ఆచార్య దేవో భవ (2):- -బెహరా ఉమామహేశ్వరరావు.సెల్ నెంబర్: 9290061336

 గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః/
గురుర్విశ్వం నచోన్యాస్థి తస్మైశ్రీ గురువే నమః//
శ్లోక భావం:-గురు మధ్య విశ్వమంతా ఉన్నది. విశ్వము మధ్యలో గురువు నివసించే యున్నాడు
గురువు, విశ్వమునకు  మించి మరొకటి యీ జగతి యందున  ఏదీ లేదు.
పవిత్ర రామాయణ గ్రంథంలో మరో గురువు  బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. రామునికి పదిహేనేళ్ల వయసులోనే యాగ  సంరక్షణ పేరుతో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దశరధుని అనుమతితో అడవి లోగల ముని ఆశ్రమాలకు తీసుకొని వెళ్ళాడు. మార్గమధ్య కనిపించే ప్రదేశాలను చూపిస్తూ సంచార విద్యా పద్ధతి ద్వారా బోధించాడు.దేశాన్ని పరిపాలించబోయే రాజు; దేశం నలుమూలల ఎక్కడ ఏముందో తెలుసుకోవాలి. అది మంచి పరిపాలనకు ఎంతో తోడ్పడుతుంది. యుద్ధ విద్యలు అభ్య సించడమే కాదు,అనుభవం లోనికి తీసుకురావాలి. గతంలో అనుభవములు గల రాజర్షి విశ్వామిత్రుడు శ్రీరామునికి అన్ని విధాలుగా గురువు అయినాడు. స్త్రీ సంహారం అధర్మ మైన తాటకి వంటి దుష్ట స్త్రీలను సంహరించుట తప్పుకాదని, అహల్య వంటి ఆర్తులను ఆదుకోవడం సాధ్యమేనను అనుభవ జ్ఞానం కలిగించాడు. తన జీవితంలో తప్పు ఒప్పులను దాచకుండా వ్యక్తిత్వ వికాసం కోసం విశ్వామిత్రుడు శ్రీరామునికి బోధించిన గురువు. భవిష్యత్తులో రాక్షస సంహారానికి అన్నీ తానై శ్రీరామునికి  బోధించిన ఆదర్శ గురువు. శ్రీరాముని మిథిలా నగరానికి తీసుకొనిపోయి సీతారాముల కళ్యాణం జరిపించిన మహా ఋషి.
     రామాయణంలో మనకు కనిపించే మరొక గురువు; సూర్య భగవానుడు ఇక్వాకు  వంశానికి మూల పురుషుడు.. ఈయన  గ్రహాధిపతి. తన కర్తవ్యం పాటిస్తునే తనతో పాటు తిప్పుకొని విద్యను బోధించే ఆదర్శ ఉపాధ్యాయుడు. పసితనంలో పండు అనుకొని తనను మింగడానికి వచ్చిన హనుమంతుడు నోరు కాల్చుకున్నాడు. అయినా  అతని కార్యదీక్షను గమనించి పలు వ్యాకరణాలు విద్యా బుద్ధులు పరిపూర్ణముగా నేర్పాడు.
ఉదయం నుండి సాయంత్రం వరకు తనతో పాటు  ఎగర గలిగే శక్తిశాలి ఆంజనేయుడు. పరిశీలనా దక్షుడు కార్యసాధకుడు, అయినా అతనికి సానబెట్టి విద్యలు నేర్పిన ఘనత సూర్యునికే చెల్లుతుంది.ఆ
శక్తితోనే హనుమంతుడు సముద్రము దాటి లంకకు వెళ్ల గలిగాడు. చిన్ననాడు గురువులు నేర్పిన విద్య భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, అనడానికి ఇదొక ఉదాహరణ.
రామాయణంలో మరొక సుప్రసిద్ధ గురువు వాల్మీకి.ఈ
మహర్షి ఆశ్రమంలో పుట్టి పెరిగిన లవకుశులకు విద్యాబుద్ధులతో పాటు శస్త్రాస్త్ర విద్యలు నేర్పాడు. సంగీతసాహిత్యాల యందు అభినివేశం కలిగించాడు. ఆయన   నేర్పిన  విద్యల ఫలి తంగా లవకుశులు అయోధ్యకు వెళ్లి తండ్రిని చూడ గలిగారు. తండ్రి విడిచి పెట్టిన అశ్వమేధ యాగ అశ్వాన్ని నిలువరించ గలిగి శ్రీ రాముని ఎదిరించిన వీర పుత్రులు. అట్టి లవకుశుల వ్యక్తిత్వం తీర్చిదిద్దిన గొప్పతనం వాల్మీకి మహర్షిదే. ఆయన ఉపాధ్యాయ లోకానికి అందించిన విద్యా ప్రణాళికల వలన ఈనాటికి ఆదర్శప్రాయుడైనాడు..
ఇక మహాభారతంలో అనేకమంది ఘనమైన గురువులు ఉన్నారు.లక్షా పాతిక వేల శ్లోకాలతో మహాభారతం అందించిన మహా గురువు వేదవ్యాస మహర్షి. భారతంలోని ఉదంకో పాఖ్యానమే గురుశిష్యుల అనుబంధానికి ఒక గొప్ప ఉదాహరణ. తరువాత కౌరవ పాండవులను వీర యోధులుగా తీర్చిదిద్దిన మహోన్నత గురువు ద్రోణాచార్యుడు.
మహాభారతంలో మరొక సుప్రసిద్ధ సన్నివేశం "కచ దేవయానుల కథ"ఈ కథలో గురువు దేవయాని తండ్రి శుక్రుడు. శిష్యుడు బృహస్పతి కొడుకు కచుడు.
శుక్రుడు, బృహస్పతుల మధ్య శత్రుత్వం ఉంది. కానీ"మృత సంజీవని" విద్య కోసం శుక్రుని వద్దకు వచ్చిన  కచుడు. ఉత్తమ విద్యార్థి పక్కదారులు పట్టకుండా తన ఆశయాన్ని ఎలా సాధించాడు. తనకు శత్రువు కొడుకైనా కచునికి శుక్రుడు విద్యలు నేర్ప డానికి రెండు కారణాలున్నాయి. అవి 1. పుత్రికా వ్యామోహం 2. మద్యపాన వ్యసనం; ఈ రెండు బల హీనతలు కవచునికి లాభదాయకం అయినాయి.
ఈ రెండు లోపాలు గురువులో ఉండకూడనివిగా గుర్తించగలం. అలాగే మహాభారతంలో మరో గురువు పరశురాముడు. ఈయన భీష్మునికి విద్యలనేర్పి మహావీరునిగా తీర్చిదిద్దాడు.
 కాశీరాజు కూతురు అంబకు భీష్ముని వలన అన్యాయం జరిగింది.ఆ విషయం ఆంబ పరశు రామునికి తెలియజేసింది. ధర్మం కోసం శిష్యుడైన భీష్మునితో యుద్ధానికి తలపడిన ఆదర్శ గురువు. అనివార్య పరిస్థితుల్లో యుద్ధము నుండి  విరమించుకోవలసి వచ్చింది.
  మరి కొంత కాలానికి కర్ణుడు అసత్యం పలికి పరశురాముని వద్ద విద్యలు నేర్చు కున్నాడు. నిజం తెలిసిన పరశురాముడు కోపగించుకుని అతనికి అవసర‌ మైనప్పుడు విద్యలు గుర్తుకు రాక పోవునని కఠినంగా శపించాడు.
భాగవతంలో కూడా గురువులు కనిపిస్తారు. బలి చక్రవర్తికి శుక్రాచార్యుడు. ప్రహ్లాదుని గురువులు చండా మార్కులు. బలరామకృష్ణులు గురువైన సాందీపుడు. ఈ ప్రసిద్ధ గురువుల చరిత్రలు ఎంత చెప్పినా   తక్కువే అవుతుంది. అందుకే యువకులు చదివి తెలుసుకోవాలి.
మనకు పురాణాలలో నారద మహర్షి, పరాశరుడు, వ్యాసమహర్షి, శుకుడు, భరద్వాజుడు ఇత్యాది ఆదర్శ గురువులు అనేకమంది ఉన్నారు. వారి గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క 
ప్రత్యేకత, చెప్పాలంటే ఒక్కొక్క అధ్యాయం అవుతుంది.(సశేషం)
       
కామెంట్‌లు
Unknown చెప్పారు…
శ్రీ గురుభ్యోన్నమః 🙏 పురాణ ఇతిహాస భరిత గురుదేవులపై స్మరణ తీపి గురుతులై పాత తరాలవారికి , నేటి తరానికి ఆదర్శ మార్గం అందించిన మీకు ధన్యవాదాలు 🙏🌺🍊
Unknown చెప్పారు…
నేను రాసిన ఈ వ్యాసాన్ని చదివి మీ అమూల్య అభిప్రాయం అభినందనలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
ఇదంతా మన గురువుల గొప్పతనమే గానీ నాది అంటూ ఏమీ లేదు
కృతజ్ఞతలు.
Unknown చెప్పారు…
మీరు మీరు ఈ వ్యాసాన్ని చదివి నన్ను అభినందించినందులకు ధన్యవాదాలు ఇందులో నా ప్రత్యేకత ఏమి చేయలేదు
మన గురువులక గురించి చెప్పడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
మీ పేరు సెల్ నెంబరు వివరాలు తెలియజేస్తే బాగుండేది నాకు ఈ కొత్త టెక్నిక్లు ఏమీ తెలియవు ఫోన్ ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేయగలను. కృతజ్ఞతలు
Unknown చెప్పారు…
ధన్యవాదములు సార్ ☺️