దట్టంగా ఆవరించిన వేళ
నన్ను నేనే ప్రశ్నించుకుంటూ
నాతో నేను మాట్లాడుకుంటున్నా!
అనాదిగా అణచివేయబడిన
మా అతివల అంతరంగాలలో
పేలే అగ్నిపర్వతాల లావాలు
నా కళ్లలో కన్నీరై గడ్డకడుతుంటే!
బయటకు చెప్పుకోలేని బాధలను
బతుకులో చెదిరిన కలల జాడలను
నిశ్శబ్దపు నీడలో కూర్చొని మోస్తూ
మనసులోని ఆక్రోశాన్ని ఆలకిస్తున్నా!
తిమిరాన్ని పారద్రోలలేనని తెలిసినా
చందమామ వెన్నెల పంచడం ఆపదుగా!
గాఢాంధకారాన్ని తరమలేవని ఎరిగినా
తారలు ప్రకాశించడం మానవుగా!
నేనెందుకు మరి వేడి నిట్టూర్పుల సెగలతో
ఆవేదనను గుండెలో నింపుకుంటున్నా?
ఏమీ మార్చలేననే నిరాశలో మునిగి
నా మీద నేనే నమ్మకం కోల్పోతున్నా?
చెదిరిన కలల్ని తలుచుకుంటూ
చితికిన ఆశల్ని నెమరేసుకుంటూ
వర్తమానాన్ని వ్యర్థంగా గడిపేస్తే
రేపటి వెలుగు నన్ను చేరుతుందా!
ఒంటరితనాన్ని శాపంగా భావించక
నా సామర్థ్యాన్ని గుర్తెరిగే సాధనంగా మలచి
ఈ అణచివేతను ఎదిరించి నిలదీసి ప్రశ్నిస్తే
ఏదో ఓ రోజు నా జీవితాన వెలుగులు నిండవా!
అన్యాయానికి తలవంచక
ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ
నాలోని జ్వాలను జ్యోతిగా మలచుకుంటే
నా బ్రతుకులో నవ్య ఉషోదయం కానరాదా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి