సునంద భాషితం ; -వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -64
గ్రామ దూర న్యాయము
******
గ్రామము అంటే పల్లె లేదా ఊరు. 
ఒక ఊరికి మరొక ఊరికి మధ్య దూరాన్ని  చెప్పడమే గ్రామ దూరం.
 కొలతలతోనో, కిలోమీటర్లలోనో  చూస్తే 'ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరంలో ఉంటుందో,ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరంలో ఉంటుంది.' మరి అందులో ప్రత్యేకత ఏముంది అనిపిస్తుంది కదా!
 కానీ దీనినే వ్యక్తుల మధ్య ఇచ్చిపుచ్చుకునే వైఖరి, ప్రవర్తన, మర్యాద మన్ననకు సంబంధించిన న్యాయంగా వర్తింప చేయడం జరిగింది.
 మన ప్రవర్తన బట్టే ఎదుటి వారి ప్రవర్తన ఉంటుందని చెప్పడమే ఈ న్యాయం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
కొందరు వ్యక్తులు తాము చాలా గొప్ప వాళ్ళుగా, ప్రత్యేకమైన వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు. తాము వెళ్ళిన చోట తమ ప్రత్యేకతకు దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదని  బాధ పడుతూ ఉంటారు.కానీ అలాంటి సందర్భాల్లో తాము ఇతరుల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో గుర్తుంచుకోరు.
తమ ప్రవర్తన, గౌరవించే తీరును బట్టే ఎదుటి వారి ప్రవర్తన, గౌరవం ఉంటాయని అర్థం చేసుకోని వారికి వేసే  చురకే ఈ న్యాయము.
నేడు తల్లిదండ్రులు,పిల్లల మధ్య ఉన్న బంధాలు, అనుబంధాలు కూడా ఇలాగే ఉండటం బాధాకరం.
కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి, బాగా సంపాదించాలనే కోరికతో  చిన్నప్పటి నుండే వాళ్ళను తమకు  దూరంగా ఎక్కడో ఉన్న పాఠశాలల్లో  చేర్పిస్తున్నారు.ఆ పసి వయసులో వారికి తల్లిదండ్రుల నుండి అందవలసిన ప్రేమ, ఆప్యాయతా అనురాగాలు, కుటుంబ పరమైన సంస్కృతి, విలువలు సరిగా అందడం లేదన్నది వాస్తవం.అక్షర సత్యం .
తాము అనుకున్న విధంగా పిల్లలు ఉద్యోగాలైతే సాధిస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర శేష జీవితాన్ని గడపాలనుకుంటే మాత్రం నిరాశే మిగులుతోంది.తాము చిన్నప్పుడు వాళ్ళను దూరంగా ఎలా ఉంచారో అలాగే తల్లిదండ్రులను కూడా పిల్లలు అలాగే దూరంగా ఉంచుతున్నారు.
కారణం అర్థమవుతుంది కదా! దీన్ని ఒక విధంగా గ్రామ దూర న్యాయమనీ,  ఇచ్చి పుచ్చుకోవడమనే  ఆదాన ప్రదానాలకు చెందినదని తెలుసుకోవాలి.
మనిషి జీవితమే ఇచ్చి పుచ్చుకోవడంతో ముడిపడి ఉంది.ఇందులో ప్రేమ గౌరవం,దయ,దానం, సహకారం లాంటివి ఎన్నో ఉంటాయి. ఎదుటివారికి ఇవన్నీ మనస్ఫూర్తిగా ఇవ్వగలిగితే  ఇతరుల నుండి కూడా వాటిని పొందే అవకాశం ఉంటుంది.
ఇలా ఈ గ్రామ దూర న్యాయాన్ని  మన నిత్య జీవితంలోని అనేక విషయాలకు అన్వయించుకోవచ్చు,ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు