ఈ సమాజానికి దిక్సూచి జ్యోతిరావు పూలే : - డా.వాసరవేణి పర్శరాములు,9492193437


  (జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా...)
        అసమానతలు, బానిసత్వం, వెట్టిచాకిరి, మూఢనమ్మకాలు,  దోపిడీ, స్త్రీవివక్ష, అమానవీయ సంఘటనలు సమాజాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో సంఘసంస్కర్త సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 11 ఏప్రిల్  1827లో సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి గోవిందరావు వ్యవసాయం చేస్తూ ,కూరగాయలమ్మి కుటుంబాన్ని పోషించేవాడు.  పూలే బాల్యంలోనే తల్లి చనిపోయింది. పూలే ఏడు సంవత్సరాల వయసులో ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించాడు. కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడంవలన చదువు మానేసి తండ్రికి పనులలో సహకరించేవాడు. పూలే చదువాలనే ఆసక్తిని గమనించి 1841లో స్కాటిష్ మిషన్ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. సదాశివ బిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణుడి పరిచయం ఏర్పడింది. జ్యోతిరావుకు చిన్నప్పటినుండి శివాజీ, జార్జ్ వాషింగ్టన్ అంటే ఇష్టం. వారి జీవితచరిత్రలు చదివి ప్రభావితం అయ్యారు. వారి నుండి దేశభక్తి ,నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నారు. థామస్ రాసిన మానవ హక్కుల పుస్తకం చదివి స్వేచ్ఛ ,సమానత్వం గురించి లోతుగా అధ్యయనం చేశారు. చత్రపతి శివాజీ రాజు, గులాం గిరి, పూణే సత్యశోధక సమాజనివేదిక, తృతీయ రత్న విద్యా, కతాదిల్ బ్రాహ్మణ పంతోజి మొదలగు పుస్తకాలు రాశారు. విద్య లేకపోతే ఈ సమాజం పురోగతి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
 " విద్య లేక వివేకంలేదు 
 వివేకం లేక నీతి లేదు 
 నీతి లేనిదే పురోగతి లేదు 
 పురోగతి లేక విత్తం లేదు 
 విత్తం లేకనే శూద్రులు 
 అధోగతి పాలయ్యారు 
 ఇంత అనర్థమూ 
 ఒక్క అవిద్య వల్లనే"* 

      జ్యోతిరావు పూలే కు 13 సంవత్సరాల వయసులో 9 సంవత్సరాల సావిత్రిబాయి తో  వివాహం జరిగింది. పూలే పూలవ్యాపారం ప్రారంభించారు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు వృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని భావించాడు. అందుకు స్త్రీలు విద్యావంతులు కావాలని కోరారు. తనే ఆదర్శంగా ఉండాలని తన భార్య  సావిత్రిబాయిని పాఠశాలకు పంపి చదివించారు.1848లో బాలికల పాఠశాల స్థాపించారు. అన్ని కులాలకు చదువు చెప్పించగా ఉపాధ్యాయులు ముందుకు రాలేకపోతే తన భార్య సావిత్రిబాయితో చదువు చెప్పించాడు. స్త్రీలకు చదివేంటి అని అప్పటి సమాజం హేళన చేసింది. సావిత్రిబాయి చదువు చెప్పడానికి దారిన వెళ్తుంటే ఆమెపై బురద చల్లారు. కానీ సావిత్రిబాయి ధైర్యంతో తన సంచిలో మరొక చీర వస్త్రాన్ని  పెట్టుకుని ఎన్నో అవమానాలు భరించి స్త్రీలు విద్యావంతులు కావాలని చదువు చెప్పింది. పూలే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కున్నాడు.  అయినా ముందుకు సాగుతూ 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు.
"మనిషినిమహోన్నతుడుగా 
 తీర్చిదిద్దేది విద్య ఒక్కటే" 

      ఆనాడు చిన్నపిల్లలను ముసలివారికిచ్చి పెళ్లి చేసే ఆచారం ఉంది. దీనితో భర్తలు చనిపోతే ఆమహిళలు వితంతువులయ్యేవారు వారి జీవితం వృధా కావద్దని జ్యోతిరావుపూలే వితంతు పునర్వివాహాలు జరిపించాడు. 1864లో బాల ప్రతిబంధ గృహ స్థాపించి గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. 1872లో బ్రాహ్మణ వితంతువు కుమారుడిని దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజాన్ని స్థాపించాడు. విగ్రహారాధనను ఖండించాడు. 1868లో తన ఇంటిదగ్గర ఉన్న స్నానాలతొట్టివద్ద స్నానం చేయడానికి అంటరాని వారిని అనుమతిచ్చాడు. 
      1869లో పౌరోహిత్యం యొక్క బండారం పుస్తకం రాశాడు. 1877లో దీనబంధు వారపత్రిక ప్రారంభించాడు.ఆనాటి దుర్మార్గాలు అందులో రాసేవారు.1880 యూనియన్ ఉద్యమ పితామహుడు లోకాండేతో కలిసి రైతులను, కార్మికులను ఒకటి చేశాడు. వారి హక్కుల కోసం కృషి చేశాడు. 1873లో "గులాంగిరి" , 1883లో సేద్యగాడి చెర్నాకుల , 1885లో సత్యసారాంశం రాసి ప్రచురించాడు. బ్రాహ్మణీయ సంస్థలను విమర్శిస్తూ "హెచ్చరిక" పుస్తకం రాశాడు 1888లో మద్యం షాపులు మూసివేయాల్సిందిగా మునిసిపాలిటీ అధ్యక్షునికి లేఖ రాశాడు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం రక్తనాళాల వంటి వారిని చెప్పాడు.  సమాజంలో వెట్టిచాకిరి బానిసత్వం ఉన్నాయని ఆవేదన చెందాడు. తరగతిగదిలో స్నేహం ఏర్పడ్డ బ్రాహ్మణ విద్యార్థి పూలేను తన వివాహానికి ఆహ్వానిస్తాడు. ఆ వివాహానికి హాజరైన పూలేను బ్రాహ్మణులు అవమానించి పంపుతారు. అందుకే అంటరానితనం తొలగించాలని కంకణం కట్టుకున్నాడు.
" మారాలి మారాలి మన సమాజము 
 మానవతతొ నిండాలి ఈ సమాజము" 

 అతిశూద్రులకు విద్యావ్యాప్తి చేస్తే బ్రాహ్మణులు 1849లో పూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుండి బహిష్కరింపజేశారు. అయినా పూలే ధైర్యంతో ముందుకు సాగారు. పూలే అగ్రవర్ణాల వితంతువులకు కూడా పునర్వివాహాలు జరిపించి వారికి జీవితాలను ఇచ్చాడు. 1873-75 లో సత్యశోధక సమాజం ద్వారా బ్రాహ్మణ పురోహితులు లేకుండా జూన్నార్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్లిళ్లు నిర్వహించి చరిత్ర సృష్టించాడు. అప్పటి అగ్రవర్ణాలు సామాన్యులను దోపిడి చేస్తున్న పరిస్థితులను నిరసించాడు . ఈ సమాజ సంస్కరణ కోసం జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రిబాయి పూలే అహర్నిశలు జీవితాన్ని ధారపోశారు. ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు దగ్గరుండి సేవలందించారు. అనాధలను చేరదీశారు .వితంతువులను కాపాడారు. సమసమాజం కోసం కృషి చేశారు.
    "అవిద్య అజ్ఞానానికి దారితీస్తుంది 
 అజ్ఞానం అనైతికతకు దారితీస్తుంది 
 అనైతికత అభివృద్ధి లేమికి దారి తీస్తుంది 
 డబ్బులు లేనితనం నిమ్నతరగతుల పీడనానికి దారితీస్తుంది" .* 

 జ్యోతిరావు పూలే 1890 నవంబర్ 28న పరమపదించారు.
  పూలే ఆ తర్వాత అంబేద్కర్ లాంటి మహనీయులకు మార్గదర్శనం అయ్యాడు. 
 సమాజానికి పూలే దిక్సూచి అయ్యాడు.
 "దండమో మా దీనాబంధులకు మహనీయుల్లారా! 
 అందుకోండి పేదోల్ల దండాలు మహనీయుల్లారా!!" 

జ్యోతిరావు పూలే భావజాలంలో ఇవి కనబడుతాయి. సమానత్వం, అందరికీ విద్య, స్త్రీ పురుష సమానత్వం, సామాజిక న్యాయం, మూఢనమ్మకాలు పోవాలి. దోపిడి పోవాలి, మద్యపాన నిషేధం,రైతులకు న్యాయం, అందరికీ హక్కులు, స్త్రీ విద్య, బానిసత్వం పోవాలి, అజ్ఞానం తొలగాలి,మానవత్వం, అంటరానితనం పోవాలి, ప్రగతి సాధించాలి.
       జ్యోతి రావు పూలే కన్న కలలు సంపూర్ణంగా సాకారం కావాలని కోరుకుందాం. మనం ఏ మార్పు కోరుకుంటున్నామో అట్లా ముందు ప్రతి ఒక్కరం మనం మారాలి . సమాజం అనుకోకుండా అదే మారుతుంది.
     " మంచి మంచి మల్లేలేరి మల్లే పూల దండాలల్లి 
 మల్లే పూల దండాలేత్తుమో మా పూవులనమ్మిన జ్యోతి రావు పూలేకు 
 మదిలో నిన్ను తలుచుకుందుమో మా జ్యోతిరావు పూలేను" 
    జ్యోహార్లు జ్యోతి రావు పూలేకు....జోహార్ జోహార్.... 
======================================================
 


     డా.వాసరవేణి పర్శరాములు,9492193437, సింగారం, రాజన్న సిరిసిల్ల.
కామెంట్‌లు