నేను కేవలం అక్షరాల సముదాయమో..
వాక్యాల సంకలనమో కాదు..
ఎందరో రచయితల
కవులు, కవయిత్రులు
శాస్త్రవేత్తల, చరిత్ర కారుల
పండితుల మేథో మధనాన్ని..
నేను కేవలం కాగితపు పుటల
సంకలనాన్నో..
అందాల బొమ్మల ఆటవిడుపునో కాదు..
గత చరిత్ర సాక్ష్యాన్ని ..
వర్తమానపు పాఠాన్ని..
భవిష్యత్ తరాలకు దిక్సూచిని.
నేను కేవలం కాలక్షేపపు పొత్తాన్ని కాదు..
పొట్లాలు కట్టుకునే చిత్తు కాగితాన్ని కాను..
వేదాలు నేనే.. పురాణాలు నేనే
భాగవతం నేనే, రామాయణం నేనే
భగవత్ గీతను నేనే
ఖురాన్ నేనే, బైబిలూ నేనే..
పంచమ వేదం భారతమూ నేనే..
నేను కేవలం హస్త భూషణాన్ని కాదు..
అల్మారా లో అలంకరించే వస్తువుని కాను
అపర విజ్ఞానం పంచే విరించినీ నేనే
అంధకారపు పోగెట్టే సూర్యుడిని నేనే..
ఊహాల ఊయలో తేలియాడించే
అద్భుత కావ్య కన్యకను నేనే..
నేను కేవలం కథల సంకలనమో కాదు..
తల క్రింద పెట్టుకునే దిండునూ కాను
కన్నీటి కథల బతుకు చిత్రాన్ని
ఆపన్నులకు స్నేహ హస్తాన్ని..
కోట్లాది మెదళ్ళకు మేతని..
భావి తరాలకు మార్గదర్శిని..
అక్షర జ్ఞానం పంచే అపర సరస్వతిని..
నేను కేవలం కొట్టులో దొరికే వస్తువును కాను..
సంచిలో దాచుకునే చిత్తరువును కాను
ఉద్యోగార్థులకు గ్రంథాలయంలో దొరికే నిఘంటువుని...
విద్యార్థులకు రేపటిని పరిచయం చేసే ఆయుధాన్ని..
పరిశోధకులకు..
అనుభవాల మేల్కొలుపును
అపార జ్ఞాన భాండాగారాన్ని ..
నేనే పుస్తకాన్ని
వెల కట్ట లేని నేస్తాన్ని..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి