నయవంచన చేయకుమా!; - ::త్రిపురారి పద్మ.-జనగామ.
పల్లవి::
ఆడపిల్ల జీవితంతో  ఆటలెందుకూ?
నిను పెంచిన తల్లి మనసు విరుచుటెందుకూ?
చదువుసంధ్యలన్ని వదిలి మెలుగుటెందుకు?
అరాచకాల బాటలోన వెళ్ళుటెందుకు?
       "ఆడపిల్ల"
చరణం::
తల్లిదండ్రి ఆశలన్ని పండించే కూతురిగా
వెలగాలని ఆశపడ్డ అమ్మాయిల భవితవ్యం
బూడిదగా మార్చుతున్న నేరాలకు అడ్డెపుడు?
ధైర్యంగా ఆడపిల్ల నడిచేది ఎపుడెపుడు?
        "ఆడపిల్ల"
చరణం::
ప్రేమకైన,చదువుకైన,సమాజాన సేవకైన
ముందుండే ఆడపిల్ల కోరుతుంది భరోసా
అన్నవైన, తమ్ముడైన,కనిపెంచే నాన్ననైన
నీలోనే చూస్తుంది ఆలకించు ఓ యువకా!
     "ఆడపిల్ల"

చరణం::
ప్రకృతికే అపురూపం
ఆడపిల్ల ప్రతిరూపం
దయాగుణమె ఆమెకున్న
అతిగొప్ప ఆభరణం.
     "ఆడపిల్ల"

చరణం::
ప్రేమ పంచి,పెద్ద చేసి
ధరణిపైన నిలుపుమా
నయవంచన చేయకుండ
మంచితనమె చూపుమా.
       "ఆడపిల్ల"


కామెంట్‌లు