ఎదనిండా ‘తడి’ ;--++ వారాల ఆనంద్
తెలంగాణా మాటంటే ఎంత పావురం 
వింటే చెవులల్ల అమృతం బోసినట్టుంటది 

పలకరిస్తే ప్రేమ ఒలక బోసినట్టుంటది 
పిలిస్తే మత్తడి దుమికినట్టుంటది 

ఎంత ఆత్మగల్లదీ భాష 

అవ్వ అంటే తొవ్వ జూపిస్తది
అయ్య అంటే వేలుబట్టుకు నడిపిస్తది 

వాకిట్లోంచి ఎవరయినా కేకేస్తే 
కిటికీ రెక్కలు బార్లా దెరిచి 
చల్ల గాలి లోనికొచ్చి ప్రేమతో 
పెయ్యంతా తడిమినట్టయితది 

పాణంగా ముచ్చట బెడితే 
పండగ జేసినట్టుంటది 

కష్టాల్ని దల్సుకుంట ఎక్కిళ్ళు పడితే 
కడుపులోంచి దుఖం తన్నుకొస్తది

ఏమి భాషిది 
మనసుకు అద్దం పడుతది 
మనుషుల నడుమ వంతెన కడుతది 

దీంట్ల దొరగాడి రాజసముంది 
కూలోడి చెమట చుక్కల మెరుపుంది
 
ఏ బస్సులోనో రైలులోనో గాలి మోటర్లోనో  
ఏ ముఖం తెలీని వాడి నోటయినా
తెలంగాణా మాట వింటే చాలు 
మావాడనిపిస్తది మావూరోడనిపిస్తది 

కానీ ఉద్యమంలో ఆధిపత్యాన్ని వూడ్చేసిన 
మా చీపుర్లు 
ఇవ్వాళ మూలకు కూలబడ్డాయి  
మీన మేషాలు లెక్కబెడుతున్నాయి 
నీళ్ళలాంటి మాటల్ని రసాయన ద్రవాల్లో మరగబెడుతున్నాయి 
పాత రాగంతో కొత్త గానం అందుకుంటున్నాయి  

అయినా 
నాకెందుకో ఈ భాషంటే 
ఎద నిండా తడి 
అది రాసే వాళ్ళంటే  
ఎంతో చెప్పలెంత ‘ఇది’     
*****

కామెంట్‌లు