| -ఊషన్నపల్లి పాఠశాలలో ఎంఈఓకు ఘన సన్మానం |
పాఠశాల పిల్లలు బాగా చదివి, ఉన్నత స్థానానికి చేరుకోవాలని శ్రీరాంపూర్ ఎంఈఓ కె. స్వరూప అన్నారు. పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఆమె కోరారు. ఊషన్నపల్లి పాఠశాలను, పిల్లల్ని ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.
అనంతరం ఎంఈఓ స్వరూప రెండో తరగతి తెలుగు పదాలు, వాక్యాలను పిల్లల చేత చదివించి, రాయించారు. పిల్లలు చక్కగా స్పందించడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈర్ల సమ్మయ్య తెలుగు పాఠం చెప్తుండగా, బోధన విధానాలను పరిశీలించి, వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పాఠశాలను అభివృద్ధి చేసిన తీరును ఎంఈఓకు వివరించారు.
ఎంఈఓకు ఘన సన్మానం
శ్రీరాంపూర్ ఎంఈఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టి, తొలిసారిగా ఊషన్నపల్లి పాఠశాలకు విచ్చేసిన మండల విద్యాధికారిణి కె. స్వరూపను ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పిల్లలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఎంఈఓ తమ పాఠశాలకు రావడం పట్ల పిల్లలు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మిక్కిలి సంతోషపడ్డారు. ఉత్తమ పరిపాలకులుగా మండలాన్ని విద్యాపరంగా అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ వారు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ కె. స్వరూప, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, బండారి సరిత, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి