మా అమెరికా అనుభవాలు: - పోణంగి బాల భాస్కర్



 రిచ్మండ్ లోని జేమ్స్ నదీ తీరంలో ఓ సాయంత్రం ... 



2018 మే నెల 12వ తేదీ మధ్యాహ్నం రిచ్మండ్ లోని Maymont Park చూసిన తర్వాత దానికి సమీపంలోనే ఉన్న James River దగ్గరకు వెళ్ళాము. 
దారి పొడవునా, అలాగే నది ఒడ్డునా పెద్ద, చిన్నా చెట్లు చాలా దట్టంగా ఉన్నాయి.  దీంతో ఆ చుట్టుపక్కల అంతా వాతావరణం ఎంతో చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది. 
 ఈ రోజు ఉదయం నుంచీ ఎండ వేడి బాగా ఉండడం,  ఈ రోజు ఆదివారం కూడా కావడంతో మధ్యాహ్నం నుంచే పెద్ద సంఖ్యలో సందర్శకులు నదీ తీరానికి వచ్చినట్లున్నారు. మేము అక్కడకు చేరుకునే సమయానికి చాలా మంది తిరిగి వెళ్లి పోతున్నారు. అందువల్ల మా వాహనానికి సులువుగా పార్కింగ్ దొరికింది.  
జేమ్స్ నది ఒడ్డున చాలా చోట్ల కిందకి దిగడానికి అనువుగా ఉంది.  అయితే సహజంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో కాబోలు - అక్కడ సందర్శకుల సౌకర్యం కోసం పెద్దగా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమీ చేయలేదు.  కొన్ని చోట్ల కేవలం FISHING మాత్రమే చేయడానికి అనుమతిస్తున్నట్లు బోర్డులు పెట్టారు. 
ఇక్కడ నది చాలా వేగంగా ప్రవహిస్తోంది.  అయినా పిల్లలు, పెద్దలు అందరూ భయం లేకుండా నీటిలోకి దిగి ఆడుతున్నారు, ఈత కొడుతున్నారు.  కొంతమంది పిల్లలు - పెద్దవాళ్ళ పర్యవేక్షణ లేకుండానే నీళ్ళలోకి దిగి అటూ ఇటూ తిరుగుతూ, ఈత కొడుతూ ఆడుతూంటే - మాకు చాలా ఆశ్చర్యం, భయం కలిగాయి.  
మేము మాత్రం ఒడ్డుకు దగ్గరలో, నదిలో ఉన్న పెద్ద పెద్ద రాళ్లపై కూర్చుని, నీళ్లలో కాళ్ళు పెట్టి, పరవళ్లు త్రొక్కుతున్న నదీ ప్రవాహాన్నీ చుట్టూ వాతావరణాన్నీ తనివితీరా ఆస్వాదించి, ఆనందించాము. 
నదికి రెండు వైపులా దట్టమైన చెట్లు, మధ్యలో వేగంగా ప్రవహిస్తున్న జేమ్స్ నది అందాలు చూడడానికి రెండు కళ్ళూ చాలవనిపించింది. 
ఏది ఏమైనా వారం రోజులపాటు క్షణం తీరిక లేకుండా కష్టపడి పనిచేసి వారాంతంలో ఎలా ఎంజాయ్ చేయాలో - అమెరికా వాసులను చూసి నేర్చుకోవాలి. 
ఏమంటారు ?
🌸🌷🌸
కామెంట్‌లు