకి నేను తుప్పల
వెనకాల దాక్కున్నది తెలిసిపోయినట్టుంది. వాళ్ళ భాషలో తుప్పల్లో ఉన్నాడు అని అనుకుంటున్నారు' అని భయంతో
 ముడుచుకుపోయి  ఇంకా చెవులు బాగా రిక్కించి వాళ్ళ మాటలు వింటున్నాడు. వాళ్ళ సంభాషణ అంతా వేరే భాషలో ఉండడంతో అతనికి ఏమీ అర్థం
కావడం లేదు. ఈలోగా ఇంకొక అతను కూడా "తుప్ప!"అన్నాడు. అంతే! వెంటనే తుప్పల్లో దాక్కున్న రంగడు ఒక్క
ఉదుదున బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి"అయ్యా! ఇన్నాళ్ళూ బుద్ధి తక్కువై  దొంగతనాలు చేశాను. ఇదిగో! నేను
ఈరోజు దోచుకున్న డబ్బు , నగలు, దయచేసి నన్ను వదిలేయండి. మీరు నలుగురు కలిసి నామీద దాడిచేస్తే నేను
చనిపోవడం ఖాయం. నాకు బుద్ధొచ్చింది, ఇక మీదట దొంగతనాలు చెయ్యను కష్టపడి బ్రతుకుతాను" అంటూ ఏడుస్తూ తను దోచుకున్న నగలు, డబ్బు ఉన్న మూటను వాళ్ళ ముందు ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా పరుగుపెట్టి పారిపోయాడు.
ఒక్క క్షణం ఆ నలుగురికి ఏమి జరిగిందో అర్థం కాలేదు. తరువాత వాళ్ళలో తెలుగు తెలిసిన ఒక అతను పకపకా
నవ్వుతూ.. మిగతా ముగ్గురితో  "మనం అన్నం తింటూ కన్నడ భాషలో "తుప్ప" అంటే నెయ్యి కావాలని మాట్లాడకున్నాం కదా! ఆ
"తుప్ప" అన్న పదం విన్న దొంగ తను తుప్పల్లో దాక్కున్న విషయం మనకి తెలిసిపోయిందనుకుని ప్రాణ భయంతో తను దోచుకున్న సొమ్మంతా మనకు ఇచ్చేసి పరుగున పారిపోయాడు" అని వాళ్ళకి కూడా అర్థం అయ్యేలా కన్నడ భాషలో
చెప్పాడు.
అది విని, విషయం అర్థమై మిగతా ముగ్గురూ కూడా నవ్వుకున్నారు. తమకు దొంగ ఇచ్చి పోరిపోయిన ఆ నగలు, డబ్బులు ఆ ఊరిలో దండోరా వేయించి  స్వంతదారులకు 
అప్పగించాలని నిర్ణయించుకుని భోజనం ముగించి ఆ పని మీద ఊళ్ళోకి బయలుదేరారు. 
                       ఆ సంఘటన జరిగిన తరువాత నుంచి మూడు ఊళ్ళ ప్రజలు రంగడు దొంగతనాలు మానేయడంతో ఆ
అడవి మార్గం గుండా  భయం లేకుండా హాయిగా తిరుగుతున్నారు.
                               
                          #######################################
కామెంట్‌లు