ఉడుతా భక్తి
==========
అందరూ సంకల్పించిన ఓ మంచి పనిని పూర్తి చేయడానికి ఎవరికి తోచిన సాయం వారు చేస్తారు. స్థోమత లేనివారు కూడా తమకు తోచిన, చేయగలిగిన పనిని చేసి తమ ఉదారతను చాటుకుంటారు. అలాంటప్పుడు *ఉడతాభక్తి* గా ఈ సాయం చేసామని చెప్పుకొంటారు.
'ఉడుతా భక్తి'అనేది రామాయణం లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఉద్భవించిన నానుడి. ఓ కథ ఆధారంగా ఇది లోకోక్తి అయింది. రాముడు సీత జాడ తెలుసుకుంటాడు. సీత లంక రాజ్యంలో రావణుని వద్ద ఉంటుంది. లంకకు చేరాలంటే పెద్ద సముద్రం దాటాలి. సైన్యమంతా లంకలో కి వెళ్ళాలంటే ఒక వారధి కావాలి. అందువల్ల సముద్రంపై వారధి నిర్మించాలని భావించారు.
హనుమంతుడు, సుగ్రీవుడు వంటి బలవంతులు తమ వానర సైన్యంతో పెద్ద పెద్ద బండరాళ్లను తెచ్చి సముద్రంపై దారి ఏర్పాటు చేస్తున్నారు. అక్కడున్న వారంతా ఏదో ఒక పని చేస్తూ వారధి నిర్మాణంలో సాయం చేస్తున్నారు. ఈ సంఘటనను ఓ ఉడుత చూస్తూ ఉంది. ఉడుత చిన్న ప్రాణి. తానేం చేయగలదు పాపం. అయినా ఏదో ఒక సాయం చేయాలనే తలంపు కలిగింది. వెంటనే సముద్రపు నీళ్లతో ఒళ్ళు తడుపుకుని ఒడ్డునున్న ఇసుకలో పొర్లాడి, వంటికి అంటిన ఇసుక రేణువులను పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలో వేయటం మొదలు పెట్టింది. ఉడుత చేయగలిగిన పని ఇదే కదా? అంతకన్నా పెద్ద పనులు చేయలేదు. శ్రీరాముడు ఇది గమనించి దాన్ని పట్టుకుని మృదువుగా తన మూడు వేళ్ళతో సృసించాడు. అందుకే దాని వీపు పై మూడు గీతలు కనబడుతూ ఉంటాయి.
సమాజం కోసం చేస్తున్న బృహత్ కార్యక్రమంలో అంకితభావంగా పాల్గొని, తమకు చేతనైన రీతిలో తమ భక్తి శ్రద్ధలను ప్రకటించి, నిజాయితీగా, చిత్తశుద్ధిగా చేసేటప్పుడు ఈ 'ఉడుతాభక్తి' నానుడి వాడతారు.
నానుడి కథలు ;- *౼ డా.దార్ల బుజ్జిబాబు*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి