దశను మార్చే దిశలు!: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


దశదిశలు పరికించి మంచి దిశను ఎంచుకో —
దూరదృష్టితో గమ్యాన్ని నిర్దేశించుకో!
మంచి మార్గమేదో ఆలోచించి తెలుసుకో —
ముందడుగులు వేస్తూ విజయాలను సాధించుకో!

ఎటువైపు సాగాలో ఎరుకను పెంచుకో —
ఎదురయ్యే ఆటంకాలను ఎదిరించి నడుచుకో!
ఎంచుకున్న దిశపై ఏకాగ్రత నిలుపు —
ఎన్ని అవాంతరాలొచ్చినా లక్ష్యాన్ని చేరుకో!

గాలివాటానికి గమ్యదిశ మార్చుకోకు —
తాత్కాలిక ప్రలోభాలకు తలవంచకు!
పట్టు విడువక ప్రయాణాన్ని కొనసాగించు —
పరిస్థితులను ఎదుర్కొని ప్రగతిని సాధించు!

దిశలేని పయనం దారితప్పిన బాట —
లక్ష్యంలేని జీవితం వ్యర్థమైన ఆట!
సరైన దిశే విజయానికి తొలిమెట్టు —
సంకల్పబలమే గెలుపునకు కొండంత అండ!

సుదిశలో సాగితే దశ మారుతుంది —
దశ మారితే విజయలక్ష్మి వరిస్తుంది!
చిత్తశుద్ధితో చక్కని దిశలో పయనిస్తే —
చిరకాల కీర్తి నీచెంతకు చేరుతుంది!

గమ్యమే ధ్యేయంగా గమనాన్ని సాగించు —
గగనపు అంచులను అందుకునేవరకు నడువు!
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలుచుకో —
అవకాశాల నిచ్చెనలెక్కి ఉన్నత దశను అధిరోహించు!

దిశ నీ ఆలోచనకు దిక్సూచి కావాలి —
దశ నీ కృషికి ప్రతిఫలంగా నిలవాలి!
నీ ప్రయాణం నవతరానికి మార్గదర్శి కావాలి —
నీ జీవితం విజయాలకు చిరునామా కావాలి!

కామెంట్‌లు