నగ్నమైన మాటల్ని
ఇప్పుడిప్పుడే మంటల్లో కాల్చి
నాలుకలపై
పదును పెడుతున్నారు వాళ్లు!!
నాలుగు గోడల మధ్యనే
గుండెల్ని పేల్చి
రక్తం గడ్డ కట్టించి
బహిరంగంగానే
సర్కారు వారి పాట పాడుతున్నారు!!
ఊరు ఏరైందీ
ఏరు కన్నీరు అయింది
కన్నీరు సముద్రమైంది
సముద్రం కన్నైందీ
ఎగిరే కనురెప్పలు ఇప్పుడు
సముద్రాలు దాటాల్సిన
అవసరం లేదు
కన్నులు మూసుకుంటే చాలు!!!
Pమాటలు బట్టలు లేకుండానే
బ్రతికేస్తున్న సమాజం ఒకటి
అరణ్యాల మధ్యలో బయటపడింది
ఊపిరిని కొత్తగా పీల్చుకోవాల్సి వచ్చింది!!?
రాళ్లను పగలగొట్టే చేతుల్ని
తయారు చేస్తున్న చేతుల్ని
నరికేస్తుంటే
తూర్పు ఎర్రని రక్తం
వాంతికి చేసుకుంటుంది!!!
ఉక్కు కండల్ని చెక్కుతున్న ఉలీ
తొలిసారి చెలి అర్ధనగ్న శిల్పాలని
చూసి సిగ్గుపడుతుంది!!
విషం రంగు రుచి ఎలా ఉంటుందో
తెలుసుకోవాలంటే
అమృతం తాగాల్సిందే!!!
పిలుపుతో చిగురించే చెట్టు
తప్పకుండా
చిలుక కోసం వేచి ఉంటుంది!!
యవ్వనం నవ్వితే
ఆకాశం పక్షుల గుంపులో
లోకం మర్చిపోయి తప్పిపోయింది!!?
ప్రేమ పుట్టింది మట్టిలోనేనని
తెలుసుకున్న చెట్టు
మట్టిని ప్రేమించి మట్టితోనే బ్రతికింది
చివరకు మట్టిలోనే కలిసిపోయింది!!?
అసూయ పడ్డ నక్షత్రాలన్నీ
భూమికి దిగి
మనుషులై పుట్టాయి!!!
అద్భుతం అనుకున్న చంద్రుడు
ఇప్పుడు మురుగుకుంటల్లో
కంటబడుతున్నాడు!!
తెల్లని వెన్నెల చల్లగా
ఉంటుందని నమ్మిన ఎడారి
తెల్లారితే బాగుండునని
గుండెలు బాదుకుంటున్నది!!
ఆశీస్సులు పొందిన నదులు
నిశ్చింతగా నిద్రపోతున్నవీ
అవి తెల్లారితే కదులుతాయి!!!?
అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
President Sri Sri Kala Vedika.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి