తెలుగువారు గర్వించదగిన గొప్ప వ్యక్తులలో కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు ఒకరు. స్వాతంత్ర్య సమరయోధునిగా, రాజకీయ నాయకునిగా, గ్రంథాలయల స్థాపకునిగా, వ్యాపారవేత్తగా, పాత్రికేయునిగా, ప్రచురణ కర్తగా, విద్యావేత్తగా, వితరణశీలిగా, ఖాదీవుద్యమ ప్రోత్సాహకునిగా బహుముఖ సేవలు అందించాడు. వీరు 1867 మే 1 న కృష్ణా జిల్లా ఎలకుర్తిలో జన్మించారు. తల్లిదండ్రులు శ్యామలాంబ, బుచ్చయ్య. ప్రాధమిక విద్యను స్వగ్రామంలో చదివాడు. ఉన్నత పాఠశాల విద్యను మచిలీపట్నంలో చదివాడు. 1891 లో మద్రాస్ క్రైస్తవ కళాశాల నుండి డిగ్రీ పట్టా పొందాడు.
పంతులు గారిపై ఇద్దరు వ్యక్తుల ప్రభావం ఉండేది. కందుకూరి వీరేశలింగం ప్రభావంతో సాహిత్య,సంస్కరణలపై మక్కువ చూపాడు. అలాగే మద్రాసులో చదివేటప్పుడు ఆచార్యుడైన డా. రెవరెండ్ ముల్లర్ దొర వ్యక్తిత్వం ఆయనను సేవాభావం వైపు మరల్చింది.
తొలినాళ్లలో పంతులు గారు మద్రాస్, కలకత్తా, బొంబాయి నగరాలలో ఉద్యోగం చేశారు. అదే సమయంలో ఏదైనా చేయాలనే సంకల్పం కలిగింది. అతని దృష్టి వ్యాపారం వైపు మరలింది. 1893లో అమృతాంజన్ లిమిటెడ్ సంస్థను నెలకొల్పి తలనొప్పి నివారిణి తైలం తయారు చేసి విక్రయించాడు. ఇది బహుళ ప్రజాదరణ పొందింది. దీని స్పూర్తితో 1908లో పాత్రికారంగంవైపు కాలు పెట్టాడు. బొంబాయి నుండి ఆంధ్రపత్రిక వారపత్రికను ప్రారంభించాడు. 1914 మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో దాన్ని దిన పత్రికగా మార్చాడు. 1924లో సాహితీ సాంస్కృతిక మాస పత్రిక *భారతి* ప్రారంభించాడు.
ఇవన్నీ విజయవంతం కావడంతో పత్రికరంగంతో పాటు ప్రచురణ రంగంలో కాలుపెట్టాడు. 1926లో ఆంధ్ర గ్రంథ మాలను స్థాపించాడు. అందరికి అందుబాటైన ధరలో మరుగున పడిపోతున్న విలువైన ప్రాచీన గ్రంథాలను పునఃముద్రించాడు. వీరికి భాషాభిమానం ఎక్కువ. తిరుమల వెంకట రంగాచార్యులు సంకలనం చేసిన పారిబాషికపదకోశము, బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, జీర్ణవిజయనగర చరిత్ర, తంజావూరు ఆంధ్ర నాయక రాజుల చరిత్ర, మాలపల్లి, మహాత్మా గాంధీ ఆత్మకథ తదితర ప్రఖ్యాత పుస్తకాలను ఆ సంస్థ ద్వారా ముద్రించారు. 1938లో కొమర్రాజు లక్షమణరావు రాసిన ఆంద్ర విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలు ముద్రించారు. 1929 లో ఆంధ్ర నాటక కళా పరిషత్తును స్థాపించి నాటకరంగం ప్రముఖుని కొనియాడబడినాడు. అంతేకాదు తెలుగు నాట గ్రంథాలయ స్థాపనకు ఎంతో కృషి చేశాడు. దాదాపు 150 పైగా గ్రాంధాలయాల స్థాపనకు కారకూడయ్యాడు.
టంగుటూరి ప్రకాశం పంతులుకు సమకాలికుడైన నాగేశ్వరరావు పంతులు ఆయనలాగే రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. 1924 - 34 మధ్య 4 సార్లు స్థానిక కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా వున్నాడు. ఖద్దరు ఉద్యమాన్ని ప్రోత్సాహించాడు. 1931 లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించాడు. జైలు సమయంలో భగవత్గీతపై వ్యాఖ్యానం రాసాడు. గీత మత గ్రంధం కాదని, ఓ మంచి వ్యక్తిత్వ వికాసం గ్రంథమని పంతులుగారి అభిప్రాయం.
మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ఆంధ్రప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి పంతులుగారు తొలిదశ నుండి నాయకత్వం వహించారు. తన పత్రికలలో విస్తారంగా వ్యాసాలు రాసి ఉద్యమానికి ప్రచారం కల్పించారు. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడటానికి దోహదం చేసిన శ్రీబాగ్ ఒప్పందం పంతులుగారి గృహంలోనే జరిగింది. శ్రీబాగ్ పంతులుగారి గృహం పేరు. ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందమే శ్రీబాగ్ ఒడంబడిక. వీరి సేవకు దేశోద్ధారక బిరుదు ప్రధానం చేశారు. అలాగే వీరు వితరణ శీలి. అనేక మందికి గుప్తధానాలు చేసాడు. అందుకే ఆయనను విశ్వదాత అంటారు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరిని కళాప్రపూర్ణ భిరుదుతో సత్కరించింది. ఈ మహనీయుడు 11.4.1938లో మద్రాసులోని ఆయన స్వగృహంలో తుందిశ్వాస విడిచాడు.
కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు (1.5.18 నుండి 11.4.1938): - దార్ల బుజ్జిబాబు
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి