తెలుగు పల్లె పట్టణాల్లో హరికథ వినని వారు ఎవరు ఉండరు. 'జై శ్రీ మద్రమారమణ గోవిందా! అనే గోవింద నామాన్ని వినని వారు ఉండరు. హరికథకులను'భాగవతులు'అని పిలుస్తారు. హరికథ అంటే ప్రధానంగా శ్రీహరి గుణగానం చేసే కథ అని అర్థం. కానీ క్రమంగా శివుడు, శక్తి మొదలైన ఇతర దైవతాల మీద చెప్పే కథలకు కూడా హరికథలనే సామాన్య నామం ఏర్పడింది.
పురాణాలలో నారద మహర్షి తంబూర, చిరుతలు ధరించి, వాడ వాడలా విష్ణు కథను ప్రచారం చేశారని, అందువల్ల హరి కథ సంప్రదాయం'నారద'పద్ధతికి సంబంధించిందని పెద్దలు చెబుతారు.
ఒకవైపు పురాణ శ్రవణం ద్వారా జ్ఞానాన్ని, జీవిత విధానంలోని ధర్మసూక్షాలను గ్రహించడానికి అవకాశం ఉండగా, హరి కథ ఒక సమగ్ర కళారూపమై అన్ని కళలను తనలో నింపుకొన్న కారణం చేత'సమాహార కళ'అని పేర్కొంది.
హరికథ కుడు పరమ పవిత్రుడు. కథాగానం చేసి బ్రతికే అతని జీవితం చక్రవర్తి జీవితం కన్నా గొప్పది. అందుకే అన్నమాచార్యులు ఒక సంకీర్తనలు ఇలా అన్నారు.
ఎమ్మిని పుణ్యాలు చేసి ఇలా ఏలవచ్చు గాక/
కమ్మీ హరిదాసుడు కావచ్చునా?
పడద్రోసి పంగనామాలు పెడితే దాసరి అవుతాడా? అనే ఒక సామెత ఉంది. హరి భక్తి జన్మ సిద్ధంగా అబ్బిన పుణ్యాత్ముడు మాత్రమే హరికథాగానం చేయడానికి తగినవాడు. ఆహార విహార నియమాలు గలవాడు, సత్ ప్రవర్తన గలవాడు, ధనాశ లేనివాడు, పర కాంతల్ని తల్లితో సమానంగా గౌరవించే సంస్కార మున్న భక్తుడు మాత్రమే ఈ వృత్తికి అర్హుడని భావించడం వల్ల ఇది సంప్రదాయ కళ అవుతున్నది.
హరికథలో గీతాత్మకమైన వచనం, మధురమైన కంఠం తోటి పద్యం, రమనీయమైన వాద్య విన్యాసం తోటి కీర్తన, చమత్కార సంభాషణ, నాటకీయత, ధర్మబోధ, అన్నీ కలిసి ఉంటాయి. నీతి బోధ చేయడానికి మధ్య మధ్యలో పిట్ట కథలకు ప్రాధాన్యం ఉంది.
హరికథ పుణ్యప్రదమైన కళారూపంగా గౌరవాన్ని పొందింది. కథకుడు భాగవతుడు కావడం వల్ల పాదా నమస్కారాన్ని పొందే అర్హత కలిగినవాడు అయ్యాడని పెద్దలు చెప్తారు. సీతా కళ్యాణం, సుభద్రా కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, గిరిజా కళ్యాణం, రుక్మిణి కళ్యాణం ఇలాంటి కథలు ఎన్నుకుంటారు. ఆదిభట్ట నారాయణ దాసు గారి కృషి వల్ల తెలుగు హరికథ సంగీత సాహిత్య సమాహార కలగా మహాప్రబంధంగా యక్షగానం లాగా సుప్రసిద్ధి పొందింది. తెలుగువారి సాంస్కృతిక వారసత్వంలో భాగమైంది.
హరికథ.; - తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి