దీపావళి పండుగ అంటే పిల్లలకు, పెద్దలకు చాలా ఇష్టమైన పండుగ. పిల్లలకేమో టపాసుల పండుగ. పెద్దలకేమో దీపాల పండుగ. మన చిన్నతనంలో దీపావళి పండుగ చాలా బాగా జరుపుకునేవాళ్లం గుర్తొస్తోందా!
నా పండుగ అనుభవాలు కొన్ని మీతో పంచుకోవాలనిపించి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను.
పండుగ రావడానికి ముందే మా నాన్నగారు అక్కకి, నాకు, తమ్ముడికి టపాసులు తెచ్చి పంచేవారు. వాటిని మేము చాలా జాగ్రత్తగా ఎండలో పెట్టి దాచుకునేవాళ్లం.
పండుగ ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు టపాసులు కాలుస్తామా అని తెగ ఆరాటంగా ఉండేది మాకు.
ప్రత్యేకించి నా హడావిడి కొన్ని పర్వాలుగా సాగేది.
మొదటి పర్వం: (తిప్పుడుపొట్లం పర్వం)
పండుగ రోజు సాయంత్రం కాస్త చీకటి పడగానే మా వీధిలో వెలిగే దీపాలతో పాటు, పిల్లల చేతిలో రవ్వలు ఎగజిమ్ముతూ తిరిగే తిప్పుడుపొట్లాలు నన్ను బాగా ఆకర్షించేవి.
నా చేతిలో ఓ తిప్పుడుపొట్లం పెడితే, వాళ్లందరికన్నా బాగా తిప్పగలనని నా నమ్మకం.
మా నాన్నగారిని పోరిపోరి మరీ ఎలాగైతేనేం, ఓసారి ఓ తిప్పుడుపొట్లం తయారు చేయించుకున్నాను. ఇక ఆ రోజు నా హడావిడి చూడాలి! ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అని ఒకటే ఆరాటం.
ఆ సమయం రానే వచ్చింది. దీపాలు పెట్టడం ఆలస్యం, మా వీధిలో అందరికన్నా ముందుగా నేను తిప్పుడుపొట్లం తిప్పడానికి సిద్ధమయ్యాను.
తిప్పడం మొదలుపెట్టాను. అదేంటో విచిత్రం! అందరి పిల్లల చేతిలో సూర్యుడి చుట్టూ తిరిగే భూమిలా ఒక క్రమంలో తిరిగే తిప్పుడుపొట్లం, నా చేతిలో మాత్రం చుక్కలు అవసరం లేని మెలికల ముగ్గులాగా దానికి నచ్చినట్లు తిరగడం మొదలుపెట్టింది.
నేను దాన్ని ఎలాగో కంట్రోల్ చేద్దామని ప్రయత్నించేలోపు, పాపం మా నాన్నగారు చాలా కంగారుపడ్డారు. ఎక్కడ నేలకేసి కొడతానో, ఎక్కడ ఒంటికేసి కొట్టుకుంటానో అని నెమ్మదిగా నన్ను శాంతింపజేస్తూ, సూచనలిస్తూ దానిని ఆపించి ఊపిరి పీల్చుకున్నారు.
నేను మాత్రం చాలా సీరియస్‌గా, “నాన్నగారూ! తిప్పుడుపొట్లం సరిగా చేయలేదు. ఈసారి చక్కగా చేయించండి” అని చెప్పి లోపలికి వెళ్లిపోయాను.
అప్పుడు నాన్నగారి ఫీలింగ్స్ గురించి మాత్రం అడక్కండి!
(ఏంటి? మీకు ఏమైనా సందేహాలు కలుగుతున్నాయా? అలాంటివేవీ పెట్టుకోకండి. ఆ తిప్పుడుపొట్లం సరిగ్గా చేయలేదు, అంతే! ముందు ముందు ఆ విషయం మీకు బాగా అర్థమవుతుంది.)
అలా నా మొదటి పర్వం విజయవంతంగా సమాప్తం.
రెండవ పర్వం: (సీమటపాకాయల పర్వం)
మొదటి పర్వం ముగిశాక, కొద్దిసమయం గడిచాక అక్క, నేను, తమ్ముడు ముగ్గురం కొంచెం దూరంగా ఒక్కొక్కరం ఒక్కో ప్రమిద దగ్గర కూర్చొని ముందుగా కొన్ని కాకరపువ్వొత్తులు, కొన్ని మతాబులు కాల్చేవాళ్లం.
తర్వాత కాసేపటికి వాళ్లిద్దరూ సీమటపాకాయల్ని ఒక్కొక్కటి చొప్పున చేత్తో పట్టుకొని, ఒత్తి దగ్గర వెలిగించి కిందకు విసిరేవాళ్లు. అవి టపా టపా మని పేలుతుంటే, నేను కూడా అలా పేల్చేయాలని ఆరాటపడుతూ టపాకాయను దీపం ఒత్తి దగ్గర పెట్టి కిందకు విసిరేదాన్ని.
కానీ అదేం తమాషానో! పది విసిరితే ఒకటో, అరో పేలేవి. నాకు కోపం ముంచుకొచ్చేది. నాన్న దగ్గరికి వెళ్లి, “నాన్నగారూ! నాకు మంచి సీమటపాకాయల ప్యాకెట్ రాలేదండి” అని చెప్పేదాన్ని.
నాన్నగారు నవ్వుతూ, “టపాకాయ ఒత్తి వెలిగితే కదమ్మా పేలేది!” అని, కాకరపుల్ల చువ్వలు పక్కన పెట్టి, “దీనితో గుచ్చి వెలిగించు” అనేవారు.
అయినా పెద్ద మార్పేమీ ఉండేది కాదు. టపాకాయతో పాటు పుల్ల కింద పడేది, అంతే! లాభం లేదని నాన్నగారు పాపం ఓ పొడవాటి చువ్వ తెచ్చి, దానికి టపాకాయ గుచ్చి, కిందకు విసరకుండా పేల్చమనేవారు.
ఎలాగో తంటాలు పడి ప్రమిదకు కొంచెం దూరంగా జరిగి, చెయ్యి పొడవుగా చాచి టపాకాయ ఒత్తి వెలిగించి, ఎడమ చెయ్యిని ముఖానికి అడ్డం పెట్టుకుని, కాస్త జాగ్రత్తతో కూడిన ధైర్యంతో మొత్తానికి అవి పేల్చేదాన్ని.
నా విన్యాసాలు చూసి అక్క, తమ్ముడు నవ్వుతుంటే, మా నాన్నగారు మాత్రం, “వాళ్లిద్దరూ టపాకాయల్ని కిందకు విసిరేసి పేలిస్తే, నువ్వు చేతిలోనే పేల్చావు కదా!” అనేవారు.
నేను కూడా నిజమే కదా అని తృప్తి పడేదాన్ని.
(నిజానికి దీపావళి టపాసులు జాగ్రత్తగా ఎలా పేల్చాలో దానిపై ఒక యాడ్ చేసి, దానికి నన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తే, నేను దానికి 100 శాతం న్యాయం చేయగలనని నా ఫీలింగ్!)
అలా ధైర్యసాహసాలతో కూడిన నా సీమటపాకాయల పర్వం సమాప్తం.
మూడవ పర్వం: (మిక్స్డ్ టపాసుల పర్వం)
సీమటపాకాయలు పేల్చే విషయంలో నా ధైర్యసాహసాలు అందరికీ సుపరిచితమయ్యాయి కదా!
ఇంక తాటాకు టపాకాయలంటారా? వాటిని ఎలాగో తిప్పలు పడి కాల్చడమో, వదిలేయడమో చేసేదాన్ని.
ఇక చిచ్చుబుడ్ల విషయానికి వస్తే, నాతో వాటిని వెలిగించాలని నాన్న చేసే ప్రయత్నాలేవీ పెద్దగా సఫలం అయ్యేవి కావు.
వాటిని బజారులో వెలిగిస్తే, నేను మా ఇంటి అరుగు పైకెక్కి చూసేదాన్ని.
ఇక భూచక్రం విషయానికి వస్తే, అది కింద అరుగు మీద తిరుగుతుంటే నేను పై అరుగు మీద ఉండేదాన్ని. పొరపాటున పై అరుగు మీదకు వస్తే, గద్దె మీదకు ఎక్కి చూసేదాన్ని.
ఇన్ని తెలిసాక విష్ణుచక్రం గురించి అడగగలరా ఎవరైనా?
కాకపోతే మీకో విషయం తెలియాలి. పాముబిళ్లలు అందరికీ తెలుసు కదా! వాటిని వెలిగించి, దానినుంచి అంత పొడవునా బుస్సుమంటూ పాము వస్తున్నా అదరక, బెదరక, ముక్కు మూసుకుని మరీ స్థిరంగా కూర్చునేదాన్ని.
అలా నా మిక్స్డ్ టపాసుల పర్వం సర్కస్ ఫీట్లతో సమాప్తం.
నాలుగవ పర్వం: (నేల టపాకాయల పర్వం)
అసలు నేల టపాకాయలు ఎవరు కనిపెట్టారో గానీ, నా దృష్టిలో వాళ్లు చాలా గ్రేట్! ఏ నిప్పుతో పని లేకుండా పేల్చగలిగేవి ఇవి మాత్రమే.
కాకపోతే, నేను పేల్చినప్పుడు చాలా సరదాగా అనిపించే నేల టపాకాయలు, ఎవరైనా నా వెనక పేలిస్తే అంతగా నచ్చేది కాదు.
ఎందుకంటే దానికీ కొన్ని కారణాలు ఉన్నాయి మరి!
నేను రెండు చేతులతో కాకరపువ్వొత్తులు వెలిగిస్తూ సంతోషపడుతున్న సమయంలో, మా తమ్ముడు గానీ, మా అక్క గానీ అకస్మాత్తుగా నా వెనక ఓ నేల టపాకాయని వేసేవారు.
అంతే! నా చేతుల్లో ఉన్న కాకరపువ్వొత్తులు ఎగిరి ఎక్కడో పడేవి. నేను కాసేపు అలాగే స్థాణువులా నిలబడేదాన్ని.
కాస్త తేరుకున్నాక విషయం అర్థమయ్యి, నా ముఖం ఎర్రగా కందగడ్డలా తయారయ్యేది.
ఆ దృశ్యం చూసి వాళ్లిద్దరూ పగలబడి నవ్వుతుంటే, పాపం మా నాన్నగారు బయటకు నవ్వలేక, నవ్వును ఆపుకోలేక తెగ అవస్థ పడేవారు.
(ఎందుకంటే నవ్వితే నేను చిన్నబుచ్చుకుంటానేమో, అలుగుతానేమో అనే భయం ఓ వైపు, నా ముఖంలోని ఎక్స్ ప్రెషన్స్ చూసి నవ్వు ఆపుకోలేక ఇంకోవైపు పాపం ఇబ్బంది పడేవారు)
చేసేదేం లేక పాపం నన్ను పిలిచి, “నువ్వు కూడా వాళ్లు ఏమరుపాటుగా ఉన్నప్పుడు టపాకాయలు పేల్చి చూడు” అనేవారు.
సరే అని నేను అలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా, వాళ్లు ఎప్పుడూ అంతలా పట్టించుకోకుండానే వాళ్ల మానాన వాళ్లు టపాసులు కాల్చుకునేవాళ్లు.
వాళ్లను ఎలాగోలా దడిపిద్దామని నేను చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించకుండానే నా నేల టపాకాయల పర్వం తుస్సుమంటూ సమాప్తం.
ఇప్పుడు ఆ టపాసుల్ని పెద్దగా భయపడకుండా పేల్చగలిగినా, అలాంటి ఎన్నో దీపావళి పండుగలు జరుపుకుంటున్నా, ఎందుకో దీపావళి పండుగ అంటే అప్పటి దృశ్యాలే కళ్లముందు మెదులుతాయి. తలుచుకోవాలనిపిస్తాయి. ఓ సన్నని దరహాసాన్ని పెదవులపైకి రప్పిస్తాయి.
ఎంతైనా బాల్యానికి చెందిన జ్ఞాపకాలు కదా! అలాగే అనిపిస్తాయేమో!
(అవండీ నా దీపావళి పండుగ అనుభవాలు. మీ అనుభవాలు కూడా పంచుకోవాలనిపిస్తుందా? మరి ఆలస్యమెందుకు?)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి