*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 036*
 *చంపకమాల:*
*ఖరకరవంశజా వినుమ | ఖండిత భూతపిశాచ ఢాకినీ*
*జ్వరపరితాప సర్పభయ | వారకమైన భవత్పదాబ్జ వి*
*స్ఫురదురువజ్రపంజరముఁ | జొచ్చిత, నీ యెడదీన మానవో*
*ద్ధర బిరుదాంక మేమరకు | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయకు సముద్రము వంటివాడవైన రామభద్రా! వాడి అయిన కిరణములతో వెలిగే సూర్య వంశములో పుట్టిన రామా! జయంపజాలని భూతాలు, పిశాచాలు, ఢాకినీ, శాకినీలు, జ్వర బాధలు, కష్టాలు, పాముల వల్ల భయమును కూడా పోగొట్టగలిగి, పద్మముల వంటి కాతితో ప్రకాశిస్తూ వున్న వజ్రములతో చేయబడిన పంజరము వంటి నీ పద్మ పాదముల వద్దకు నేను చేరుకున్నాను. నీకు "దీనజనోద్ధారకుడవు" అనే బిరుదు వుంది అని మరచిపోకు రామా!.... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఈ చరాచర జగత్తు మొత్తం లో వున్న అన్ని రకాల ఈతి బాధలనుండి, క్షుద్ర శక్తుల నుండి, మానవజాతి మొత్తాన్ని రక్షించ గల ఒకేఒక్క శక్తి పరమేశ్వరుడు. నిర్గుణ, నిరాకార, నిరంజన మూర్తి, జగత్ప్రభువు పరమేశ్వరుడు ఒక్కడే. ఈ కలియుగంలో ఆయనను చేరడానికి ఒకే ఒక్క మార్గం నామస్మరణ. నిరంతర ధ్యానం. కళ్ళు, ముక్కు మూసుకుని కూర్చో వలసిన అవసరం లేదు. మన ఆలోచనలు, మనసు నిండా "రామ నామాన్ని" నింపుకుని, అదేపనిగా, నిల్చున్న, కూర్చున్న, ఉద్యోగంలో పనిచేసుకుంటున్నా, ఏస్థతిలో వున్నా, నామ స్మరణ మరచి పోకుండా చేసుకోవడమే, మనకు తరుణోపాయం. అటువంటి నామస్మరణలో స్థిరమైన మానసిక స్థితి మనకు కలిగించాలని ఆ సీతారామచంద్రస్వామి నే కోరుకుందాము.....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు