కుటీర పరిశ్రమ కేంద్రాల్ని సందర్శించిన ఊషన్నపల్లి పాఠశాల పిల్లలు
 --క్షేత్ర పర్యటనలో భాగంగా పోలీస్ స్టేషన్, కేజీబీవీ, సోలార్ విద్యుత్ ప్లాంట్ల సందర్శన 
 





పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు క్షేత్ర పర్యటనలో భాగంగా ఆదివారం రోజున మగ్గం నేత, మట్టి కుండల తయారి వంటి కుటీర పరిశ్రమల కేంద్రాలను సందర్శించారు. అలాగే పాండవుల గుట్ట వద్ద ఉన్న 1 మెగా వాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్, మునీశ్వర స్వామి ఆలయం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కేజీబీవీ, మార్కెట్ యార్డ్, పోలీస్ స్టేషన్, పెదరాత్ పల్లిలోని పోచమ్మ గుడి, సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్న అతి సుందర ప్రదేశాలను సందర్శించారు. పిల్లలు మొదట కాల్వశ్రీరాంపూర్లోని మగ్గం నేత కేంద్రాన్ని సందర్శించారు. చేయి, మిషన్ల ద్వారా బట్టలు తయారయ్యే విధానాన్ని పిల్లలు తెలుసుకున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్  వెళ్ళి, అందులోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఏఎస్సై నీలిమ పోలీసుల విధులు, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అనేక అంశాలను పిల్లలకు వివరించారు. అనంతరం మార్కెట్ యార్డ్ ను సందర్శించి, అక్కడ ఆరబోసిన వడ్లు, తాలు తొలగించే మిషన్లను పరిశీలించారు. అనంతరం 1 మెగావాట్ సౌర విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి, విద్యుత్తు తయారయ్యే విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. పాండవుల గుట్ట పైన ఉన్న జగత్ మునీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, అక్కడ కాసేపు ధ్యానం చేశారు. ఆ తర్వాత పెద్ద రాత్ పల్లిలోని మట్టి కుండల తయారీ పరిశ్రమను పరిశీలించి, కుండలు తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనానంతరం వారు పోచమ్మ దేవాలయం,  మానేరు నది ఒడ్డున ఉన్న  సమ్మక్కసారలమ్మ గద్దెల వద్దకు చేరుకొని అక్కడి సుందర ప్రదేశాలను వీక్షిస్తూ ఆనందంతో గంతులు వేశారు. ఎన్నడూ మరిచిపోలేని అనుభూతులను మిగిల్చిందంటూ పిల్లలు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఆనందోత్సాహాలతో ఇంటి బాట పట్టారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు శ్రీ వాణి,  స్రవంతి, సరిత, పిల్లలు వారి తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు