అక్షర సంపత్తి;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అక్షరాలు ఏరుకుంటా
పూసల్లా గుచ్చుతా
పువ్వుల్లా అల్లుతా
దండలుగా మారుస్తా

పైసల్లా దాస్తా
పక్షుల్లా ఎగిరిస్తా
ముత్యాల్లా మాలచేస్తా
గోళీల్లా ఆడుతా

బంతుల్లా విసురుతా
దీపాల్లా వెలిగిస్తా
చక్రాల్లా తిప్పుతా
బొమ్మల్లా కొలువుపెడతా

తారకల్లా తళతళలాడిస్తా
మేఘాల్లా తేలాడిస్తా
మెరుపుల్లా మెరిపిస్తా
చినుకుల్లా కురిపిస్తా

విత్తనాల్ల విసిరేస్తా
మొక్కల్లా మొలకెత్తిస్తా
పూవులు పూయిస్తా
కాయలు కాయిస్తా

అందాలు చూపిస్తా
ఆనందాలు పంచేస్తా
మెతుకుల్లా మింగిస్తా
మనసుల్లో నిలిపేస్తా

పెదవులతో పలికిస్తా
శబ్దాలు వినిపిస్తా
రాగాలు ఆలపిస్తా
పాటలు పాడిస్తా

కలముతో గీకేస్తా
కాగితాలపై చెక్కెస్తా
కవితలగా కూర్చుతా
కమ్మగా చదివిస్తా


కామెంట్‌లు