మంచి పిన్నమ్మ:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 అనగనగా ఒక ఊరిలో జయ అనే ఓ మంచి అమ్మాయి ఉండేది.అమ్మాయి అంటే చిన్నది కాదు కొంత సంస్కృతం,తెలుగు గ్రంథాలు చదువుకున్నదే.
      ఆమె అక్క ,బావ చని పోవడం వలన అక్క కొడుకు భద్రి జయ దగ్గరే ఉంటూ చిన్న చిన్న సహాయాలు చేస్తుండేవాడు.వాళ్ళు చాలా బీద వాళ్ళు.జయ ఈ ఇంట్లో ఆ ఇంట్లో పాచి పనులు చేస్తూ భద్రిని పోషించేది.
       ఇలా ఉండగా భద్రికి ఆవీధిలోని కొందరు అకతాయిలతో స్నేహం ఏర్పడి విచ్చలవిడిగా ఖర్చు చేయడం, చదువులేకుండా ఆటలు ఆడుతూ జయ సంపాదనలో కొంత ఖర్చు పెడుతూ జాగ్రత్త లేకుండా ఉన్నాడు.
        అనేక మార్లు వాడికి జాగ్రత్తలు చెప్పి చూసింది. అయినా వాడు జయ మాటల్ని పెడచెవిన పెట్టాడు.
ఒక రోజు పెరట్లో జయ కూర్చుని భద్రిని గురించి,డబ్బును గురించి ఆలోచిస్తున్నది.
         చెట్టు పైన ఉండే ఒక  అందమైన రంగుల పక్షి శ్రావ్యంగా అరుస్తూ జయ పక్కన ఉన్న బండ మీద వాలింది.దాని అందమైన ఈకలు చూసి జయ ఆశ్చర్య పోయింది.
       గబగబ ఇంట్లోకి వెళ్ళి కొన్ని గింజలు తెచ్చి దానికి పెట్టింది.అది ఆవురు ఆవురు మని తినింది.
మరి తింటే నీళ్ళు కూడా త్రాగాలిగా,వెంటనే చిన్న గిన్నెలో నీళ్ళు తెచ్చి పెట్టింది.
      అది నీళ్ళు కూడా త్రాగి సంతోషంతో ఓ చక్కని కూత కూసి మనుష్య భాషలో ఈ విధంగా చెప్పింది,
"నాది గంధర్వ లోకం నిన్ను చూస్తూనే నీ బాధ నాకు అర్థం అయింది,నీ మంచితనం నాకు నచ్చింది,అందుకే నీ బాధ తీరుస్తాను,నా ఈక ఒకటి పీకి నీవు బియ్యం నిలువ చేసే పాత్రలో పెట్టు ఆఈక బంగారు కడ్డీగా మారతుంది,బియ్యం పాత్రలో బియ్యం అయిపోవు"అని చెప్పింది.
       జయ ఆశ్చర్య పోయింది.తను చేసిన చిన్న మేలుకే ఆ దేవతా పక్షి అంత మేలు చేస్తోంది, ఆ సంతోషంలో జయ భద్రిని గురించి చెప్పడం మరచి పోయింది.మెల్లగా ఒక చిన్న ఈక, పక్షికి బాధ కలగకుండా తీసుకుని బియ్యం పాత్రలో పెట్టింది.
రెండోరోజు చూసే సరికి ఈక చిన్న బంగారు కడ్డీగా మారి పోయింది!పాత్ర నిండుగా బియ్యం ఉన్నాయి!
      పక్షిని తలచుకుని దండం పెట్టుకుంది జయ.
      బంగారు కడ్డీని అమ్మి ఇంటికి కావలసిన సరకులు తనకు భద్రికి బట్టలు తెచ్చింది.ఉన్నట్టుండి ఇంట్లో కరవుతీరి డబ్బు ఉండటం చూసి భద్రి ఆశ్చర్య పోయాడు.
       తన పిన్నికి ఇంత డబ్బు ఎలా వచ్చిందో తెలుసు కోవాలని "ఇంతడబ్బు ఎక్కడిది?" అడిగాడు.
      "అవన్నీ అడగకు నీవు బాగా చదివి ఉద్యోగం సంపాదించుకో" చెప్పింది జయ.
       అయినా డబ్బు ఎక్కడనుండి తన పిన్ని తెస్తోందో అని ఆమె మీద నిఘా పెట్టాడు.
      ఒకరోజు జయ దగ్గరకు పక్షిరావడం ఈక ఇవ్వడం గమనించి,అది మనుష్య భాషలో మాట్లాడటం విని ఆశ్చర్య పోయాడు. మరొకరోజు అది చెట్టు మీద కూర్చుని ఉండటం భద్రి చూశాడు.అప్పుడు ఇంట్లో జయ లేదు.దాని వైపు ఆశగా చూడసాగాడు భద్రి.
         అది భద్రికి దగ్గరగా బండ మీదకు దిగింది.
     "నాకు డబ్బులొచ్చే ఉపాయం చెప్పు పక్షి"అడిగాడు.
      "డబ్బు సంపాదించడానికి ఉపాయాలు లేవు,కష్టపడితేనే డబ్బు అయినా,నీవు అనుకున్నదైనా సాధిస్తావు,ముందర డబ్బుకాదు నీకు ముఖ్యం,కేవలం చదువు చదువుతే గౌరవం పెరుగుతుంది,మంచి ఉద్యోగం వస్తుంది,డబ్బుకూడా వస్తుంది,మీ పిన్నిని కష్టపెట్టడం మానెయ్యి,నీ కోసం ఆమె ఎంతో కష్ట పడుతోంది ఆలోచించు" అని చెప్పింది.
        పక్షి చెప్పిన మాటలు భద్రిని ఆలోచింప చేశాయి.
       "నా ఈక ఒకటి తీసుకుని నీ పుస్తకంలో పెట్టుకో,చదువు నీకు బాగా అబ్బతుంది,పై చదువులు చదవగలుగుతావు" చెప్పింది.
        ఒక ఈక తీసుకుని తన పుస్తకంలో పెట్టు కన్నాడు.చిత్రంగా భద్రికి చదువు మీద ఎంతో ఆసక్తి ఏర్పడింది.సులభంగా అకతాయిల స్నేహం వదిలించుకున్నాడు.భద్రిలో వచ్చిన మార్పు చూసి పిన్ని ఎంతో సంతోషించింది.
      పిన్ని మంచితనమే కుటుంబాన్ని,భద్రిని కాపాడింది.
         ( Infosys సుధామూర్తి గారి కథకు అనుసృజన)
               ***********

కామెంట్‌లు