కబంధ హస్తాలు జాతీయం (వివరణ: డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212)

  ఒకసారి చేతికి చిక్కితే మరణమే తప్ప తప్పించుకోవవడం, పారిపోవడం అసాధ్యం అన్న అర్థంలో కబంధహస్తాలు అనే జాతీయాన్ని మనం ఉపయోగిస్తాము. ఇంతకూ ఈ కబంధుడు ఎవరు, ఈ జాతీయం ఎలా వచ్చిందో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాము. కబంధుడు మనకు రామాయణంలో కనబడతాడు. శ్రీరామ లక్ష్మణులు దండకారణ్యంలో సీతను వెదుక్కుంటూ తిరుగుతూవుంటే ఈ కబంధుడు అనే రాక్షసుడు పట్టుకుంటాడు. 
కబంధుని ఆకారం చాలా విచిత్రంగా, భయంకరంగా వుంటుంది. వానికి తల, మెడ, కాళ్ళు వుండవు. కడుపు భాగంలో పెద్ద నోరు వుంటుంది. దాని పైన ముక్కు, ఒక కన్ను మాత్రమే వుంటాయి. చేతులు మాత్రం చాలా పెద్దవి. అవి ఎంత దూరం కావాలంటే అంత దూరం సాగుతాయి. క్రౌంచ పర్వతంపై వుండి అన్నీ గమణిస్తుంటాడు. కబంధుడు కదలలేడు కానీ చూపు చాలా చురుగ్గా వుంటుంది. అడవిలో ఏ జీవి ఎంత దూరంలో అడుగు పెట్టినా  కనుక్కోగలడు. వెంటనే తన చేతులని చాపి పట్టుకోగలడు. రామలక్ష్మణులను గూడా అలాగే అడవిలోకి రాగానే తన పొడవైన చేతులు చాచి బంధించేస్తాడు. రామలక్ష్మణులు వాని చేతుల్లోంచి తప్పించుకొవడానికి కత్తులతో చాలా గాయాలు చేస్తారు కానీ వాడు పట్టు వదలడు. వాళ్ళను నోటి దగ్గరికి తీసుకొచ్చి తినబోతున్న సమయంలో కుడిచేతిని రాముడు, ఎడమ చేతిని లక్ష్మణుడు ఖండించి వేస్తారు. వచ్చింది రామలక్ష్మణులు అని తెలుసుకున్న కబంధుడు సంతోషించి తాను చనిపోగానే తన శరీరాన్ని కాల్చి వేయమని వాళ్ళని కోరతాడు. వాళ్ళు ఆవిధంగా చేయగానే కబంధుడు శాపవిముక్తి పొంది  గంధర్వునిగా రూపం పొందుతాడు. సీతను    వెదకడంలో సుగ్రీవుడు చాలా సహాయపడతాడు అతన్ని కలవండి అని చెప్పి సుగ్రీవుడు ఎక్కడ వుంటాడో, ఎటువైపు వెళ్ళాలో రామలక్ష్మణులకు తెలియజేస్తాడు.
ఇప్పుడు మనం కబంధునికి రాక్షస రూపం ఎలా కలిగిందో ఆ కథ తెలుసుకుందాం.
కబంధుని అసలు పేరు ధనువు. ఇతను ఒక గంధర్వుడు. చాలా అందగాడు. దాంతో తనంత అందగాడు ఎవరూ లేరనే గర్వం బాగా పెరిగిపోయింది. అతనికి కామరూప శక్తి వుండేది. దాంతో రకరకాల రూపాలు ధరించేవాడు. ఒకసారి వికృతమైన, భయంకర రూపంతో స్థూల కేశుడు అనే మునిని భయపెట్టి ఆట పట్టించాలని చూశాడు. దాంతో ఆ ముని ఆగ్రహించి "నీ అందాన్ని చూసే గదా నీకీ గర్వం, అహంకారం. ఇక ఇప్పటినుంచీ నువ్వు ఇదే వికృత రూపంలో శాశ్వతంగా వుండిపోతావు. నీ పూర్వ రూపం నీకు ఎప్పటికీ రాదు" అని శపించాడు. అలా అతనికి ఈ భయంకరమైన రూపం వచ్చింది. దాంతో కబంధుడు తప్పయిపోయిందని ముని కాళ్ళ మీద పడి వేడుకోగా అతని కోపం తగ్గి శ్రీరాముని చేతిలో నీవు దహింపబడినప్పుడు నీకు పూర్వ రూపం వస్తుంది. అంతవరకు ఇలాగే వుంటావు అని చెప్పాడు. ఇది ఒక కథ.
ఇదే కాక ఇంకొక కథ కూడా చెబుతారు. కబంధుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి చావు లేకుండా వరం పొందాడు. దానితో గర్వం పెరిగి తనను ఎవరూ ఏమీ చేయలేరని అహంకారంతో ఇంద్రుని మీదికి యుద్ధానికి పోతాడు. కానీ ఇంద్రుడు వజ్రాయుధంతో కబంధుని తలపై బలంగా కొట్టాడు. అతనికి చావు లేదు కాబట్టి, తల, కాళ్ళు మొత్తం శరీరంలోకి పోయి ఇలా విచిత్రంగా మారిపోయాడని చెబుతారు. ఇవి కబంధుని విచిత్ర రూపం వెనుక వున్న కథలు.