ఉదయం....ఉదయం..: -అన్నట్లు వాట్సప్ లో బోలెడన్ని మెసేజులు కుప్పలు తెప్పలుగా వస్తుంటాయి. వాటిలో నూటికి తొంబై అయిదు శాతం ఫార్వర్ఠ్ మెసేజులే. అంటే ఎవరో ఒకరు ముందుగా ఒకరికి ఓ మెసేజ్ పంపితే ఆ మెసేజుని ఏమాత్రం ముందు వెనుకలు చూడకుండా దానినే తన దగ్గరున్న నెంబర్లకు పంపేయడం. అది అక్కడితో ఆగదు. ఆ మెసేజ్ అందుకున్న వాళ్ళు మళ్ళీ దానినే మరికొందరికి పంపుతారు. అలాకాకుండా ఓ అయిదు శాతం మెసేజులు తాజావై ఉంటాయి. అవి చూడడానికీ చదవడానికి ఆసక్తి పుట్టుకొస్తుంది. అలా నిన్న నాకు టి. లక్ష్మణ్ రావుగారి నుంచి ఓ రెండు క్లిప్పింగ్స్ అందాయి. అవి నాకనే కాదు, ఉదయం దినపత్రికలో పని చేసిన వారందరికీ అపురూపమైనవని నా అభిప్రాయం. కారణం ఉదయం దినపత్రిక సంక్షేమాన్ని ఆశించి ఇద్దరు ప్రముఖుల నుంచి వచ్చిన మాటలవి. ఇద్దరిలో ఒకరు రా.వి. శాస్త్రి (రాచకొండ విశ్వనాథ శాస్త్రి) గారు. మరొకరు - ప్రజాకవి కాళోజి నారాయణరావుగారు. ఈ ఇద్దరిలో కాళోజీవారిని నేనెరుగుదును. ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణగారింటికి ఆయన వస్తుండేవారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తే ఆయన కచ్చితంగా కృష్ణగారిని కలిసేవారు. అలా కాళోజీవారిని నేను కృష్ణగారింట చూస్తుండేవాడిని. నేను మీడియాలోకి రావడానికి కారకులు కృష్ణగారే. కానీ ఆయన నాకెక్కడా ప్రత్యక్షంగా సిఫార్సు చేయలేదు కానీ నేను పని చేసిన పత్రికల్లో ఆయన పేరు నాకు "పరోక్ష అండ"గా ఉండేదని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఉదయం దినపత్రికలో 1984 డిసెంబర్ 18 వ తేదీన ప్రూఫ్ రీడరుగా చేరడానికి సహాయం చేసింది ఠాగూర్ గారనే పర్సనల్ ఆఫీసర్. ఠాగూర్ గారూ, నేనూ అంతకుముందు ఎ.పి. వికలాంగుల సహకార సంస్థలో కలిసి పని చేశాం. ఆ పరిచయమే నాకు "ఉదయం" లో ఉద్యోగం రావడానికి తోడ్పడింది. కె.ఎన్.వై. పతంజలిగారి దగ్గరకు నన్ను తీసుకుపోయి పరిచయం చేస్తూ ప్రూఫ్ రీడింగ్ లో పరీక్ష పెట్టించారు ఠాగూర్ గారు. పతంజలిగారు పరీక్ష పెట్టి తీసుకున్నారు. ఓ ఏడాదిన్నర తర్వాత నేను సబ్ ఎడిటర్ గా మారడానికి తోడ్పడిన వారు జి. రమణ (కృష్ణగారి మూడో అబ్బాయి), నడింపల్లి సీతారామరాజుగారు. వీరిద్దరూ కలిసి పతంజలిగారికి చెప్పగా మళ్ళీ పరీక్ష పెట్టి సబ్ ఎడిటర్ ట్రైనీగా తీసుకున్నారు. ఇంటర్వ్యూ సమయంలో నా తరఫున దాసరి నారాయణ రావుగారితో మాట్లాడినదంతా పతంజలిగారే. ఓ దశలో దాసరివారు "ఏంటీ ఆ అబ్బాయి ఏమీ మాట్లాడడా? అతని గురించి ఆన్ని విషయాలూ మీరే చెప్తున్నారు. అతను నోరు విప్పనీండి. ఏం చెప్తాడో వింటాను" అన్నారు. అప్పుడు నా పక్కనే కూర్చున్న పతంజలిగారు "చెప్పండి మీ వివరాలు" అని అన్నారు. అప్పటికీ నేను చెప్పిన మాటలు చాలా తక్కువే. ఈ ఇంటర్వ్యూ సన్నివేశం ఎప్పటికీ చెదరి పోదు. ఆ ఇద్దరు ప్రముఖులు ఉదయం దినపత్రిక కోసం రాసిన విషయం చెప్పడంమాని నా విషయం చెప్పడానికి కారణం లక్ష్మణ్ రావుగారు పంపిన క్లిప్పింగ్స్ చదువుతుంటే అలనాటి సంఘటనలు కళ్ళముందు కదలాడాయి. అందుకు లక్ష్మణ్ రావుగారికి కృతజ్ఞతలు చెబుతూ రావి శాస్త్రి, కాళోజిగార్ల మాటలు ఇక్కడ యథాతథంగా పొందుపరుస్తున్నా చూడగలరు..... ముందుగా రావి శాస్త్రిగారి మాట... (ఇది 1985 జనవరి 23 న ఉదయంలో అచ్చయింది) "ఉదయం" పాఠకుల గురించి ఒక సంక్రాన్తి కోరిక ఇటీవలే కొద్దిరోజుల కిందటే సాయంకాలం నేను "ఉదయం" చూసేను. సాయంకాలాల్లో కూడా ఇంకా నేను ఉదయాలని చూడగలుగుతూన్నందుకు నాలో నేను, అంటే నామట్టుకు నేను, సంతోషించుకున్నాను. ఈనాటి కొన్నింటిలా కాకుండా ఈ ఉదయాలని ఆనందించడానికి వీలుగా వాటిని రాత్రుళ్ళకి కూడా దాచుకోవచ్చును అని నాకు అనిపించింది. అందుచేత, ఏ సమయంలో చదివే వారైనా సరే ఈ ఉదయంపు పాఠకులని ఉద్దేశించి వారికి నా సంక్రాన్తి కోరిక తెలియజేయాలి అనే కోరిక కలిగింది.అసలు "కోరికలు" అనే సరంజామాని పెంచుకోకూడదు. వాటిని అన్నింటినీ తెంచుకోవాలి అనేది అలనాటి బుద్ధ భగవానుడి బోధే అయినప్పటికీ, నిజం చెప్పవలసివస్తే, ఆయన కోరికల్లో ఒక మంచి చక్కని "కోరికే" అది. మంచివారికి మంచి కోరితే అందులో ఏ తప్పూ లేదు అని నేను తలుస్తాను. అందువల్లనే "మీ మేలిమి బంగారు మంచి కలలు అన్నీ కూడా మీ కళ్ళ ముందు నిజమయి రుజువయి మీరంతా పచ్చగా వర్ధిల్లాలనేది ఈ సంక్రాన్తి శుభవేళ నా పసిడిపూల కోరిక" ఆని ఇదివరకు ఎవరైనా ఎప్పుడైనా మీతో అన్నారా?అంటే - సరే.అనకపోతే ?అనకపోతే - సరే సరే!ఎందుచేతనంటే,మీ అందరి గురించీ ఈ సంక్రాన్తి వేళ నా పూలపచ్చని చిలక చక్కని కోరిక - అదే అదే!(పోస్టువారి ధర్మమా అని సంక్రాన్తి కోరిక కనుమ పండుగ దాటిన వారంలోపే అందింది) రా.వి. శాస్త్రి గారి "ఈ సంక్రాన్తి కోరిక" చదివి కాళోజి నారాయణ రావు గారు రాసిన మాటలు "ఉదయం" దినపత్రికలోనే ఆ మరుసటిరోజే ఆనగా జనవరి 24 న వెలువడింది. ఆ మాటలివే...... "సూరజ్ కభీన డూబె తేరా జబ్ తూ జాగే తబీ సవేరా" - అనేది ఒక పాత సినిమా పాట. అర్థం - నీ సూర్యుడు "ఉదయం". ఉదయం అవతరిస్తేనే సరిపోదు. మనం మేల్కొనే ఉండాలి. మరో మాటలో మనం మేల్కొని ఉండడమే మన ఉదయం. మేల్కొని ఉన్న వాని సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు. అందుకే ప్రజాస్వామ్యంలో మూలసూత్రం "ఎటర్నల్ విజిలెన్స్ ఆఫ్ ది సిటిజన్ (పౌరుని అనవరత జాగృతియే) ప్రజాస్వామ్యానికి రక్ష - బ్రతుకంత మేల్కొని బ్రతకాలి. జాగృతి కలిగి బ్రతకాలి.మరొక్కసారి లక్ష్మణ్ రావుగారికి థాంక్స్!!- యామిజాల జగదీశ్
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి