ఔ మల్ల!--- బాలవర్ధిరాజు మల్లారం

సెట్టు పచ్చగ ఉంటెనె
నాలుగు పచ్చులు అచ్చి ఆలుతయి
పాడి పంటలుంటెనే 
పది మందికి పని ఉంటది
.కడుపు నిండా తిండి దొరుకుతది
మా ఊరు గుడ పచ్చని పల్లెటూరు
పాడి పంటలకు పెట్టింది పేరు
గందుకనే సుట్టు పక్కల ఊరోల్లు అచ్చి
పని జేసుక బతికే టోల్లు
ఇగ అడుక్కొని బతికే టోల్లకు లెక్కనే లేదు.
నలభై ఏండ్ల కిందట 
మా ఊల్లె ఎవుసం పని బగ్గుండేది
అడ్లు, మిరుప కాయలు బగ్గ పండేటివి.
కొన్ని దినాలకు 
పత్తి గుడ పండిచ్చుడు మొదలు వెట్టిండ్రు
పెసల్లు, సెనిగెలు, బబ్బెర్లు, అల్సింత కాయలు,
మక్కలు ,జొన్నలు  తక్కువ తక్కువనే పండిచ్చేటోల్లు. 
మా ఊల్లె మొదట్ల
సెరువు కిందనే పారుకం ఉండేదట
ఆనలు బగ్గ కొట్టుట్ల బాయిల్లల్ల
అయిదారు గజాల లోతుల్నే నీళ్లుండేవట!
గా బాయిల నీళ్ళను యాతం బోసి 
పొలాలకు పారిచ్చేటోల్లట. 
కొన్ని ఏండ్లకు 
యాతం  బోయి మోట అచ్చిందట.
గా మోటను  సూసుటానికి
సుట్టు ముట్టు పదూళ్ళ నుంచి అచ్చెటోల్లట
గంతె కాదుల్లా
మోట వొయు రాటు అచ్చిందట
అటెనుక డీసిల్ తో నడిసే
డంకిన్  ఇంజిన్ అచ్చింది
మారుపాక రాజేస్పర్ రావు కరెంట్ దెచ్చిండు
ఇవ్వన్ని సూసుటానికి సుట్టు ఇరువై
ఊర్ల నుండి కచ్చురాల్ కట్టుకొని అచ్చి
సూసి కట్టె సరుసుక పోయే టోల్లు
ఎందుకంటే..
గివన్నీ మొదాల్ మొదాల్ మా ఊరికే అచ్చినయి
ఔ మల్ల!


కామెంట్‌లు