చిట్లిన వెన్నెల.!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.


ఆకాశంలో హంసలా ఈదుతున్న మేఘం 
అమృతం తాగిన తీర్థం కురిపించలేదు. 
నీటిపై తేలిన తామర పువ్వు తూర్పు దిక్కున 
ఎర్రని ముత్యమై మెరిసింది. 

ఎగిరే గాలి గులాబీ పరిమళమై గంధర్వగానం నుదుట 
తిలకం దిద్దింది. 
నెమలి పాదాల లయలు, మైదానమంతా భాజా భజంత్రీలై ఊరేగినయి. 

పాలు ఎన్ని తాగిన పిల్లి లావు కానట్లు నదులు ఎన్ని చేరిన సముద్రం పెరగ లేదు. 
అలలు ఎగిసి ఆకాశాన్ని ముద్దాడినట్లు 
పొద్దు మూకి నిద్దుర పోయిన నిండు సూర్యుడు నిండుకుండలో నీల్లాడినట్లు
చెట్లు చప్పట్లతో అడవిని ఆడపడుచును చేసినవి.

అడవిలో ఆకురాలిన -తీరంలో గవ్వలు తేలిన -గూటిలో గువ్వలు రివ్వుమని -ఎగిరిన ఆకాశము ఆశ్చర్యపోదు. 
మసక మసక చీకటి కీచురాళ్ళ కూతలు మినుగురు పురుగులు రాసుకున్న రాతలు అవి. 

మందిరం ముందు రాలుతున్న పూలు మదిలో మెదులుతున్న ప్రార్థనలు 
పవిత్ర స్నానం చేసిన నీటి చుక్క ఆకాశం మేను పై నక్షత్రమై మెరిసింది.

గంధం పసుపు రాసిన గుంజపై వేదమంత్రాలను పసుపు కొమ్ము వస్త్రం పఠించినవి. 
ఏనుగెంత నడిచిన బరువు తగ్గనట్లు ఆకాశమెంత ఉరిమిన నీటి చుక్క రాలలేదు. 

చిట్లిపడిన  వెన్నెల పూరిగుడిసెలో ఆకాశంతో కాపురం చేసింది. 
చెరకు తీపి తేనేకు పంచినట్లు ఆలుమగల అనురాగం పంచామృతం అయింది. 
================================
డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు