సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -47
ఖల మైత్రీ న్యాయము
*****
ఖలుడు అంటే నీచుడు, దుష్టుడు  అనే అర్థాలు ఉన్నాయి.
మైత్రీ అంటే స్నేహం,నెయ్యము,చెలిమి, దోస్తానా అనే అర్థాలు ఉన్నాయి
ఖల మైత్రీ అంటే  దుష్టుడితో స్నేహం ఎప్పటికైనా అపాయకరమే అని అర్థంలో ఈ ఖల మైత్రీ న్యాయమును ఉదాహరణగా చెబుతూ ఉంటారు.
 దుష్టుడి  గురించి సుమతీ శతక కర్త ఓ చక్కని పద్యం రాశారు.
తల నుండు విషము ఫణికిని/వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్/తల తోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
పాముకు కేవలం తలలో మాత్రమే విషం ఉంటుంది. తేలుకు తోకలో ఉంటుంది.కానీ దుష్టుడైన వ్యక్తికీ నిలువెల్ల అంటే మనసు,శరీరాల మొత్తంలో విషమే ఉంటుందని .దుర్మార్గుడైన వ్యక్తి చాలా ప్రమాదకారి అని ఈ పద్యం చెబుతుంది.
ఇంకా పెద్దలు  దుష్టులతో స్నేహం " పడగ నీడ లాంటిది అని కూడా అంటారు. 
నీడ కదా! అనుకుని తలదాచుకుంటే అదెప్పుడు కాటు వేస్తుందో తెలియదు. దుష్టుల స్నేహం కూడా అంతే.
వీళ్ళతో  స్నేహాన్ని పూర్వాహ్ణ చ్ఛాయతో కూడా పోల్చవచ్చు.
పూర్వాహ్ణం అంటే మధ్యాహ్నానికి ముందు సమయం  ఛాయ అంటే నీడ. మొదట్లో  అనగా ఉదయం నీడ పొడవుగా ఉండి మధ్యాహ్నానికి పూర్తిగా తగ్గిపోతుంది.
అంటే  మాయ మాటలతో ఎంతో గొప్ప స్నేహంలా భ్రమింపజేస్తాడు. రాన్రానూ అయడెలాంటి వాడో అర్థం అవుతుంది.
  అందుకే పెద్దలు  "మంచి స్నేహం పదిచ్చి కొనుక్కోవాలి."  "చెడు స్నేహాన్ని వంద ఇచ్చి వదిలించుకోవాలి" అంటారు.
ఖల మైత్రీ కలలో కూడా చేయకూడదని ,ఈ న్యాయము ద్వారా తెలుసుకోవచ్చు. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు