సుప్రభాత కవిత ; -బృంద
చీకటిలో ఆలోచనలు
దున్నుతున్న కనులు
కలల  నారు పోసి
ఆశల  మొలకలు నాటి
అదును కోసం ఆత్రంగా
ఎదురు చూసే  మనసుకు
ఎదురయే ఉషోదయం...

జ్యోతి కలశం నుండీ
జాలువారిన వెలుగు సోనలు
ఆవరించిన నారింజరంగులు

గగనపు దోసిలి నిండి
భువనపు శిరస్సు మీదికి
కురుస్తున్న వెలుగు రవ్వలు

చుట్టూ చిమ్మిన రంగుల మధ్య
తలంబ్రాలు పోయించుకున్న
ముచ్చటైన  వధువులా
మురిసే  ముగ్దమోహన ఇలాతలం

అరుణోదయ కాంతులు
నిండిన జగమంతా
పెళ్ళిపందిరిలా భాసిస్తోంది

వేడుకతో  ప్రతి మనసూ
మురిసేను
వేకువలో వెతలన్నీ చిత్రంగా
మరిచేను

వెలుగు తెచ్చే ఉత్సాహం 
వేకువ ఇచ్చే ధైర్యం 
ఉదయం కోసం ఎదురుచూసే
హృదయాలకే తెలుసు..

చక్రభ్రమణపు మాయాజాలం
తొలిసంధ్య కమనీయ దృశ్యం 
పుడమికి పుత్తడి రంగులు అద్ది
ప్రభాత కిరణాలు చిత్రించే
అద్భుత చిత్రపు  ఆవిష్కారం

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు