రేయి : - వరలక్ష్మి యనమండ్ర


రేయి నీలాంబరి మధుర నిశ్శబ్ద రాగం
చంద్రుడు రేయి సిగలో స్వేతవర్ణ పుష్పం

తారలు రేయి చీరపై ముత్యాల సౌరు
చీకటి నలుపు కాదు కాటుకలా తన తీరు

గాలి రేయి మేనికి పన్నీటి పరిమళ హేల 
రేయి అలసిన బ్రతుకులకు తీయని జోల

నిశ్శబ్దం రేయి హృదయపు లోతైన భాష్యం
కలలు రేయి మనసుకు కట్టిన పట్టుచీర వైనం

నిద్ర రేయి కనులకు అమృతపు తాంబూలం
చీకటి గర్భమున దాగినట్టి  తొలి కిరణం

వెన్నెల రాత్రి ఒంటిపై తెల్లని పైట చందం
మౌనం రేయి పెదవులపై మధుర స్మితం

రేయితో సున్నిత ప్రణయ స్పర్శ దీపం
రేయి లేకుంటే పగటికి అందవిహీనం

వెలుగు పుట్టుకకు రేయి తొలి పొత్తిలి
చీకటి వెలుగుల సంగమపు పవిత్ర లోగిలి

నిశ్శబ్దపు ఒడిలో సృష్టి మధుర లాలన
రేయి కనులకు విశ్వపు అనంత భావన

కామెంట్‌లు