చినుకమ్మ చెప్పిన పాఠం: - వరలక్ష్మి యనమండ్ర
 

నీలాపురం అనే చిన్న ఊరిలో చింటూ అనే పదేళ్ల బాలుడు ఏఉండేవాడు. వాడు తెలివైనవాడే, కానీ ఒక చెడ్డ అలవాటు ఉండేది. నీళ్లను వృథా చేసేవాడు. పళ్ళు తోముకునేటప్పుఏఏఏడు కుళాయి తెరిచే ఉంచేవాడు. బకెట్ నిండి పొర్లిపోతున్నా పట్టించుకునేవాడు కాదు.
"చింటూ! నీళ్లు వృథా చేయకురా" అని అమ్మమ్మ చెప్పేది.
"ఏమవుతుంది అమ్మమ్మా! మన చెరువు నిండుగా ఉందిగా!" అని నవ్వేసి వెళ్లిపోయేవాడు.
ఒకరోజు రాత్రి చింటూ గాఢనిద్రలో ఉండగా, కిటికీ నుంచి ఒక మెరిసే నీటిబొట్టు లోపలికి వచ్చింది. ముత్యంలా మెరుస్తున్న ఆ బొట్టు, "చింటూ, నేను చినుకమ్మను. నాతో రా, నీకొకటి చూపిస్తాను" అంది.
చింటూ దాని చేయి పట్టుకున్నాడు. ఇద్దరూ గాలిలో తేలుతూ ఒక ఊరికి చేరారు. అక్కడ నేల నెర్రెలు విడిచి ఉంది. చెట్లు ఎండి ఆకులు రాల్చాయి. ఒక చిన్నారి అమ్మాయి తలపై కుండతో చాలా దూరం నడిచి వస్తోంది. కుండలో అడుగున కొద్దిగా నీళ్లు మాత్రమే ఉన్నాయి.
"ఆ కుండలోని నీళ్లే ఆ ఇంటిల్లిపాదికీ ఈ రోజంతా" అంది చినుకమ్మ. "నువ్వు ఉదయం కుళాయి తెరిచి వదిలేసినప్పుడు పోయే నీళ్లు వీళ్లకు రెండు రోజులకు సరిపోతాయి."
చింటూ గుండె బరువెక్కింది. తల వంచుకుని "ఔనా,నేను చాలా తప్పు చేశాను చినుకమ్మా" అన్నాడు.
చినుకమ్మ ప్రేమగా నవ్వింది. "తెలుసుకోవడమే మొదటి అడుగు చింటూ. భూమ్మీద ఉన్న నీటిలో తాగడానికి పనికొచ్చేది చాలా కొద్దిగానే. నేను ఆకాశం నుంచి వర్షమై వస్తాను, నదులై ప్రవహిస్తాను, మళ్లీ ఆవిరై వెళ్తాను. కానీ మీరు వృథా చేస్తే నేను అందరికీ అందలేను. ప్రతి నీటి బొట్టూ విలువైనదే."
అంతలో చింటూకు మెలకువ వచ్చింది. తెల్లవారుతోంది. కళ్లు నులుముకుని చూస్తే, కిటికీ బయట చిటపట చినుకులు పడుతున్నాయి. వాడి కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఆ రోజు నుంచి చింటూ మారిపోయాడు. పళ్ళు తోముకునేటప్పుడు అవసరమైనంత వరకే వాడి కుళాయి కట్టేశాడు. ఒక  బక్కెట్ నీళ్ళతో స్నానం ముగించడం నేర్చుకున్నాడు. కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోశేవాడు. వర్షం పడినప్పుడు పెరటిలో బకెట్లు పెట్టి నీళ్లు పట్టాడు. ఎక్కడైనా ఇంట్లో కుళాయి కారుతుంటే వెంటనే బిగించేవాడు.
అంతటితో ఆగలేదు. స్నేహితులందరినీ పోగు చేసి, "మనం జల సైన్యం అవుదాం! మన వీధిలో ఎవరూ నీళ్లు వృథా చేయకుండా చూద్దాం" అన్నాడు. పిల్లలంతా సరేనన్నారు. వారు ఇంటింటికీ వెళ్లి, "నీటిని పొదుపు చేద్దాం, భవిష్యత్తును కాపాడదాం" అని చెప్పారు.
ఆ ఏడాది వేసవిలో చుట్టుపక్కల ఊళ్లలో బావులు ఎండిపోయాయి. కానీ నీలాపురం చెరువులో ఇంకా నీళ్లు మిగిలే ఉన్నాయి. ఊరి పెద్దలు చింటూ జల సైన్యాన్ని మెచ్చుకుని బహుమతులు ఇచ్చారు.
అమ్మమ్మ చింటూను దగ్గరకు తీసుకుని, "నువ్వు ఊరికే కాదు, రేపటి తరానికీ నీళ్లు దాచావురా" అంది. 
వాడికి పూర్తిగా అర్థం కాకపోయినా మంచిపని చేసాడని అర్థం ఐంది.
ఆ రాత్రి కిటికీ దగ్గర ఒక బొట్టు మెరిసింది. అది చినుకమ్మ చిరునవ్వే.

కామెంట్‌లు