ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి

  ఈ రోజు డా సామల సదాశివ గారు  ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాకు అభినవ మొల్ల శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారు రాసినప్రశంసా పద్యాలలోని ఒక పద్యం గుర్తుకు వస్తుంది.
ఉ.కమ్మని ఉరుదు భాషయను కాచిన తీయని పాలలో ననంతమ్ముగ దాగియున్న పరతత్త్వ మహత్తర నూత్నప్రేమ తత్త్వమ్మును దీసి తెల్గు కవితానవనీతము జేసి ఆంధ్రలో
కమ్మున బంచి పెట్టిన యఖండ యశోవిభవా సదాశివా!
ఆ మహానుభావుని గురించి ఎంత చక్కగా చెప్పారో ఆమె.
తెలంగాణా ఉద్యమం మంచి ఊపులో ఉన్నపుడు తెలంగాణా ఆవిర్భావ ప్రత్యూష రేఖలుపొడసూపే వేళ తెలంగాణ ఉషోదయం తిలకించకుండానే అగస్టు 7 ,2012  న అస్తమించిన ఆదిలాబాద్ కవి,రచయిత అన్నిటికంటే ముఖ్యంగా మాస్టారు అని పిలువబడ్డ సామల సదాశివ సారును గుర్తుకు తెస్తుంది అగస్టు నెల ఇటీవలఐదారేండ్ల నుంచీ.
      ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకుని,తాను పుట్టి పెరిగిన నేలను వదలకుండా ఎక్కడెక్కడి వారినో ఆకట్టుకునే రచనలు చేసి పండిత పామరులను అలరింప జేసి అనేక మంది పాఠకుల్ని తయారుచేసుకున్న ప్రముఖ రచయిత సామల సదాశివ.తాను ఖట్టర్ తెలంగాణావాదినని చెప్పుకునే మాస్టారుకు తెలంగాణేతర ప్రాంత అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండేదంటే ఆయన ఎంత విశిష్టమైన వ్యక్తిత్వం గలవారో గమనించవచ్చు.
         అవిభక్త  ఆదిలాబాదు జిల్లా లోని కాగజ్ నగర్
దగ్గర తెనుగుపల్లె మాతామహుల ఇంట్లో 11 - 5 -1928 న జన్మించిన సదాశివ బాల్యం నవెగాంలో గడిచింది.తండ్రి నాగయ్య పంతులు బడిపంతులు.తల్లి చిన్నమ్మ. 
     ఏకైక సంతానమైన సదాశివ తండ్రి వద్ద చదువు నేర్చుకుని అప్పట్లో పెద్ద తరగతులన్నీ ఉర్దూ మాధ్యమంలో ఉండటమేగాక పెద్ద ఊళ్లలో మాత్రం ఉండటం చేత వరంగల్ లో పాఠశాల విద్యనభ్యసించారు. ఇంట్లో భారత భాగవతాలు రామాయణం వంటివి ఉండటం వలన సహజంగా జ్ఞానాంశ కలవాడు కనుక,వాటిని ఒంటబట్టించుకున్నారాయన.అంతే గాక తండ్రి ఒక గురువు వద్ద అరబ్బీ ఫారసీ నేర్చుకునే అవకాశం కలిగిం చారు. అలా యౌవన దశలోపే ఆయనకు ఇటు సంస్కృతాం ధ్రాలు,అటు అరబ్బీ, ఫారసీ,ఉరదూ భాషలపై పట్టు దొరికింది. దానికి తోడు కొద్దో  గొప్పో ఆంగ్లం తోడైంది.
                అప్పట్లో తెలుగు భాషలో పద్యాలు రాసేవారికి బాగా ప్రాధాన్యత ఉండటం గమనించి పద్యాలు రాసి భారతి వంటి పత్రికలకు పంపటంతో వేలూరి శివరామశాస్త్రి,కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వంటి ఉద్ధండ పండితుల దృష్టిలో పడ్డారు సదాశివ. నిర్దుష్టంగా భావరమ్యమైన పద్యాలు వారి నాకర్షిం చటంతో ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా వారితో పరిచయాలు పెరిగి పలు రచనలు చేసే స్ఫూర్తి లభించింది.కారణాంతరవల్ల తండ్రి ఉద్యోగం మానేయవలసి వచ్చినందువల్ల సదాశివ పాఠశాల చదువు కాగానే ఆదిలాబాదు జిల్లాలోనే బడిపంతులు ఉద్యోగం లో చేరారు.
       ఇటు ఉద్యోగం చేస్తూనే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ సాంబశివ శతకము,నిరీక్షణ,మంచిమాటలు, విశ్వామిత్రము,అంబపాలి,ధర్మవ్యాధుడు వంటి పలు పద్యలఘుకృతులు వెలువరించారు. అమ్జద్ రుబాయీలను తేటగీతులలో తెనిగించారు.తెలుగులో కథలు నవలలు కూడా ప్రయత్నించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే ఉర్దూలో అనేక వ్యాసాలు రాసి ఉర్దూ పాఠకులకు దగ్గరయ్యారు.మన తెలుగు కవులను వారి రచనలను ఉర్దూ పాఠకులకు పరిచయం చేసిన ఘనత సదాశివ గారిదే. 
        ఈసమయంలోనే సురవరం ప్రతాపరెడ్డి సూచన మేరకు పద్యరచన మానుకుని తనకున్న ఉర్దూ అరబ్బీ భాషా పటిమతో ఉర్దూ సాహిత్యవిశేషాలను ఉర్దూ కవులను తెలుగువారికి పరిచయం చేసే పనికి పూనుకున్నారు.అలా ఉర్దూసాహిత్య చరిత్ర,ఫారసీకవుల ప్రసక్తి,మహాకవి గాలిబు వంటి పుస్తకాలు రచించి ఉర్దూ తెలుగు వారధిగా మంచి పేరు తెచుచుకోవడమే గాక అకాడమీ సభ్యులుగా చిరకాలం పనిచేశారు.గీటురాయి, మిసిమి పత్రికలలో గజల్ పుట్టుపూర్వోత్తరాలు,రూమీ మస్నవీలు 
ఇంకా అనేక ఉర్దూ భాషాసంస్కృతులకు ముఖ్యంగా హిందూ స్తానీ సంగీత గాయనీగాయకుల విశేషాలు వ్యాసరూపంలో వచ్చాయి. అలాగే వారి ఉరుదూ రచనలు సియాసత్ వంటి ప్రసిద్ధ ఉరుదూ పత్రికలలో ప్రచురించబడేవి. వారి వచన రచన ముచ్చట్ల రూపంలో ఉండటంతో అనేకమంది పాఠకులను అలరించేది.
         స్వతహాగా చిన్నప్పటినుంచే సంగీతాభిమాని మరియు సంగీతజ్ఞడవటంతో ఆయనవ్యాసాలు చాలా విశిష్టతను కలిగి అడిగి రాయించుకునే స్థాయికి చేరుకున్నాయి.అవే తరువాత మలయమారుతాలు,సంగీతశిఖరాలు,స్వరలయలు పుస్తకాలు గా వెలువడినాయి.ఇందులో స్వరలయలు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సంపాదించి పెట్టింది.ఇవన్నీ ఒక ఎత్తయితే వార్త పత్రికకు యాది పేరిట ఆయన రాసిన వ్యాసాలు ఆయన ఇంటిపేరు మార్చి ఆయనను యాది సదాశివను చేశాయి. ఆయన వ్యాసాలకోసం పత్రికను కొన్న వారెందరో అప్పట్లో. ప్రతిభాశాలి గనుక ఆయన సాహిత్య వ్యక్తిత్వాన్ని పురస్కరించుకొని కాకతీయ విశ్వవిద్యాలయం మరియు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం డాక్టరేటు పట్టాలను ప్రసాదించాయి. 
     తనకు పరిచయమైన వ్యక్తులు చిన్నా పెద్దా అని తేడాలేకుం డా మానవీయతా దర్శనాన్ని అనితరసాధ్యంగా యాదిలో పొందు పరచడంతో దానికి ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది.
      సంగీత సాహిత్యాలే గాక చిత్రలేఖనంలో కూడా అత్యంత ప్రావీణ్యంగల సదాశివ తైలవర్ణ చిత్రాలెన్నో గీశారు. ఆయనకు పరిచయమైన ప్రతివ్యక్తితోనూ పండిత పామరులనే తేడాలేకుం డా, వాదాలకతీతంగా నిరంతరం ఉత్తరాల ద్వారానో ఫోన్ ద్వారానో, సంబంధాలను కొనసాగించేవారు.
        ఉద్యోగ రీత్యా ఆదిలాబాదులో స్థిరపడి ఆదిలాబాదుకు ఏ అధికారి వచ్చినా ఆయనను కలుసుకునే విధంగా పేరు తెచ్చుకు న్న మానవప్రేమికుడు.వచ్చిన వారితో వారి స్థాయికి తగ్గముచ్చట్లు పెట్టి వారి హృదయాలలో చిరస్థాయగ నిల్చిన అసాధారణ వ్యక్తి సామల సదాశివ.
                  ఉద్యోగం చివరి దశలో పదోన్నతిపై భద్రాచలంలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేసి అక్కడే ఉద్యోగ విరమణ గావించారు.అలా ఆయన్ని ఆయనకు ఇష్టమైన రాముడు తన దగ్గరికి రప్పించుకున్నాడు కావచ్చు.ఎందుకంటే ఆయనంతట ఆయన ఏనాడు ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించలేదని చెప్పేవారు. 
       భద్రాచలంలో ఆలయానికి వెళ్లినపుడు ఆయన గుర్తించిన నిలయ విద్వాంసులు ఆయన కిష్టమైన కీర్తనలు వాయించే వారంటే వారెంతగా మనుష్యులను ఆకర్షించేవారో తెలుస్తుంది. ఆయన రచనలలో ఇంతవరకు వెలుగు చూడనిది ఆయన నారాముడొక్కటే.
                    ఆయన తొలిదశలో రాసిన కథలు కొన్ని అప్పట్లో సుజాతపత్రికలో ప్రచురించబడ్డాయి.వాటిని ఇటీవలే ఫేస్బుక్ మాధ్యమం ద్వారా సంపాదించగలిగాము.కరీంనగర్ ఫిలిం సొసైటీ వ్యవస్థాపకులలో ప్రముఖుడు వారాల ఆనంద్ గారు సామలసదాశివ ముఖాముఖితో ఒక లఘు చిత్రాన్ని నిర్మించారు. మిత్రుడు తాళ్లపల్లి మురళీధరగౌడు తన జీవనరేఖలు అనే ప్రముఖుల ఇంటర్వ్యూల పుస్తకంలో సదాశివగారి ఇంటర్వ్యూ ప్రచురించారు.ప్రతిభాశాలియైన సదాశివ పొందిన సన్మాన, సత్కార, పుర స్కారాలు అన్నీ ఇన్నీ కావు. 
అడవులజిల్లా ఆదివాసుల జిల్లాలో పుట్టిన సదాశివ అక్కడి గోండు వీరుడు కొమురం భీమును తొలిసారిగా పాఠ్యపుస్త కాలకెక్కించి ఈరోజు కొమురం భీము ఒక గొప్ప విప్లవవీరుడిగ గుర్తించబడటానికి కారణభూతులయ్యారు.
               ఆయన రేడియో ప్రసంగాలకు చెప్పలేనంత ఆదరణ లభించేది. ఆదిలాబాద్,వరంగల్,హైదరాబాద్,విశాఖపట్టణం మొదలైన ఆకాశవాణి కేంద్రాల నుంచి ఆయన అనేక ప్రసంగాలు ప్రసారం చేయబడ్డాయి.
           సియాసత్ ఉర్దూ దినపత్రికకు ఆయన రాసిన వ్యాసాలు వెలుగులోనికి రావలసి ఉన్నాయి.తనకు తాను ఖట్టర్ తెలంగాణ వాదినని చెప్పుకునే సదాశివ తెలంగాణా అస్తిత్వానికై  ఎంతో పాటు పడ్డారు.కాళోజీ సోదరులతో ఆయనకున్న అనుబంధం మాటల కందనిది.అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సదాశివ ఆత్మీయ స్నేహితులు.తెలంగాణా ఉద్యమసమయంలో చంద్రశేఖర్ రావుతో సహా ఆయనను సంప్రదించని నాయకులు లేరు.
             దురదృష్టవశాత్తు తెలంగాణ ఏర్పడకముందే అగస్టు 7,2012న ఆయన కన్ను మూశారు.ఆయనకు భార్య ముగ్గురు కుమారులు. ఇటీవలే ఆయన సతీమణి పరమపదించింది. మనుమలు మనుమరాళ్లంటే ఎనలేని ప్రేమ.
        తెలుగు సాహిత్య చరిత్రలో సదాశివకు సముచితస్థానము 
న్నదనటంలో సందేహం లేదు.మొన్న జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పేరున ప్రత్యేక వ్దికనేర్పాటు చేయటం ఒక చిన్న ఉదాహరణ.అలాగే విశ్వనాథ పీఠం వారు ఆయనకు కేంద్ర సాహిత్యపురస్కారం లభించిన సందర్భంగా ఆయన విశిష్ట రచనలతో పాటు పలువురి వ్యాసాలతో ఆరువందలకు పైగా పేజీల ప్రత్యేక సంచికను తయారు చేసి ఆయన సమక్షంలోనే ఆదిలాబాదు ఆకాశవాణి కేంద్రంలో ఆవిష్కరించటం ఆయన సాహితయసేవకు ఒక మంచి గుర్తింపు.
       అలాగే ఆయనమరణానంతరం  కావలి నుండి వెలువడిన ఒక వ్యాస సంకలనానికి ఆయన ముఖ చిత్రంతో సదాశివ స్మారక సంచికగా వేయటం ఎల్లలు లేని ఆయన సాహితీ సౌరభానికి నిదర్శనం.
         ఆదిలాబాదు జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక నగరం సిర్పూర్ కాగజ్ నగర్లో ఆయన శిలావిగ్రహ ప్రతిష్ఠాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  
                  నేను ఆదిలాబాదు జిల్లాలో  నలభై సంవత్సరాలు ఉద్యోగరీత్యా ఉండటంతో ఆయనతో మూడు దశాబ్దాల సాన్నిహి త్యం చూరగొన్నాను.నా తొలి పుస్తకం గొంతెత్తిన కోయిల ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించబడటమే గాక మలి పుస్తకం మువ్వలు వెలువడటానికి ఆయన ప్రేరణ కారణం.
        నా సాహిత్యప్రగతికి మూలకారణమైన కే.నారాయణ గౌడు సదాశివగారి ప్రియశిష్యుడు.సదాశివ పద్యకృతులన్నీ సంకలించి సదాశివ కావ్యసుధగా కాగజ్ నగర్ తెలుగు సాహితీ సదస్సు ప్రచురించింది. దానికి కే.నారాయణ గౌడు గారు సంపాదకులు . ఆయనే నన్ను తొలి సారి సదాశివ గారికి పరిచయం చేశారు. 
   సదాశివగారి మరణానంతరం సదాశివ సాహితీబంధువుల వ్యాసాలు,కవితల సంకలనం ‘సదాశివస్మృతిసుధ’కు నేను సంపాదకుణ్ణి కావటం నాకు ఒక పదిలమైన జ్ఞాపకం.
జలాలుద్దీన్ రూమీ ఖండకావ్యంలో వారు రాసిన క్రింది పద్యం వారికి అక్షరాలా వర్తిస్తుంది
ఉ.శ్రోతల మానసంబులు స్పృశించి,కదల్చి రసానుభూతినే
కైతయొసంగు నయ్యదియె కైత;అదైనను ఆత్మతత్త్వ వ్యా ఖ్యాతమయేని శ్రేష్టతమమట్లు కవిత్వము చెప్పునట్టి వి
ఖ్యాత కవీంద్రులే ఋషులకారణబంధులు మానవాళికిన్
తెలంగాణాలో ఎందరో మహానుభావుల్లో ఆయన ఒకరు.ఆయన 93వ జయంతి సందర్భంగా ఆయనకు జోహార్లు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం