ప్రయత్నం ఆపకు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

   నేను ఇంటికివెళ్ళేసరికి మా అబ్బాయి తేజ  బొమ్మ వేస్తున్నాడు.వాడు బొమ్మ వేస్తూ విసుగు మొహం పెట్టాడు.
       " బొమ్మ వేస్తున్నావా?" అని వాడి మొహంలో విసుగును గమనిస్తూ అడిగాను.
       "ఏంటో నాన్నా ఎన్ని మార్లు వేసినా బొమ్మ బాగా రావడంలేదు" అన్నాడు.
       " బాగా రాకపోయినా ప్రయత్నిస్తూనే ఉండు,పది బొమ్మలు ఫెయిల్ అయినా పదకొండో బొమ్మ బాగారావచ్చు,నీకొక విషయం చెప్పనా బల్బు కనిపెట్టిన ఎడిసన్ బల్బ్ కనిపెట్టడంలో వెయ్యిసార్లు ఫెయిల్ అయిపోయాడట! అలా ఫెయిల్ అయిన ప్రతిసారీ కొత్తశక్తితో పట్టు విడవకుండా బల్బు బాగా వెలిగేటట్టు ఎంతో కృషి చేశాడు.ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే.
        "రా నీకు ఒక మంచి విషయం చూపిస్తాను" అంటూ తేజను తీసుకుని పెరడులోకి వెళ్ళాను.భూమి నుండి గోడ కన్నం దగ్గరకి నల్ల చీమలు బారుగా వెళుతున్నాయి. నేనొక పుల్లతో ఆ చీమల బారు మధ్యలో అడ్డు పెట్టాను.
       "ఇప్పుడు చూడు" తేజతో చెప్పాను.
       వరుసగా పోతున్న చీమలు పుల్ల అడ్డు వచ్చేటప్పటికి అవి పుల్లను తప్పించుకుని మరలా పక్కనుండి వరుసగా వెళ్ళసాగాయి.ఈ సారి మెల్లగా బారుగా పోతున్న చీమల్ని కిందికి తోసేశాను! కొన్ని నేలమీద పడిపోయాయి.
       కొంతసేపు నేను తేజ అక్కడే నిలబడి చూడసాగాము. కింద పడిన చీమలు మెల్లగా మరలా గోడ నెక్క సాగాయి. మళ్ళీ బారుగా గోడమీద కన్నం దగ్గరకు వెళ్ళసాగాయి.
       "దీనిని బట్టి నీకు ఏమి అర్థం అయింది?" అడిగాను.
       " ఎన్ని అడ్డంకులు వచ్చినా అవి లెఖ చెయ్యకుండా ఆ కన్నం దగ్గరికి వెళుతూనే ఉన్నాయి" నవ్వుతూ చెప్పాడు తేజ.
      "చూశావా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని మార్లు ఫెయిల్ అయినా,ఎడిసన్ మోస్తరు, చీమల మోస్తరు సాధించాలనే తపన ఉండాలి,నీవు వేసే బొమ్మ రాక పోతే ,కాగితాలు ఎన్ని వేస్ట్ అయినా పరవాలేదు,చక్కగా బొమ్మ వచ్చేవరకు ప్రయత్నిస్తూనే ఉండు.తప్పక మంచి బొమ్మ వేయడం సాధిస్తావు" చెప్పాను.
       "తప్పకుండా వేస్తాను నాన్నా నీవు చెప్పిన విషయం నాకు అర్థం అయింది" అని థమ్స్ ఆప్ చూపించాడు తేజ.
       మూడురోజుల్లో తేజ మంచి బొమ్మ వేసి చూపించాడు. అంతకన్నా కావలసిందేముంది?
              **************

కామెంట్‌లు
Yalamarthy Anuradha చెప్పారు…
బాగుందండీ మీ ప్రయత్నం