విలువైన కానుక;-డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడపజిల్లా

 ఆరోజు అరుణ అరణ్యం చాలా సందడిగా ఉంది.కారణం ఆదినం మృగరాజు బిడ్డపుట్టినరోజు. సింహం నివాసం లోపల,బయట ఆకులతోరణాలు, పూలతీగల అలంకరణతో సుందరంగా ఉంది.పులులు,చిరుతలు,ఏనుగులు,ఎలుగుబంట్లు,నక్కలు,తోడేళ్లు,కోతులు,జింకలు,గుర్రాలు,కుందేళ్లు,నెమళ్లు,కోయిలలు,పావురాలు,కాకులు,గ్రద్దలు మొదలగు అన్ని జంతువులు,పక్షులు రకరకాల కానుకలతో వచ్చాయి.
అతిథులకోసం రకరకాల వంటకాలు సిద్దంగా ఉన్నాయి. ఒక్కొక్క జంతువు పిల్లసింహం దగ్గరకెళ్లి పూలనుజల్లి కానుకలను అందజేస్తున్నాయి. 
సమీరం అనే కోతి మాత్రం అక్కడ లేదు. ఈవిషయం ముందుగా సింహం అనుచరుడు నక్క కనిపెట్టింది. 
ఆలస్యం చేయకుండా సింహం పక్కకు వెళ్లి "మహారాజా!అడవిలోని జంతువులు, పక్షులు అంతా కలిసి మీ కుమారుడి జన్మదినం వేడుకలను కన్నులపండుగగా జరుపుకుంటున్నాము.కానీ సమీరం కోతి మాత్రం రాలేదు. దానికి ఎంత అహంకారం.మీవేడుకకు రాలేనంత పనులేమున్నాయి?మీకు ఎంత అవమానం"అంటూ సింహంతో అంది.
సింహం ఒకసారి పరిశీలనగా చూసింది. ఎక్కడా సమీరం కనిపించలేదు. "మహారాజా!నేనువెళ్లి సమీరం ఏమి చేస్తోందో చూసి పిల్చుకుని వస్తాను" అని చెప్పి సింహం అనుమతితో వెళ్లింది. 
అక్కడే ఉన్న పావురం ఆమాటలను వింది. పావురం సింహంతో "మహారాజా!ఇంత పెద్ద అడవిలో సమీరంకోతి ఎక్కడ ఉంటుందని నక్క వెదుకుతుంది. నాకు ఆకోతి నివాసం తెలుసు.ఎక్కడున్నా పిలుచుకుని వస్తాను" అని చెప్పి, సింహం అనుమతితో వెళ్లింది. ఈవిషయం జంతువులకు, పక్షులకూ తెలిసిపోయింది.'
ఈరోజు సమీరం కోతికి మూడింది.సింహం చేతిలో దాని వీపు విమానం మోత మోగుతుంది' అని చెవులు కొరుక్కున్నాయి. కొంతసేపటి తర్వాత నక్క వచ్చింది. "మహారాజా!సమీరం పండ్లు తింటూ, చెట్ల కొమ్మలు పట్టుకుని వ్రేలాడుతూ గెంతులేస్తోంది. 'తీరికలేదు. రాలేనుపో' అంది"చెప్పింది నక్క.
 సింహం కోపంతో ఊగిపోయింది. కొంతసేపటికి పావురం వచ్చింది. "మహారాజా!సమీరం రాలేని పరిస్థితుల్లో ఉంది"అంది పావురం. 
"పండ్లు తింటూ, గెంతులేస్తోందని నక్క చెప్పిందిలే!"అంది కోపంగా సింహం. "మహారాజా!ఈనక్కది దొంగబుద్ది. చాడీలు చెప్పి ఇతరులు బాధపడుతుంటే చూసి ఆనందించడం దాని గుణం. ఈనక్క సమీరం కోసం అడవిలో తిరగలేదు. చెట్టుకింద విశ్రాంతి తీసుకోవడం నేను చూశాను.సమీరం గురించి నక్క చెప్పింది అబద్దం"అంది పావురం.
"మరి నిజమేమిటి? ఆకోతి రాకుండా ఉండటం నాకు అవమానంకాదా?" అంది సింహం.
పావురం వినయంగా "మహారాజా! మీరు నామాటలు నమ్మవద్దు. సమీరం కోతి ఏంచేస్తోందో మీరే స్వయంగా  చూడండి .రండి"అంది.
పావురం దారి చూపుతుంటే ఠీవిగా కదిలింది సింహం.మృగరాజు వెంట జంతువులు, పక్షులు నడవసాగాయి. సమీరం నివాసానికి చేరుకున్నాయి.అక్కడ సమీరం అనారోగ్యంతో పడుకుని బాధపడుతున్న తనతల్లికి సేవలు చేస్తూ కనిపించింది. మృగరాజును చూసి దగ్గరకు వచ్చి నమస్కరించింది.
సింహం రాకకు కారణం తెలుసుకున్న కోతి "మహారాజా!నన్ను కని, పెంచి పెద్దచేసింది అమ్మ. ఆహారం ఎలా సంపాదించుకోవాలో, ఎలాజాగ్రత్తగా ఉండాలో నేర్పింది అమ్మ. మనసమాజంలో మంచి ప్రవర్తనతో ఎలా మెలగాలో నేర్పి, నన్ను తీర్చిదిద్దిన మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంటే నేను వేడుకకు వచ్చి, ఆనందంగా ఎలా ఉండగలను? అమ్మను దగ్గర ఉండి చూసుకుంటున్నాను" అంది.
"మహారాజా!తల్లిదండ్రులు పిల్లలకు ఏలోటు రాకుండా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు.మరి తల్లిదండ్రులను అదేవిధంగా చూసుకోవలసిన బాధ్యత పిల్లలపై ఉంటుంది కదా!"అంది పావురం.
"నిజమే!ఈలోకంలో తల్లిదండ్రులను మించిన కానుక పిల్లలకు ఏదీలేదు. 'అమ్మా నాన్నల క్షేమం తర్వాతనే ఏదైనా' అని ఈదినం మనకు సమీరం మంచి సందేశాన్ని కానుకగా ఇచ్చింది. ఈసందేశమే నా కుమారుడి పుట్టినరోజుకు సమీరమిచ్చిన విలువైన కానుకగా భావిస్తున్నాను" అంటూ అభినందించింది సింహం.
ఇతరులమీద చాడీలు చెప్పి వినోదించే నక్కకు నాలుగు దెబ్బలు బహుమతిగా ఇచ్చి ఆఅడవినుండి వెళ్లకొట్టిందిసింహం.
ప్రతిఒక్కరూ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని శాసించింది.

కామెంట్‌లు
Yalamarthy Anuradha చెప్పారు…
ఇప్పటి వారికి కావాల్సిన సందేశం.బాగుంది.