కంచి కబుర్లు!: - పాలగుమ్మి జ్యోతి.
 

"ఎన్నో ఏళ్ళగా అసలు క్రొత్త కథలే రావడం లేదు, ఎప్పుడో ఈ కంచికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము" దిగులుగా అంది జానపద కథ."అవును నిజమే! అసలు ఈ మనుషులకు ఏమైంది? ఎందుకని క్రొత్త కథలు పంపడం లేదు!" ఆశ్చర్యంగా అడిగింది పంచతంత్రం కథ. "ఏమవుతుంది? స్వార్థం పెరిగిపోయింది. నేను, నా సంసారం అనే ఆలోచనే తప్ప, పిల్లలు ఎవరూ తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇంట్లో ఉన్నా భరించ లేకపోతున్నారు, ఇంక ఆ పెద్దవాళ్ళు మనవలకి, మనవరాళ్ళకి కథలు చెప్పే అవకాశం ఎక్కడుంది?అందుకే మన కంచికి క్రొత్త కథలు రావడం లేదు" తన గోడు వెళ్ళబోసుకుంటూ అంది దెయ్యం కథ. 

            "అవును! మనవలు, మనవరాళ్ళకు అన్నం తినిపిస్తూ... అమ్మమ్మలు, నానమ్మలు చక్కగా కథలు చెప్పేవారు. వాళ్ళని నిద్రపుచ్చడానికి తాతయ్యలు బోలెడు కథలను చెప్పి, కథకు ముగింపు చెబుతూ ఆ కథలను ఈ కంచికి పంపేవారు. అలా వాళ్ళు పంపితేనే కదా మనం కూడా ఇక్కడకు వచ్చాము, ఆ రోజులు ఇక మళ్ళీ రావు" ముఖం చిన్న బుచ్చుకుని అంది గూఢచారి కథ. "సరేలే! భార్యాభర్తలకు సంపాదించడానికే సమయం సరిపోవడం లేదు, ఇక పిల్లల్ని కూర్చోబెట్టి కథలు చెప్పి, ఆ కథలను మన కోసం కంచికి పంపుతారా ఏంటి? అందుకే  క్రొత్త కథలు వస్తే వారితో ముచ్చటిద్దాం అన్న మన ఆశ నెరవేరడం లేదు" నిరాశగా అంది పౌరాణిక కథ.

                  "ప్రతి త్రాగుబోతు వాళ్ళ ఆవిడకు రకరకాల కథలు చెబుతూనే ఉన్నాడు. ఎటొచ్చి వాటిని మన దగ్గరకు కంచికి పంపడం లేదు అంతే" నవ్వుతూ అంది హాస్య కథ. "మరే! మళ్ళీ మంచి రోజులు వచ్చి చక్కగా ఉమ్మడి కుటుంబాలలో నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళ మనవలు, మనవరాళ్ళతో ఆడుకుంటూ...వారికి గోరుముద్దలు తినిపిస్తూ, వారిని నిద్రపుచ్చుతూ... కథలు చెప్పాలని, ఆ క్రొత్త కథలు అన్నింటినీ మన కంచికి పంపాలని, వాటితో మనం ముచ్చట్లు చెప్పుకోవాలని కోరుకుందాం" గంపెడాశతో అంది చారిత్రక కథ. పైన తిరుగుతూ వీళ్ళ సంభాషణ విన్న అశ్వినీ దేవతలు "తధాస్తు" అన్నారు. 
#############################################
కామెంట్‌లు