న్యాయాలు -48
ఖల్వాట తాళ ఫల న్యాయము
******
ఖల్వాటుడు అంటే బట్టతల వ్యక్తి, ఇంద్ర లుప్తకుడు, ఖలతి, బభ్రువు అనే అర్థాలు ఉన్నాయి.తాళము అంటే తాటి చెట్టు.
ఓ రోజు బట్ట తల వ్యక్తి ఎండలో ప్రయాణం చేస్తూ ఉంటాడు.ఎండ వేడిమికి తట్టుకోలేక చుట్టు పక్కల ఏ చెట్లూ లేక పోవడంతో నీడ కోసం తాటి చెట్టు క్రింద నిలబడతాడు. తాటి చెట్టు ఎంత ఎత్తుగా ఉంటుందో, మనందరికీ తెలుసు. దాని నీడ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
తప్పని సరై అక్కడ నిలబడిన అతడిపై తాటిపండు రాలి పడి తల పగలడాన్ని ఖల్వాట తాళ ఫల న్యాయము అంటారు.
అసలే బట్టతల అందులోనూ ఎండ వేడిమి.అది తట్టుకోలేక వెళ్ళిన అతనికి అక్కడా దురదృష్టం వెంటాడి తల పగిలింది.ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే ఖల్వాట బిల్వీయ న్యాయముతో కూడా పోలుస్తారు.
బిల్వ వృక్షము అంటే మారేడు చెట్టు. ఇక్కడ కూడా ఎండ వేడిమి నుంచి రక్షించుకోవడానికి మారేడు చెట్టు కిందకు వచ్చినప్పుడు అతడి తలపై మారేడు కాయ పడి గాయమవడం.
దీనినే తెలుగులో "మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు" అంటారు.
నక్క దాని ఆరోగ్యం బాగా లేక ముక్కుతూ మూల్గుతూ తాటి చెట్టు క్రిందకు వస్తుంది.కానీ అక్కడా దురదృష్టం వెంటాడుతూ తాటికాయ మీద పడుతుంది.
ఇలాంటి బాధాకరమైన పరిస్థితులు వెంట వెంటనే ఎదురైనప్పుడు ఈ ఖల్వాట తాళ ఫల న్యాయమునో, ఖల్వాట బిల్వీయ న్యాయమునో ఉదాహరణగా చెప్పుకోవడం చూస్తుంటాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
సునంద భాషితం ; - వురిమళ్ల సునంద, ఖమ్మం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి